ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వం- వ్యవస్దలకు ఎందుకీ అవస్ధలు

 


*ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వం*

*వ్యవస్దలకు ఎందుకీ అవస్ధలు..*


✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽


ఒక టాటా..ఒక బిర్లా..

ధీరూభాయ్ అంబానీ..

నారాయణ మూర్తి..

ప్రతాప్ సి రెడ్డి..


ఇలా వ్యక్తులు ప్రారంభించిన సంస్థలు వ్యవస్థలుగా 

ఎదిగి చరిత్ర సృష్టిస్తే..సృష్టిస్తూ ఉంటే..


ఒక పెద్ద వ్యవస్థ..

అంటే ప్రభుత్వం ఆరంభించిన సంస్థలు

ఉక్కు కర్మాగారాలు..

షిప్ యార్డులు..

కొన్ని బ్యాంకులు..

కొద్ది కొద్దిగా విమానాశ్రయాలు..

ఏమో..రానున్న రోజుల్లో

రైల్వేస్టేషన్లు..

బస్ స్టాండులు..

ఇంకా ఇంకా చాలా..

ప్రైవేట్..అంటే 

వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయే..


అంతేనా..

ఒక వ్యక్తి..పోనీ కొందరు వ్యక్తుల సమూహం..

చేతుల మీదుగా ఊపిరి పోసుకున్న ఆస్పత్రులు 

కార్పొరేట్ ఆస్పత్రులుగా

ఎదిగి అత్యున్నత..

అత్యాధునిక వసతులతో

లక్షలాది మందికి 

జీవం పోస్తుంటే...

కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టగలిగే.. గలిగే ఏంటి..

ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు

ఆ స్థాయిలో ఎందుకు వైద్య సౌకర్యాలు కల్పించడంలో విఫలం అవుతున్నాయో..


అలాగే..

విద్యారంగం కూడా..

ప్రైవేట్ రంగంలో

కాన్వెంట్ల నుంచి 

పీజీ వరకు..

ఇంజనీరింగ్...

మెడిసిన్.. 

ఇంకెన్నో కోర్సులు...

అత్యున్నత ప్రమాణాలతో

విద్యాబోధన చేస్తుంటే..

ఎన్నో వనరులు..

కోట్ల రూపాయల నిధులు

అందుబాటులో ఉండే సర్కారు ఆధ్వర్యంలో

విద్య ఇలా దీనంగా..

డీలాగా..ప్చ్..!


సర్కార్ ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో హాయిగా..సాఫీగా సాగిపోవాల్సిన రెండు 

అతి ముఖ్య వ్యవస్థలు

విద్య..వైద్యం..

ప్రైవేట్ అధీనంలో..

స్పష్టంగా చెప్పాలంటే 

ఆధిపత్యంలో నడుస్తుండడం వల్ల

సామాన్యుడికి అందుబాటులో లేక 

మళ్లీ ప్రభుత్వమే ఈ రెండు కీలక సౌకర్యాల కోసం 

కొన్ని పథకాలు అమలుచేస్తూ..ప్రజల సొమ్మును ప్రజల కోసం ఖర్చు చేస్తూ ప్రైవేట్ పరం చేస్తూ అదేదో ప్రజలకు మహోపకారం చేస్తున్నట్టు బిల్డప్పులు ఇస్తుంటే జ్ఞానం కొరవడి వెర్రి జనం ఆయా పథకాలు అమలు చేస్తున్న నాయకులను మహానేతలుగా కొనియాడుతున్న 

చిత్రమైన పరిస్థితి..

దుస్థితి అనాలేమో..!


ఇంకేవీ ఉచితం అక్కర్లేదు..

విద్య..వైద్యం చాలు..

ఇలా చెప్పింది 

అబ్దుల్ కలాం..

అటల్ బిహారీ వాజపేయి..

మరి ఆ రెండే ఈ రోజున

అతి కష్టమైన..

క్లిష్టమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.

బ్రతకడం నేర్పించే..

బ్రతికించే 

ఈ రెండు వ్యవస్థలు

పేద..మధ్యతరగతి జనాలకు అందుబాటులో ఉండని దుర్భర..

దౌర్భాగ్య స్థితి...!

వైద్యం ఎంత దయనీయ స్థితిలో అందని మావి..

ఎండమావి అయిందో..

ఆ పరాకాష్ట మొన్న 

కోవిడ్ ఎపిసోడ్లో..

ముఖ్యంగా రెండో వేవ్ లో చూసాం..

ప్రభుత్వ ఆస్పత్రులు అవసరమైన స్థాయిలో వైద్యం అందించలేక 

ఒక దశలో చేతులెత్తేసిన దుస్థితి దాపురిస్తే మరోపక్క

ప్రైవేట్ ఆస్పత్రులు సందట్లో సడేమియాల్లా

కోట్లాది రూపాయలు మూటకట్టుకుని 

మహర్దశను సాధించాయి..


ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కధలు..

సర్కార్లది హీనచరిత్ర..

ప్రైవేటుది మరోచరిత్ర..!

ప్రభుత్వాలది 

ఫెయిల్యూర్ స్టొరీ..

ప్రైవేటుది సక్సెస్ కహానీ!!


ఇదీ పరిస్థితి..

ఎక్కడుంది లోపం..

ఎవరిది పాపం..

ఇంకెవరికి శాపం..

మరెవరికి ధూపం..

ఇదంతా ఎవరికి కోపం!?

మొత్తానికి 

ఈ వైఫల్యమైనా..

విజయమైనా..

వ్యవస్థది కాదు..

వ్యక్తులదే..

ప్రైవేటు విజయం 

క్రెడిట్ అధిపతులది..

సర్కార్ల వైఫల్యం 

బాధ్యత నిస్సందేహంగా

అధికార్లది..

ఖచ్చితంగా అధినాయకులది..!!


అదేదో సినిమాలో 

ఓ డైలాగ్ ఉంటది..

మందు కొట్టినోడు

సెడిపోయాడు గాని

మందు కొట్టెట్టినోడు

ఎప్పుడూ సెడిపోలేదని..

అలాగే ఎప్పుడైనా 

ఏ ప్రభుత్వం హయాంలోనైనా

ప్రజలు చెడిపోయారు గాని

ప్రభుత్వాలను నడిపిన 

వ్యక్తులు చెడిపోలేదు..!

ఇంతకీ ఆ సినిమా కూడా 

ఇంతసేపూ మనం చెప్పుకున్న కథకు 

తగ్గ టైటిలే..


సొమ్మొకడిది..సోకొకడిది!


✍️✍️✍️✍️✍️✍️✍️✍️     

 

*ఎలిశెట్టి సురేష్ కుమార్*

          జర్నలిస్ట్

    9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు