ఆర్ అండ్ బి శాఖ ఇంజనీర్లపై మంత్రి కోమటి రెడ్డి ఆగ్రహం



*నిద్రమత్తు వీడండి – రోడ్ల రిపేర్లు చేయండి -ఆర్ & బీ రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం*

వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రిపేర్లు చేయకుండా మీనమేషాలు లెక్కించడం ఏంటి..?*

మాటలు కాదు – రిజల్ట్ కావాలి*

మీరేమో ప్రతీ రివ్యూలో రోడ్లు బావున్నాయని చెబుతారు.. ప్రజలు రోడ్లు బాలేవంటున్నారు.. క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారా.. స్టేట్ రోడ్స్ అధికారులపై సీరియస్ అయిన మంత్రి.

ప్యాచ్ వర్క్ లు చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది.

మనం ప్రజల కోసం పనిచేస్తున్నామన్న స్పృహ ఉండాలి.

పాట్ హోల్స్ నింపకుండా ఏం చేస్తున్నారు

టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణంలో జాప్యం సహించేదిలేదు

ప్రతీవారం రివ్యూ చేయండని స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రెటరీ  దాసరి హరిచందనకు ఆదేశం.


వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రిపేర్లు చేయడం ఎందుకు ఆలస్యం అవుతుందని అధికారులను ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎస్టిమేషన్లు, టెండర్లని కాలం వెల్లదీస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. డిపార్ట్ మెంట్ లో సర్వీస్ రూల్స్ కావాలంటే తెచ్చా, ట్రాన్స్ ఫర్లు చేసుకుంటామంటే అనుమతించా.. మీరు ఏదడిగితే అది చేస్తున్నప్పటికి.. మీ పనితీరు ఏం మెరుగుపడలేదని మండిపడ్డారు. ఈ రోజు సచివాలయంలోని తన ఛాంబర్ లో ఆర్ & బీ లోని వివిధ విభాగాల పనితీరుపై అధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి శాఖలో కొందరు అధికారుల అలసత్వంపై తీవ్రంగా స్పందించారు.


ముందుగా వరంగల్ జిల్లాలోని మామునూర్ ఎయిర్ పోర్ట్ పై ఎవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, ఆర్  & బీ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ శ్రీమతి దాసరి హరిచందన, ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. త్వరితగతిన భూసేకరణ చేపట్టి రెండేళ్లలో ఎయిర్ పోర్ట్ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.  తాత్కాలిక ఏర్పట్లకన్న భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతీ పదిహేను రోజులకోసారి పనుల పురోగతిపై రివ్యూ చేస్తానని చెప్పిన మంత్రి.. గత ప్రభుత్వంలాగా హామీలతో కాలం వెళ్లబుచ్చితే అర్ధం లేదన్నారు. ప్రజలకు చెప్పింది చెప్పినట్టు చేస్తేనే జవాబుదారితనంతో కూడిన పాలన అందించవచ్చని తేల్చిచెప్పారు. విమానాశ్రయం నిర్మించి వదిలేయకుండా విమానాల రాకపోకలపై దృష్టిపెట్టాలని ఏవియేషన్ డైరెక్టర్ ఉన్నతాధికారులకు సూచించారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ ను ఉడాన్ స్కీంతో అనుసంధానం చేసి ఇతర పెద్ద పట్టణాలతో రాకపోకలకు అనువుగా మార్చేందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధంచేయాలని ఆదేశించారు.

 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యునెస్కో సైట్ రామప్ప, భద్రకాళీ, వెయ్యిస్తంభాల దేవాలయం ఇతర కాకతీయ కట్టడాలతో పాటు టెక్స్ టైల్ పార్క్, రాంపూర్ ఇండస్ట్రీయల్ ఏరియా వంటి పారిశ్రామిక ప్రాంతాలున్న దృష్ట్యా.. అందుకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దాలని సూచన చేశారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి స్వయంగా మామునూర్ వచ్చి ఎయిర్ పోర్ట్ స్థితిగతులపై పరిశీలిస్తానన్న చెప్పిన మంత్రి రివ్యూలో పాల్గొన్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితోపాటు జిల్లాకు చెందిన మంత్రి శ్రీమతి కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమన్వయం చేసుకొని పనులను స్పీడప్ చేయాలని ఆదేశించారు.


*స్టేట్ రోడ్ల పై అధికారులను నిలదీసిన మంత్రి : *


మన పక్కరాష్ట్రాల్లో రోడ్ల రిపేర్లకు జెట్ ప్యాచ్ వర్క్ మెషిన్లు, వెలాసిటీ ప్యాచింగ్ వంటి అధునాతన పద్ధతులతో పాట్ హోల్స్ పడిన వెంటనే పూడుస్తూ ప్రజలకు మెరుగైన రోడ్లు అందిస్తుంటే.. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉన్న మన దగ్గర మాత్రం ఇంకా పురాతన పద్ధతుల్లో పాట్ హోల్స్ రిపేర్లు చేస్తున్నామని.. ఇది మన ఆర్ & బీ అధికారులకు తమ నైపుణ్యాల పట్ల ఉన్న శ్రద్ధ అంటూ సున్నితంగా చురకలు అంటించారు. రూ. 500 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు 4-5 వేల కోట్ల విలువ చేసే రోడ్లను రిపేర్ చేయవచ్చని కానీ.. ఎక్కడా ఆవైపుగా పనులు జరగడం లేదని స్టేట్ రోడ్స్ సీఈ మోహన్ నాయక్ ను ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన ఏఈఈలను ఇప్పటిదాక కనీసం ఫీల్డ్ మీదకు కూడ పంపకపోవడం ఏంటని నిలదీశారు.  ఇంజనీర్లంతా ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరుగుతూ కొత్త రోడ్లను ప్రపోజల్స్ తయారు చేసే కన్సల్టెంట్లుగా మారారని.. అసలు పాట్ హోల్స్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి ఇంజనీర్లకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు.


*ప్రజలపై భారం కాకుండా పీపీపీ మోడల్స్ ప్రణాళికలు సిద్ధం చేయండి*


మంత్రివర్గ సమావేశంలో చర్చించిన పీపీపీ మోడల్ రోడ్స్ పై ఐడెంటీఫికేషన్ పై స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ను అడగ్గా.. ఇప్పటి వరకు 1787.06 కిలోమీటర్ల కలిగిన 20 రోడ్లను గుర్తించామని చెప్పారు. ఏ రోడ్డు నిర్మాణ పద్దతి అవలంభించినా.. అంతిమంగా ప్రజల మీద భారం పడకుండా ఉండే పీపీపీ మోడల్ ను తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో  వంటి రాష్ట్రాల్లో ఆర్డీసీ అనుసరిస్తున్న రోడ్డు నిర్మాణ పద్ధతులను అనుసరిస్తున్నామని అధికారులు మంత్రిదృష్టికి తెచ్చారు.


*టీమ్స్ హాస్పిటల్ నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతుంది :*


ప్రతీ రివ్యూలో అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నారు ప్రారంభించే టైం పెంచడం తప్పా ఇప్పటిదాక ఏం పురోగతి కనిపించడం లేదని బిల్డింగ్స్ సెక్షన్ సీఈ రాజేశ్వర్ రెడ్డిపై మంత్రి అసహనంవ్యక్తం చేశారు. నాలుగు టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణంలో ఇప్పటిదాక ఒక్క పురోగతిని చూపించలేదని నిర్వేదంవ్యక్తం చేశారు. ప్రజలు ప్రాథమిక అవసరమైన హాస్పిటల్స్ నిర్మాణంలో ఇంత నిర్లక్ష్యం దేనికని ప్రశ్నించారు. ప్రభుత్వం దవాఖానాలు అందుబాటులోకి రాకపోతే పేద ప్రజలు కార్పోరేట్ హాస్పిటల్స్ లో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చికిత్సలు తీసుకోకుండా ప్రాణాలు పొగొట్టుకుంటారని.. దానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ముఖ్యమంత్రిగారితో, ఉప ముఖ్యమంత్రిగారితో మీ ముందే మాట్లాడి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాను.. అయినా ఎందుకు నిర్మాణాలు ఆలస్యం జరుగుతున్నాయని ఆయన నిలదీశారు. రోజు వేలాదిమంది వచ్చే నిమ్స్ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుంటే.. మీరంతా ఏం చేస్తున్నారని పశ్నించారు. ఇప్పటికైనా అధికారులంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చే జూలై, 2025 నాటికి టిమ్స్ హాస్పిటల్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు సూచించారు.


ఈ క్రమంలో మంత్రి.. సెక్రెటరేట్ లోని తన చెయిర్ క్రింద టైల్స్ ఫిటింగ్ నిర్లక్ష్యాని అధికారులకు స్వయంగా చూపించారు.. వెయ్యికోట్లకు పైగా ఖర్చుపెట్టినమని చెప్పిన రాష్ట్ర సచివాలయంలో మన ఇంజనీర్ల పనితీరు ఇంత నిర్లక్ష్యంగా ఉందని..  టైల్స్ మధ్యనున్న గ్యాప్స్ ను చూపించారు. మనం ఖర్చుపెట్టే ప్రతీ పైసా ప్రజల సొమ్మని.. దాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చూసీచూడనట్లు వదిలేప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ప్రతీది నాణ్యంగా ఉండాలి, ప్రతీ పని ప్రజలు మెచ్చుకునేలా చేయాలని సూచించారు. ప్రతీవారం టీమ్స్ హాస్పిటల్ భవనాల నిర్మాణ స్థితిగతులపై రివ్యూలు నిర్వహించి రిపోర్ట్ ఇవ్వాలని స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రెటరీ శ్రీమతి దాసరి హరిచందనను ఆదేశించారు.

 

ఇదే క్రమంలో ఒక్కొక్కరికి రెండు, మూడు అదనపు బాధ్యతలు ఉన్నాయని ప్రమోషన్లు ఇస్తే.. కొంత భారం తగ్గుతుందని ఈఎన్సీ మధుసూధన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకురాగా.. ఇన్ని బాధ్యతులు మోస్తే ఎందుకు పాట్ హోల్స్ రిపేర్ కాలేదు, ఎందుకు టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం పూర్తి కాలేదని ప్రశ్నించారు. హక్కుల గురించి అడిగేటప్పుడు బాధ్యతలు కూడా నిర్వర్తించాలని సున్నితంగా హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు