రాజ్యాంగ రక్షణతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్
ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో సకల అసమానతలను రూపుమాపి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, హక్కులను కాపాడడం కోసం వ్రాసుకొని సమర్పించుకున్న రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా పరాయి పాలనకు గురై, 2500 ఏండ్లుగా 6500 కులాలకు పైగా విభజించబడిన అసమానతల సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం తీసుకురావడం కోసం రచించిన గొప్ప రాజ్యాంగం నేడు దోపిడీ పాలకుల చేతిలో బంధీ అయి రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చారని అన్నారు.
ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య రక్షణ కొరకు వ్రాసుకున్న రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు 106 సార్లు సవరణ చేశారని, ఈ సవరణల వల్ల ప్రజల రక్షణ కన్నా ఎక్కువగా ప్రజలను, ప్రజా ఉద్యమకారులను శిక్షించే చట్టాలను తీసుకొచ్చి ప్రజలను మరింత అణచివేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ విలువలను రక్షించి ప్రజల సంక్షేమం, బలహీన వర్గాల, మహిళల, మైనార్టీల హక్కులను రక్షించాల్సిన పాలకులు ఆయా వర్గాల ప్రజలపై అమానుష దాడులు జరిగినా చలించకపోవడమే కాకుండా దేశంలో మణిపూర్ లాంటి కొన్ని ప్రాంతాల్లో రాజ్యమే ఘోరమైన దాడులకు పాల్పడడం సిగ్గు చేటని అన్నారు.
నానాటికీ క్షీణిస్తున్న రాజ్యాంగ విలువను కాపాడుకోవడానికి సామాజిక ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు విలువల సమాజాన్ని నిర్మించడంలో కీలకపాత్ర పోషించాలని, రాజ్యాంగ విలువలను కాపాడే పాలకులను ఎన్నుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు యగ్గడి సుందర్ రామ్, జె జె స్వామి, వివిధ సంఘాల నాయకులు సింగారపు అరుణ, కరుణ, హరిబాబు, సారయ్య, మన్నె హరిబాబు, ప్రభాకర్, ఎలీషా, అజయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box