భూ దోపిడీ పై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తాం -మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 *కాపలా కుక్కలు వేట కుక్కలుగా మారి భూ దోపిడి చేశాయి*

*భూ దోపిడీ పై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తాం*

*తప్పు చేసింది ఆ దొరవారు, శిక్ష అనుభవించింది అమాయక ప్రజలు*

*రెండు పిల్లుల రొట్టెక‌థ ఈ ధ‌ర‌ణి*

*మద్దెల కృష్ణయ్య పరిస్థితి మరొకరికి రాకుండా భూ భారతి చట్టం*



*-  శాస‌న‌స‌భ‌లో శుక్ర‌వారం భూభార‌తి 2024 రెవెన్యూచ‌ట్టంపై చ‌ర్చ సంద‌ర్భంగా* 

*రెవెన్యూ , హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారి ప్ర‌సంగం*

** * **

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు రాష్ట్రానికి కాప‌లా కుక్క‌లా ఉంటాన‌న్న గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌లు వేట‌కుక్క‌లుగా మారి అందిన‌కాడికి దోచుకున్నారు. కాప‌లా కుక్క‌లు వేట కుక్క‌లుగా మారి రాష్ట్రంలో భూదోపిడీ చేశాయని ఈ దోపిడి పై ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తామని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  అసెంబ్లీలో   ప్రకటించారు.


"స‌మాజంలో అట్టడుగు వ‌ర్గాలు మొద‌లుకొని భూ య‌జమానుల‌కు మేలు చేసే విధంగా విస్తృత స్ధాయిలో ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌తో రూపొందించిన 2024 భూ భార‌తి చ‌ట్టం అక్ష‌రాలా భూ య‌జ‌మానుల‌కు చుట్టం.


ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014కు ముందు కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు తీసుకువ‌చ్చిన రెవెన్యూ చ‌ట్టాలు, సంస్క‌ర‌ణ‌లు రైతాంగానికే కాకుండా యావ‌త్తు ప్ర‌జానీకానికి ఎంతో మేలు చేశాయ‌ని చెప్ప‌డానికి గ‌ర్వ‌ప‌డుతున్నాను. 


అదే నిబ‌ద్ధ‌త‌, అదే ఆశ‌, ఆశ‌యాల‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రవేశపెట్టిన భూ  భారతి 2024 రెవెన్యూ చ‌ట్టం నిజ‌మైన ప్ర‌జా చ‌ట్టం - అక్ష‌రాలా భూమి ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి చుట్టం.


దేశ రైతు చ‌రిత్ర‌ను స‌రికొత్త సంస్క‌ర‌ణ‌ల‌తో లిఖించిన ముగ్గురు వ్య‌క్తుల గురించి ఇక్క‌డ చెప్పాలి. అదృష్ట‌వ‌శాత్తూ ఈ సంస్క‌ర‌ణ‌ల త్ర‌యం తెలంగాణ బిడ్డ‌లే కావ‌డం మ‌రో విశేషం. భూక‌మ‌తాల ప‌రిమితి చ‌ట్టం తెచ్చిన నాటి ముఖ్య‌మంత్రి, తెలుగు ప్ర‌ధాని శ్రీ పివి న‌ర‌సింహారావు గారు, కౌలు రైతుల‌కు మేలు చేసే విధంగా ర‌క్షిత కౌలుదారి చ‌ట్టం తీసుకువ‌చ్చిన నాటి ముఖ్య‌మంత్రి శ్రీ‌ బూర్గుల రామ‌కృష్ణారావు గారు, అదేవిధంగా జాగీర్ల ర‌ద్దులో కీలకంగా వ్య‌వ‌హ‌రించిన మాజీ ఉప ముఖ్య‌మంత్రి కొండా వెంక‌ట రంగారెడ్డి గారు మాకు దిశానిర్దేశ‌కులు అని ఇక్క‌డ చెప్పాలి. ఇప్పుడు వారి అడుగుజాడ‌ల్లో ప్రజోప‌యోగ‌మైన ఈనూత‌న రెవెన్యూ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చాం


మ‌న రాష్ట్రానికి సంబంధించి  ఒక్కసారి గత చరిత్రను పరిశీలిస్తే భూమి కోసం, భుక్తికోసం... వేలాది పీడిత రైతులు, కూలీలు పాల్గొన్న తెలంగాణ సాయుధ పోరాటం...చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.


ఈ ఉద్య‌మానికి ప్ర‌ధాన‌మైన కార‌ణం నిజాం కాలంనాటి భూ స‌మ‌స్య‌లే నిజాం సంస్ధానంలోని ఉద్యోగులు, జాగీర్ధారులు, దేశ్‌ముఖ్‌లు, దేశ్ పాండే లాంటి భూస్వాములంతా.... అధికార ద‌ర్పంతో ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించారు.


వేలాది పుస్తకాలు చదివిన అపర మేధావిగా..... న‌యా నిజాంగా పేరు ప్రఖ్యాతులు పొందిన గత ప్రభుత్వ పెద్దలు... ధ‌ర‌ణి సృష్టికర్త కూడా ఇదే విధంగా వ్య‌వ‌హ‌రించారు.


ధ‌ర‌ణి సమస్యలను పరిష్కరించకలేకపోవడం, క్షేత్ర‌స్ధాయిలో బాధితుల బాధను అర్థం చేసుకోకుండా ధరణిలో ఎలాంటి సమస్యల్లేవంటూ ధ‌ర‌ణి సృష్టిక‌ర్త బుకాయించారు.


 *రెండు పిల్లుల రొట్టెక‌థ ఈ ధ‌ర‌ణి* 


మ‌నం చిన్న‌ప్పుడు చ‌దువుకున్న   రెండు పిల్లులు రొట్టె క‌ధలాగే ఈ ధ‌ర‌ణి ఉంది.  రొట్టె పంచుకోవ‌డం కోసం  ఆ రెండు పిల్లులు  గొడ‌వ ప‌డ‌డం, ఓ కోతి వచ్చి ఆగొడ‌వ తీరుస్తాన‌ని చెప్ప‌డం, ఆ రొట్టెను 2 ముక్క‌లు చేస్తూ ఒక‌టి ఎక్కువైందని ఒక‌సారి, రెండ‌వ ముక్క ఎక్కువైంద‌ని మ‌రోసారి రొట్టెను పూర్తిగా కోతి తినేయ‌డం మ‌న‌కు తెలిసిన క‌ధ‌. ఆ కోతిలాగే గ‌త ప్ర‌భుత్వంలో కొంత‌మంది పెద్ద‌లు ప్ర‌వ‌ర్తించి భూముల‌ను దోచుకున్నారు.


ధ‌ర‌ణిలో నా భూమి నేను చూసుకొనే వీల్లేదు.  ఆనాడు అంతా ర‌హ‌స్య‌మే. ఇందిర‌మ్మ ప్ర‌భుత్వంలో దొర‌లు, సామాన్యుల‌కు ఒక‌టే విధానం. భూ భారతిలో అంతా పార‌ద‌ర్శ‌క‌మే


ఆనాటి  బ్రిటిష్ దొర‌లు జ‌మీందారులు, భూస్వాముల వంటి ద‌ళారుల‌ను సృష్టించి శిస్తుల రూపంలో దోపిడీ చేస్తే ఈనాటి దొర‌లు భూముల డిజిట‌లైజేష‌న్ పేరుతో ధ‌ర‌ణిని సృష్టించి భూదోపిడీకి పాల్ప‌డ్డారు.


 *త‌ప్పు ఒక‌రిది శిక్ష మ‌రొక‌రిది* అన్న‌ట్లుగా అనాలోచితంగా రాత్రికి రాత్రే గ‌డీల‌ మ‌ధ్య చ‌ట్టం చేసి త‌ప్పుచేసింది ఆదొర‌వారు. కానీ శిక్ష అనుభ‌విస్తుంది మాత్రం అమాయ‌క పేద‌రైతులు

ఈ రాష్ట్రంలో ఏ మండ‌లానికి వెళ్లినా , ఏగ్రామానికి వెళ్లినా ఏ మారుమూల  ప్రాంతానికి వెళ్లినా మ‌నిషి అనే వాడు ఉన్న ప్ర‌తిచోట ధ‌ర‌ణి తెచ్చిన స‌మ‌స్య‌లున్నాయి


 *సిద్ధిపేట జిల్లాలో ద‌ళిత‌రైతు ప్రాణం తీసిన ధ‌ర‌ణి* 


సిద్ధ‌పేట జిల్లా మిరుదొడ్డి మండ‌ల కేంద్రానికి చెందిన మ‌ద్దెల కృష్ణ‌య్య (73) అనే ద‌ళిత  రైతు  ఇదే గ్రామానికి చెందిన ఎం.  విజేంద‌ర్ రెడ్డి నుంచి 35 ఏళ్ల క్రితం  1452 స‌ర్వే నెంబ‌ర్‌లో ఏడెక‌రాల భూమిని కొనుగోలు చేశారు. ధ‌ర‌ణి వ‌చ్చిన త‌ర్వాత 35 ఏళ్ల క్రితం కొన్న‌భూమి వేరే వాళ్ల పేరుపై ప‌ట్టాకావ‌డంతో  మ‌న‌స్ధాపం చెంది 22.01.2023న  మ‌ద్దెల కృష్ణ్య‌య్య విష  గుళిక‌లు మింగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అటువంటి పరిస్థితి  ఇందిరమ్మ రాజ్యంలో మరొకరికి రాకుండా ఉండేలా భూ భారతి చట్టాన్ని రూపొందించాం.

 

ఈ పదేళ్లు తెలంగాణ రాష్ట్రం.. ధృత‌రాష్ట్ర కౌగిలిలో చిక్కుకుంది. ఆ పెద్ద‌మ‌నిషి చేసిన ఈ పాప ఫ‌లితాన్ని అన్యాయంగా తెలంగాణ రైతాంగం అనుభ‌వించాల్సిన దుస్ధితి దాపురించింది. 


మొహం ప‌గిలిపోయేలా ప్ర‌జ‌లు శాస‌న‌స‌భ‌, పార్లమెంటు ఎన్నిక‌ల్లో తీర్పు ఇచ్చినా బుధ్ది మార‌డం లేదు


కాంగ్రెస్ హ‌యాంలోనే ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే చ‌ట్టాలు రూపొందాయ‌ని 1971లో ప్ర‌వేశ‌పెట్టిన రెవెన్యూ చ‌ట్టం విశేష సేవ‌లందించింది.


ల‌క్ష‌లాది మంది భూ హ‌క్కుదారుల‌ను 2020 రెవెన్యూ చ‌ట్టంతో ఇబ్బంది పెట్ట‌గా నేడు ఇందిరమ్మ రాజ్యంలో భూభార‌తి పేరిట దేశానికే ఓ రోల్ మోడ‌ల్ గా ఉండే రెవెన్యూ చ‌ట్టం ప్ర‌వేశ‌పెట్ట‌డం నా అదృష్టం.


రాష్ట్రంలో గుంట భూమి ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఆస‌క్తిగా ఎదురుచూసే భూభార‌తి చ‌ట్టాన్ని  స‌భ‌లో ప్ర‌వేశ‌పెడుతుండ‌గా సీనియ‌ర్‌ల‌మ‌ని చెప్పుకొనే కొంత‌మంది ఇటు ద‌ళిత స్పీక‌ర్ పైనా , కాంగ్రెస్ స‌భ్యుల‌పైనా కాగితాలు విస‌ర‌డం దుర‌దృష్ట‌కరం. స‌మ స‌మాజం సిగ్గుప‌డేలా బిఆర్ ఎస్ స‌భ్యులు ఇటువంటి గూండాయిజానికి పాల్ప‌డ‌డం దారుణం, దీనిపై స్పీకర్ గారు త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాలని  కోరుతున్నాను. 


ప్రముఖ న్యాయ‌కోవిదులు ప‌డాల రామిరెడ్డిగారు భూ సంస్క‌ర‌ణ‌ల‌పై రాసిన పుస్త‌కం ఎప్పుడూ నాటి ముఖ్య‌మంత్రి కేసీఆర్ టేబుల్ పై క‌నిపించేద‌ని త‌న సెల్ ఫోన్‌లోని ఫోటోను మంత్రి పొంగులేటి ప్ర‌ద‌ర్శించారు. ప‌డాల రామిరెడ్డిగారు పుస్త‌కాల స‌హ‌కారంతో, 80 వేల‌కు పైగా పుస్త‌కాలు చ‌దివాన‌ని చెప్పుకుంటున్న కేసీఆర్ నేతృత్వంలో ఉన్న‌త‌స్ధాయి రెవెన్యూ చ‌ట్టం వ‌స్తుంద‌ని భావించాన‌ని, అయితే లోప‌భూయిష్ట‌మైన‌, నాలుగు గోడ‌ల న‌డుమ రూపొందించిన 2020  రెవెన్యూ చ‌ట్టం ప్ర‌జా కంట‌క‌మైంద‌ని, మూడేళ్లకే ఈ చ‌ట్టానికి నూరేళ్లు నిండిపోయాయి.


అసెంబ్లీలో తొలిసారిగా మంత్రి హోదాలో తాను ఇటువంటి గొప్ప బిల్లును ప్ర‌వేశ‌పెడుతుండ‌గా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత స‌భ‌కు రాక‌పోవ‌డం స‌రికాదు. ప్ర‌జ‌ల‌పై ఆయ‌న‌కు ఉన్న నిబ‌ద్ద‌త ఏమిటో తెలుస్తుంది. భూభార‌తిపై స‌ల‌హాలు సూచ‌న‌ల కోసం ప‌బ్లిక్ డొమైన్‌లో పెట్టామ‌ని, మ‌రోవైపు సీనియ‌ర్ శాస‌న‌స‌భ్యులు హ‌రీష్‌రావు ఏడు పేజీల సూచ‌న‌లు ఇచ్చార‌ని మంత్రి గుర్తుచేశారు. ఇటువంటి  అత్యంత ప్రాధాన్య‌త ఉన్న బిల్లును ప్ర‌వేశ‌పెడుతుండ‌గా కేవ‌లం కేటిఆర్ పై న‌మోదైన వ్య‌క్తిగ‌త కేసును తెర‌పైకి తెచ్చి శాస‌స‌న‌భలో గంద‌ర‌గోళం సృష్టించ‌డం ఒక విధంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డం, వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్ల‌డ‌మేన‌ని మంత్రి పొంగులేటి  అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు