ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం

 


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) సినీ ప్రముఖుల సమావేశమయ్యారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు హీరోలు నాగార్జున, వెంకటేశ్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ.. దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట.. నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేశ్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కల్యాణ్, గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్, కె.ఎల్.నారాయణ, మైత్రీ రవి, నవీన్.. సీఎంతో భేటీ అయ్యారు. మెుత్తం 36 మంది సభ్యులు రేవంత్‌తో సమావేశమై సినిమా టికెట్ రేట్లు, బెన్ ఫిట్ షోలు, సంధ్యా థియేటర్ ఘటన వంటి పలు పలు అంశాలపై చర్చించారు. 



అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి తెలుసన్న రేవంత్

ఇద్దరూ తనతో కలిసి తిరిగిన వారే అని వ్యాఖ్య

అందరూ చట్ట ప్రకారం వ్యవహరించాలనేదే తన విధానమన్న సీఎం

సమావేశంలో  అల్లు అర్జున్ ప్రస్తావన రాగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అల్లు అర్జున్ పై తనకు కోపం ఎందుకుంటుందని ప్రశ్నించారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. వారిద్దరూ తనతో కలిసి తిరిగిన వారే అని అన్నారు. 


వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ... అందరూ చట్ట ప్రకారం వ్యవహరించాలనేది తన విధానమని చెప్పారు. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ కు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో చేశాయని... ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఐటీ, ఫార్మా మాదిరే సినీ పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు.

భేటి అనంతరం ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ కలిసి పని చేస్తాయని చెప్పారు. ఇండస్ట్రీ, ఎఫ్‌డీసీ, ప్రభుత్వం కలిపి ఒక కమిటీ వేస్తారని.. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి సినిమా ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం ఉంటుందని అన్నారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధిపై చర్చిస్తామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన తెలంగాణ బ్రాండ్‌ను పెంచేందుకు ఇండస్ట్రీ తరపున తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు