ఆయన సినిమాలు గ్రహాంతరం కాదు..సమాంతరం

 


*_ఆయన సినిమాలు_*

*_గ్రహాంతరం కాదు.._*

*_సమాంతరం..!_*


ఆయన సినిమాలు

సమకాలీన సమస్యల్ని

స్పృశిస్తాయి..

అంటే.. కదిలే బొమ్మల్లా కాదు

కళ్ళెదుట జరిగే సత్యాల్లా..


ఆయన సినిమాల్లో 

పాత్రలు 

జీవిస్తాయి..

అవి నీకూ నాకూ 

పరిచయం ఉన్నావే..

నిత్యం ఎక్కడో ఒక దగ్గర 

తారస పడేవే..!


ఆ పాత్రలు పోషించే నటులు

హంగామా లేకుండా..

సహజంగా..

నిజంగా కనిపిస్తూ

ఇట్టే ఆకట్టుకుంటారు..

మనల్ని మనం చూసుకుంటున్నట్టే..


అంతెందుకు..

దసరాబుల్లోడులో

గంతులు వేసిన ఓణిశ్రీ..

ప్రేమనగర్లో చూసిన 

ఎయిర్ హోస్టెస్ వాణిశ్రీ..

మనకి తెలిసిన 

నవలానాయిక

శ్యామ్ బెనెగల్ 

*_అనుగ్రహం_* లో

అనుగ్రహంతో

మునుపెన్నడూ చూడని

అభినేత్రి..!


బెనెగల శ్యామ్ సుందర్

సినిమా అవతారమెత్తి

అయ్యాడు శ్యామ్ బెనెగల్..

భారతీయ సినిమాకి

సహజత్వ గజ్జెలు కట్టి

వినిపించాడు

కొత్తరకం ఘల్ ఘల్..!


పూణే పిలిం ఇనిస్టిట్యూట్ లో

శిక్షకుడు..

అంతకు ముందు 

యాడ్ కంపెనీల్లో ఉద్యోగం..

డాక్యుమెంటరీల నిర్మాణం..

మొదలెట్టాడు సినిమా ప్రయాణం..

తెలంగాణ మహిళల సమస్యలపై ఎక్కుపెట్టిన అస్త్రం *_అంకుర్.._*

సెల్యులాయిడ్ రేగింది ఫైర్..

అటుపై అన్నీ 

సమాంతర సినిమాలే.. 

*_నిషాంత్_*

*_మంథన్.. భూమిక_*

*_మమ్ము.. సర్దారీ బేగం.._*

*_జబైదా_*

దేనికదే కొత్త బాట..

అవార్డుల పంట..!


గుజరాత్ పాడి రైతుల

సమస్యలపై ఎక్కుపెట్టిన అస్త్రం..*_మంధన్_*

ఐదు లక్షల మంది రైతులు

ఒక్కొక్కరు రెండ్రూపాయలు

పెట్టుబడి పెట్టిన ప్రయోగం..

సరికొత్త సినిమా యాగం..!


బెనిగల్ సినిమాల్లో

కథే హీరో..

మామూలు పాత్రలే కీలకం..

దిలీప్..అమితాబ్..

ధర్మేంద్ర..రాజేష్ ఖన్నా..

హేమామాలిని.. రేఖ..ముంతాజ్..

కాదు నాయికానాయకులు..

స్టార్లు ఆయన దృష్టిలో 

కానేకారు సార్లు..

నసీరుద్దీన్..ఓం పురి..

స్మితా పాటిల్..షబనా అజ్మీ..

కుల్భూషన్ కర్బందా..

అమ్రీష్ పురి..ఓం పురి..

వీరే నటులు..

స్టార్లే అనుకున్నా

బెనెగల్ సినిమాలో

సాదాసీదా యాక్టర్లు..

ఆయనే ప్రాణం పోసే 

సజీవ కారెక్టర్లు..!


భారతీయ సినిమాకి

ఒక కొత్త నడక నేర్పిన

దర్శక దిగ్గజాల్లో..

శాంతారామ్..

సత్యజిత్ రే..

మృణాల్ సేన్..

ఆదూర్ గోపాలకృష్ణ..

ఒక పరంపర..

శ్యామ్ బెనెగల్ రాకతో 

మరింతగా మెరిసింది

వెండి తెర..!


(చిన్నప్పుడు విజయనగరంలో

మా ఇంటి సమీపంలోనే ఉన్న

పేర్ల వారి మహాజన్ బిల్డింగులో

అనుగ్రహం 

సినిమా షూటింగ్ జరిగినప్పుడు వెళ్లి

శ్యామ్ బెనెగల్..

అనంతనాగ్..వాణిశ్రీ..

రావు గోపాలరావులను

చూసిన చిత్రమైన అనుభవం..

ఆరోజున యాక్టర్లను మించి

ఆ డైరెక్టర్ను చూడ్డమే 

గొప్ప విషయంగా భావించిన 

ఉత్సాహం ఇప్పటికీ గుర్తే)

 

దిగ్దర్శకుడు శ్యామ్ బెనెగల్ కు

నివాళి అర్పిస్తూ..


*_సురేష్ కుమార్ ఎలిశెట్టి_*

        9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు