*_మీగడ కమ్మదనం..!_*
_మహానటుడికి_
_గురజాడ పురస్కారం_
*_మీగడ వంటి స్రష్టలతో_*
*_కళారంగానికి ఇంకా మనుగడ!_*
_మహానటుడికి గురజాడ పురస్కారం_
*_మీగడ రామలింగస్వామి.._*
ఓ రసమయ వేదిక..
మైకు..
ఆస్వాదించే
కళాహృదయులు..
చాలు..
ఆయనలోని కళాకారుడు..
వక్త..ప్రవక్త..
విజృంభించడానికి..
మీగడ పలుకులు..
రామలింగస్వామి
చెణుకులు వినిపించడానికి..
ఆయనలోని నటుడు..
పద్యకారుడు లయవిన్యాసం చేసి ఆహూతులను
ఇంకా..ఇంకా మాట్లాడితే బాగుణ్ణు అనేంతగా
ఆకట్టుకుని కట్టిపడేయడానికి..!
సందర్భం ఆయనది..
నాయకుడు ఆయన..
కేంద్రబిందువు ఆయనే..
గురజాడ
సాంస్కృతిక సమాఖ్య
మహాకవి వర్ధంతి సందర్భంగా
గురజాడ పురస్కారాన్ని
సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన
న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ చేతుల మీదుగా మీగడకు శనివారం నాడు ప్రదానం చేసిన
సందర్భంగా
ఆ మహానటుడు చేసిన ప్రసంగం ఒక గొప్ప ప్రదర్శనను
అబ్బురంగా చూసిన అనుభూతిని కలిగించింది.
ఏడు పదుల వయసు పైబడినా ఆ కంఠం
కంచు మోగినట్టు మోగింది..
ప్రసంగం మొదలు పెట్టడం..
ఆయన గొంతు గంభీరంగా వినిపించడం.. అప్పటికి ముఖ్య అతిథి నూతలపాటి తెలుగు ప్రసంగంతో తడిసి ముద్దయిన ఆహుతులు
సమయం మించిపోవడంతో కుర్చీల నుంచి లేవబోతూ
మంత్రించినట్టు మళ్ళీ ఆశీనులయ్యారు.అటు పిమ్మట లేస్తే ఒట్టు..
మీగడ తన ప్రసంగంతో జనాన్ని తెలుగు లోకంలోకి తోడ్కొనిపోయారు.
మధ్యలో పద్యాలు..
తెలుగు నేలపై నాటక రంగ గత వైభవాన్ని గుర్తు చేస్తూ
నాటి వైభోగం ఇంకా మీగడ రామలింగస్వామి రూపంలో
ఇంకా చిరంజీవిగా ఉందని
కళ్లకు కడుతూ అద్వితీయ రీతిలో ప్రసంగం చేసారు.
గురజాడ రచనా వైశిష్టి..
ఆయన సృష్టించిన పాత్రల
తీరుతెన్నులు..
నాటి దురాచారాలకు
వ్యతిరేకంగా ఆయన కలం ఝుళిపించిన సాహసం..
గిరీశం..రామప్ప పంతులు..
మధురవాణి..బుచ్చమ్మ..
ఇత్యాది పాత్రల విశ్లేషణ..
తనదైన రీతిలో..
భాషలో వివరించి ప్రసంగాన్ని పండించారు.
ప్రసంగంలో మీగడ స్వామి
నూతలపాటి విశిష్టతను వర్ణిస్తూ చక్కని పద్యం పాడారు.అంతకు ముందు మీగడకు గురజాడ పురస్కారాన్ని అందజేసి
సమాఖ్య తరపున సత్కరించిన జస్టిస్ రమణ
మీగడ ప్రసంగాన్ని ఆస్వాదిస్తూ
ఆయన్ని పద్యాలు పాడమని కోరారు.వెంటనే మీగడ స్పందిస్తూ మీగడ ఉంటే పద్యాలు ఉండకుండా ఎలా ఉంటాయంటూ చమత్కరించి
శ్రావ్యంగా పద్యం అందుకున్నారు.తర్వాత సమయాభావం వల్ల ఇంకా పద్యాలు పాడలేకపోతున్నానని అంటే
*Objection over ruled*
అంటూ నూతలపాటి ఆయన్ను మరిన్ని పద్యాలు ఆలపించాల్సిందిగా కోరారు.
రాజు తలచుకుంటే పద్యాలకు కొదవా అంటూ మీగడలోని కళాకారుడు గంటసేపు పైగా
వేదికపై వీరవిహారం చేశాడు.
అభిమానులు మంత్రముగ్ధులయ్యారు.
విజయనగరం గడ్డ కీర్తిని పెంచిన గురజాడ..
కోడి రామ్మూర్తి.. ఆదిభట్ల..
ద్వారం..ఘంటసాల...
సుశీలమ్మ ..చివరగా గజపతులను స్తుతిస్తూ మీగడ
ఆలపించిన పద్యం అపూర్వం.
ఆయన గొంతు..ఆ రాగాలు..
సరాగాలు..ఒక పరిపూర్ణ కళాకారుణ్ణి కళ్ల ముందు ఆవిష్కరించాయి.
ముందు మాట్లాడిన న్యాయమూర్తి..తర్వాత ప్రసంగించిన మీగడ..
ఇద్దరూ కూడా తాము ఇంతవరకు ఈ చారిత్రక నగరంలో వేదికను పంచుకునే అవకాశం రాకపోవడం పట్ల కొంత ఆవేదన వ్యక్తం చేసినా గురజాడ సమాఖ్య.. కాపుగంటి ప్రకాష్ కారణంగా ఆ వెలితి తీరిందని సంతృప్తి వ్యక్తం చేశారు.మీగడ ప్రసంగాన్ని ఆద్యంతం ఆస్వాదించిన జస్టిస్ రమణలో
ఒక చక్కని కళాభిమాని దర్శనమిచ్చారు.
వేదికపై నారాయణం శ్రీనివాస్,
సన్ స్కూల్ అధినేత అనిల్.. మేకా..ఈపు విజయకుమార్..గోపాలరావు మాష్టారు..
గురజాడ కుటుంబసభ్యులు
ఇందిర తదితరులు..
గురజాడ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కవితలు..వక్తృత్వ..
వ్యాస రచన పోటీల విజేతలు ఉన్నారు. నవసాహితి అధ్యక్షుడు సూర్యప్రకాశ్ అతిథిగా హాజరయ్యారు.
మొత్తంగా రంగాలు వేరైనా
ఇద్దరు స్రష్టలు పాల్గొని చేసిన ప్రసంగాలు సభను ఆద్యంతం రక్తి కట్టించాయి.
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
జర్నలిస్ట్
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box