*AIS మహిళా అధికారులతో ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టళ్ల తనిఖీలు*
– *సి.ఎస్ శాంతి కుమారి*
హైదరాబాద్, జనవరి 9 :: రాష్ట్రంలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టళ్లను ప్రత్యేకంగా ఆల్ ఇండియా సర్వీసుల(AIS)మహిళా అధికారులు స్వయంగా తనిఖీ చేసి, హాస్టళ్లలో రాత్రి బసచేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.
రాష్ట్రంలో 540 బాలికల సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, ఈ హాస్టళ్లలో విద్యాప్రమాణాలు పెంచడంతో పాటు ఇటీవల పెంచిన డైయిట్ చార్జీల ప్రకారం బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తోందని పేర్కొన్నారు. ఈ హాస్టళ్లలో AIS మహిళా అధికారుల తనిఖీలపై నేడు సంబంధిత ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సి.ఎస్. మాట్లాడుతూ, రాష్ట్రంలో 540 ఎస్.సి., ఎస్.టి. బీసీ, మైనారిటీ విభాగాల బాలికల హాస్టళ్లున్నాయని, ఈ హాస్టళ్లను తొలిదశలో 29 మంది మహిళా ఐ.ఏ.ఎస్ అధికారులు సందర్శించి ప్రస్తుత పరిస్థితులను స్వయంగా పరిశీలించి, హాస్టళ్లలో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు,వీటిని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు ప్రతిపాదనలను అందచేస్తారని వివరించారు.
ఈ తనిఖీలు గురించి ఇప్పటికే సవివరమైన మార్గదర్శకాలను రూపొందించామని తెలిపారు. కామన్ డైయిట్ నిర్వహణ, విద్యా ప్రమాణాలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, హాస్టళ్ల నిర్వహణ తదితర అంశాలపై ఈ మహిళా అధికారులు పరిశీలిస్తారని వెల్లడించారు. ఈనెల 25 వ తేదీ లోపు తొలిదశ తనిఖీలు పూర్తి చేస్తారని సి.ఎస్ తెలిపారు. తొలిదశ తనిఖీలు ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ పై సవివరమైన సమీక్ష చేపడతామని అన్నారు. తదుపరి అన్ని స్థాయిల AIS అధికారులతో సంక్షేమ హాస్టళ్ల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని సి.ఎస్ శాంతి కుమారి వెల్లడించారు. ఎస్.సి. డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, ఇతర అధికారులు టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
-----------------
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box