రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం - ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్

 


డెడికేటెడ్ కమీషన్ స్వాగతిద్దాం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం

ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ 


    తెలంగాణలోని బి.సి సంఘాలు చేసిన ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం డెడికేటెడ్ కమీషన్ ను నియమించి సమగ్ర కుల జనగణన జరిపి తద్వారా స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆల్ ఇండియా ఒబిసి జాక్, తెలంగాణ పూలే యువజన సంఘాల సమాఖ్య లు కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండ జిల్లా కేంద్రం బాల్సముద్రం సిపిఐ కార్యాలయంలో జరిగిన బి.సి సంఘాల సమావేశంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, వైస్ చైర్మన్ పటేల్ వనజ, తెలంగాణ పూలే యువజన సంఘాల సమాఖ్య అద్యక్షులు తాడిశెట్టి క్రాంతికుమార్ లు మాట్లాడుతూ డెడికేటెడ్ కమీషన్ ను స్వాగతిస్తూనే ఆ కమీషన్ పనితీరుపై బి.సి సమాజం అప్రమత్తంగా ఉండి సర్వే సక్రమంగా జరిగి, బి.సి స్థితిగతులు నమోదు అయ్యేటట్లు చూడాలని అన్నారు. 



     వేల సంవత్సరాల అణచివేత, వందల సంవత్సరాల పోరాటం, ఎంతో మంది త్యాగాలు అయినా విముక్తి కానీ బి.సి సమాజానికి కొంత మేలు చేసే ఉద్దేశంతో  తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల జనగణన జరిపి తద్వారా స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే కొరకు జరిగే ప్రక్రియలో భాగంగా నియమించిన డెడికేటెడ్ కమీషన్ మేలు చేస్తుందని బి.సి సమాజం ఆశాబావంగా ఉందని వారన్నారు. 

    తరతరాలుగా దోపిడీకి గురైన మెజార్టీ సమాజాన్ని గుర్తించాలని ఎన్నో పోరాటాలు జరిగిన ఫలితంగా గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడొ యాత్ర కొనసాగించిన సందర్భంగా సమగ్ర కుల జనగణన జరిపి ఎవరు ఎంత మందో వారికి అంత వాటా (ఇస్సేదారి) కల్పిస్తామని, అదే నిజమైన సామాజిక న్యాయమని ప్రకటించారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కామారెడ్డి లో బి.సి డిక్లరేషన్ చేసారు. ఆ డిక్లరేషన్ లో కూడా తెలంగాణలో సమగ్ర కుల జనగణన చేస్తామని, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మరెన్నో అభివృద్ధి పథకాలు ప్రకటించినప్పటికి వాటి అమలులో నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాన్ని ఆల్ ఇండియా ఒబిసి జాక్, తెలంగాణ పూలే యువజన సంఘాల సమాఖ్య తరుపున కూడా ఎన్నో సమావేశాలు నిర్వహించి, నిరసన ధర్నాలు చేయడం జరిగిందని అన్నారు.

    బి.సి కమీషన్ నియమించిన్నప్పుడు ఆ కమీషన్ కు చట్టబద్ధత లేదని సుప్రీం కోర్టు సూచనల ప్రకారం డెడికేటెడ్ కమిటీ వేయాలని డిమాండ్ చేసామని, బి.సి కమీషన్ బహిరంగ విచారణ చేపట్టినప్పుడు బి.సి ప్రజలకున్న సమస్యలను సవివరంగా వివరించడం జరిగిందన్నారు. ఇలాంటి ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుల జనగణన ప్రక్రియ జరపడానికి డెడికేటెడ్ కమీషన్ నియమించిందని అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి బి.సి రక్త బంధువులకు మద్దతుగా నిలిచిన బహుజన, ప్రగతిశీల శక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. 

    బి.సి సంఘాలుగా డెడికేటెడ్ కమీషన్ ను స్వాగతిస్తూనే, ఆ కమీషన్ పని తీరును గమనించాల్సిన అవసరముందని,  సమగ్ర కుల జనగణన అనంతరం ఆలస్యం లేకుండా స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ లో మిగతా అంశాల అమలుపై కూడా పోరాటం చేయాల్సిన అవరముందని అన్నారు.  

    ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు వేణుమాధవ్, టి జె ఎస్ జిల్లా అద్యక్షులు, న్యాయవాది చిల్లా రాజేంద్రప్రసాద్, సగర సంఘం నాయకులు నలుబాల రవికుమార్, వివిధ సంఘాల నాయకులు నలుబోల అమరేందర్, పి వెంకటచారి, తాటికొండ సద్గుణ, కాసుల సరోజన, ఎర్రోజు అశ్విని, కర్రే చంద్ర శేఖర్, అనిశెట్టి సాయితేజ, మామిడి రాఖీ, మాధవి స్వప్నరాణి, స్వప్న, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు