బి.సి లను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి

 


సమగ్ర కుల జనగణన చట్టం ముందు నిలిచేదిగా ఉండాలి


బి.సి లను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి


బి.సి కమీషన్ కు నివేదించిన ఆల్ ఇండియా ఒబిసి జాక్, తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘం



    75 ఏండ్ల స్వాతంత్ర భారతంలో మొట్టమొదటి సారి చేపడుతున్న సమగ్ర బి.సి జనగణన చట్టం ముందు నిలిచేవిధంగా ఉండాలని, ఆ దిశగా బి.సి సమాజ సమస్యలను గుర్తించి, సమగ్ర కుల జనగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి తెలంగాణలో కుల జనగణన జరిపి తద్వారా స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం చేసే ప్రయత్నాలకు బి.సి సమాజం పక్షాన ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మెన్ సాయిని నరేందర్, తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘాల సమాఖ్య అద్యక్షులు తాడిశెట్టి క్రాంతీకుమార్ లు ధన్యవాదాలు తెలుపుతూ 35 డిమాండ్లతో కూడిన తన నివేదికను బి.సి డెడికేషన్ కమీషన్ కు అందించారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన  బి.సి డెడికేషన్ కమీషన్ బహిరంగ విచారణలో పాల్గొని కమీషన్ ఛైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు కు నివేదికను అందించి ప్రసంగించారు.  


   సమగ్ర కుల జనగణన జరపాలని ఆ జనగణన చట్టం ముందు నిలబడే విధంగా సమగ్రంగా ఉండాలని, కుల జనగణలో అతి ముఖ్యమైన సమాచారాన్ని సమగ్రంగా సేకరించాలని, బి.సి ల సామాజిక, ఆర్థిక స్థితిగతులను స్పష్టంగా లెక్క వేయాలని, స్త్రీ, పురుషుల సామాజిక, ఆర్థిక  అభివృద్ధి గురించి లెక్కలు తీయాలని, విద్యార్హతలు, వృత్తి, స్వంత ఇల్లు, ఆస్తులు, మంచినీటి సౌకర్యాలు, వంట గ్యాస్ తదితర సౌకర్యాల అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు. 

   భారతదేశానికి వెన్నుముకగా ఉన్న బి.సి సమాజం ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిశ్రామికీకరణ తదితర సామాజిక మార్పులు, పాలకుల విధానాల వల్ల కుల వృత్తులు ధ్వంసమై బ్రతుక లేక బలిదానాలు చేసుకుంటున్నారని, ప్రధాన వృత్తులు ధ్వంసమైన నేటి తరుణంలో కుల వృత్తులను ఆధునీకరించి ఆయా కులాల ప్రజల ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం తోడ్పడాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే వ్యవసాయ పట్టభద్రులను తయారు చేసి తద్వారా వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాలని, ఉత్పత్తి రంగం నుండి సేవా రంగంలోకి మారిన వారికి నిత్యం పని దొరకక చాలీ చాలని వేతనాల వల్ల అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఉన్నత చదువులు చదివిన వారు కూడా  ఉద్యోగాలు, ఉపాధి లేకపోవడంతో బి.సి యువత అసంఘటిత రంగంలో సేవ చేస్తుందని తెలిపారు. ప్రైవేటు విద్యా, వైద్య ఖర్చులతో నానాటికి పెరుగుతున్న జీవన ఖర్చులను భరించలేక అప్పుల పాలై కుటుంబాలను విడిచి పారిశ్రామిక నగరాలకు, విదేశాలకు వలసలు పోతున్నారని అన్నారు.

    ప్రైవేటీకరణలో కార్పొరీకరణ వల్ల పెద్ద మాల్స్ రావడం వల్ల చిరు వ్యాపారాలు, మధ్యస్థ వ్యాపారాలు, విద్యా సంస్థలపై ఆధారపడిన బి.సి సమాజం తీవ్రంగా నష్టపోతుంది. నిరుద్యోగ సమస్య బి.సి సమాజంలో ఎక్కువగా ఉందని నిరుద్యోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉపాది అవకాశాలు కల్పించాలని అన్నారు. అభివృద్ధి పేరుతో విద్వంసం జరిగి నిరాశ్రయులైన వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని, గ్రామాల్లో ఉపాధి కరువై పట్టణాలకు వలస వచ్చి అడ్డ మీద కూలీలుగా బతుకుతున్నవారికి, నివాసం లేక, ఫుట్ పాత్ లపై జీవనం గడుపుతున్నారని  అలాంటి వారికి ఆసరాగా నిలవాలని కోరారు. ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం అందించాలని. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు పౌష్టికాహారం అందించి ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలని కోరారు.

     ఏ వర్గాల్లో లేని క్రిమీలేయర్ విధానాన్ని బి.సి లో ఎత్తి వేయాలని, జాతీయ న్యాయ కళాశాలల్లో, జుడీషియరీలో బి.సి లకు రిజర్వేషన్లు కల్పించాలని, బి.సి సమాజానికి నష్టం చేస్తున్న ఇ డబ్లు ఎస్ రిజర్వేషన్లను ఎత్తివేయాలని, చట్టసభల్లో బి.సి లకు జనాభా దామాషా ప్రకారం వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పోరాటం చేయాలని అన్నారు. బి.సి లు రాజకీయంగా ఎదగడం కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని, మంత్రి పదవుల్లో బి.సి లకు 50 శాతం కేటాయించాలని, పబ్లిక్ సర్వీస్ కమీషన్ల లాంటి నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బి.సి లకు కేటాయించాలని డిమాండు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరచిన అన్ని అంశాలను నిర్లక్ష్యం చేయకుండా అమలు చేయాలని. జాతీయ స్థాయిలో జరిగే జనగణనలో బి.సి జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు. అత్యంత వెనుకబడిన తరగతులు (ఎం బి సి), సంచార జాతుల స్థితిగతులను సర్వే పై ప్రత్యేక దృష్టి సారించాలి. కుల కార్పొరేషన్లను బలోపేతం చేయాలని, ఎం బి సి ల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆ నివేదికలో పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో బి.సి విద్యార్థి నాయకులు గొల్లపల్లి వీరాస్వామి, ఒబిసి జాక్ నాయకులు నారాయణగిరి రాజు, మేరు సంఘం నాయకులు వెంకట్రాజ్యం, యాదవ సంఘం నాయకులు సిద్ధిరాజ్ యాదవ్, పెరిక సంఘం నాయకులు వడ్డే రవీందర్ వివిధ సంఘాల నాయకులు డేవిడ్, రమేష్, నయీమొద్దీన్, కత్తుల కవిత, వీరభద్రయ్య, ముదురుకోల విజయ్ కుమార్, ఆలకుంట్ల రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు