సూర్యకాంతమ్మ సెంచ రీల్

 


*_సూర్యకాంతమ్మ సెంచ"రీల్"..!_*


_గయ్యాళిగంపకు నూరేళ్ళు_

      28.10.1924


అందరూ నటిస్తారు..

కొందరు జీవిస్తారు..

ఇంకొందరు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు..


కానీ వీటన్నిటికీ అతీతంగా

అసలు ఏ పాత్ర తాను పోషించినా ఆమే ఆ పాత్రా..

లేక ఆ పాత్రే అమెనా..

అన్నట్టు అభినయించే

ఏకైక నటీమణి

బహుశా ప్రపంచ సినిమాలో

ఒకే ఒక్కరు..సూర్యకాంతం.

ఎన్ని పాత్రలు పోషించిందో..

అన్నిసార్లూ జీవించింది.

అందుకే మరణించినా ఆమె ఇంకా బ్రతికే ఉంది.గయ్యాళి అత్తగా..అంతకు మించి గుండక్కగా..!


ఆ రోజుల్లోనే కాదు..ఈ ఆధునిక రోజుల్లో సైతం ప్రతి ఇంట్లో..ప్రతి వీధిలో..లేదా ప్రతి కాలనీలో సంచరించే ఒక

వ్యక్తి..సాదాసీదాగా మనలో ఒకరుగా కనిపించాలి అనుకునే పాత్ర..అది ఉందంటే చాలు నిర్మాతదర్శకుల ఏకైక ఎంపిక సూర్యకాంతం.


సహజంగా నర్తకి..

నటిగా అనురక్తకి..

అసలు ఏ పాత్ర పోషించినా

అవలీల..సంసారం సినిమాతో మొదలైన గయ్యాళి పాత్రల ప్రస్థానం 

నటజీవితం చివరి వరకు

అప్రతిహతంగా సాగింది.

కాస్తో కూస్తో ఆమెతో పాటు ఛాయాదేవి కూడా ఆ రోజుల్లో గయ్యాళి పాత్రలు పోషించినా...ఇద్దరూ కలిసి

తెరను చించేసినా సూర్యకాంతం సూర్యకాంతమే..

ఎన్టీఆర్ ను నచ్చిన వారు

ఏయెన్నార్ ను నచ్చకపోవచ్చు గాక..

అలాగే అక్కినేని అభిమానులకు నందమూరి నటన రుచించదేమో..

కృష్ణ..శోభన్ కూడా అలాగే..

కాని అందరికీ నచ్చే నటులు

తెలుగు..తమిళ చిత్ర పరిశ్రమల్లో ముగ్గురే ముగ్గురు..ఎస్వీఆర్..

సావిత్రి...ఆపై సూర్యకాంతం!


గుండమ్మకథ..తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరూ మర్చిపోలేని చిత్రారాజం.

అక్కినేని..నందమూరి..

ఇద్దరు హీరోలు ఉన్న సినిమా పేరు గుండమ్మకథ..

తెలుగునాట ఇలాంటి 

అత్త ఒకరున్నారా.. 

గుండుబోగుల వారింట పుట్టి

అలాగే రాజ్యం చేసిందా..అన్నట్టు..

ఎంత చక్కగా ఇమిడిపోయిందో కదా ఆ పాత్రలో సూర్యకాంతం.

ఇంట్లో హాల్లో కర్ర సోఫాలో గుండక్క కూర్చుని ఉంటే

అదెంత నిండుదనం.

అంజి రామారావు..రాజా అక్కినేని..లక్ష్మి సావిత్రి..

సరోజ జమున.. గంటయ్య

రమణారెడ్డి..అప్పుడప్పుడు కనిపించే ఎస్వీఆర్..

హరనాథ్..ఛాయాదేవి..

రాజనాల..అదరహో..

గుండక్క సభ..నభూతో నభవిష్యత్ అన్నట్టు చివరకు

ఇల్లరికానికి ఎదురు

అల్లుడరికంతో ముగిసిన

మూడున్నర గంటల

వినోదం..ఎప్పటికీ చెదరిపోని

నవ్వుల సందోహం.

గుండమ్మగా సూర్యకాంతం

ఆసాంతం..జీవిత పర్యంతం..మరొకరు చెయ్యలేనిది..ఇంకొకరిని

ఊహించలేనిది..!


అదిగో వస్తోంది హిడింబ..

అంతటి ఎస్వీఆర్ కే అమ్మ..

పాండవులే కనిపించని

పాండవుల కథలో భీముని పత్ని..ఘటోత్కచుని మాత..

సుపుత్రా ..ఆ పని చెయ్యరా..

మెచ్చుకుంటాను..అన్న వీరమాత..నీ కారణంగా కృష్ణుడు..రుక్మిణీ..

బలరాముడు..రేవతి అందరూ నా ఇంటికి వస్తారని మురిసిపోయిన రాక్షస సోదరి..!


అదే సూర్యకాంతాన్ని రక్తసంబంధం సినిమాలో చూస్తే జ్వరమే..నిలువెల్లా కంపరమే..తంపులమారి..

అలాంటి పాత్రలు కొట్టిన పిండి..ఎన్నో సినిమాల్లో ఆమె పాత్ర పేరు అయితే కాంతం..లేదంటే సుందరమ్మ..తప్పితే సూరమ్మ..!


అత్తగా వేసినా..

మేనత్తగా అభినయించినా..

తోటికోడలుగా నటించినా..

వంటమనిషి పాత్ర పోషించినా..

సూర్యకాంతం ఉంటే తెరకు

నిండుదనం..

ఆన్నట్టు..మారుటి తల్లిగా

రాధను ఏడిపించినా..

తల్లిగా రమాప్రభను..కృష్ణను అదుపు చేసినా..భార్యగా

గుమ్మడి..రేలంగి..

రమణారెడ్డి..చివరకు రంగారావును రప్ఫాడించినా

ఆమెకే చెల్లు.. సతీసక్కుబాయిలో కోడలిని పెట్టిన ఆరళ్ళు..

దసరాబుల్లోడికే చుక్కలు చూపించిన పెంపుడు తల్లి..

ఉమ్మడికుటుంబంలో ఎస్ వరలక్ష్మి..సావిత్రి ఇద్దరికీ తోడికోడలుగా అభినయ వైశిష్టి..మంచిమనసులులో

ముందు అద్దె ఇంట్లో అక్కినేనిని నచ్చి ఆయన లేని భార్య కోసం హడావిడి చేసి..ఆపై అసలు విషయం తెలిశాక అల్లుడిని చేసుకుందామని ఆశపడి తర్వాత సంబంధం చెడిపోయాక బాధ పడ్డ తల్లిగా..ఒకే పాత్రలో ఎన్నో కోణాలు..కాంతమ్మ వాగ్బాణాలు..!


చారు చారు 

నా బంగరు చారు..


కోపమెందుకు.. తాపమెందుకు...

చేసుకున్న పాపం..


ఇలాంటి పాటల్లోనూ 

ఆమె అభినయం అదరహానే..


అన్నట్టు..ఇద్దరుమిత్రులు సినిమాలో బుర్రమీసాల పరంధామయ్య కొడుకుపై కోపంతో చిందులేస్తే హా అంటూ గుండె పట్టుకుని గాభరా పెట్టే మంచి తల్లి..

నా పక్కన చోటున్నది ఒక్కరికే..ఆ ఒక్కరు ఎవరన్నది నికెరుకే..అది నువ్వే..నువ్వే..నువ్వే..నువ్వే

అని పాడితే నేనే అంటూ సిగ్గు పడుతూ మురిసిపోయిన బాబ్డ్ హెయిర్ మోడర్న్ లేడీ..

ఎన్నని చెప్పాలి కాంతమ్మ పాత్రలు..దేనికదే అభినయ పరాకాష్ట..ప్రతి పాత్ర పెంచింది ఆమె ప్రతిష్ట..!


రాస్తుంటే ఇంకా రాయాలి అనిపించే అమ్మ కథ..

ఆమె అభిమాన నటి కాదు..

మన ఇంటి మనిషి..

గుమ్మడి గారన్నట్టు తెలుగింట ఆడపిల్లలకు సూర్యకాంతం అనే పేరు పెట్టడానికే జనాలు భయపడినంత ఘనాపాటీ..

ఎవరైనా ఏ కాస్త 

గయ్యాళితనం చూపించినా

సూర్యకాంతంలా ఉందిరా..

అని ఉటంకించేంత పాపులారిటీ..

ఏ పాత్ర పోషించినా

తెలుగు నేటివిటీ..

అసలు ఏ పాత్రకీ 

ఉండని పిటీ..

ఏ తరంలోనూ 

కనిపించని పోటీ..

అభినయంలో అత్యంత న్యాచురాలిటీ..

సూర్యకాంతం..

వెండితెరపై ఎదురులేని

తరతరాల సెలబ్రిటీ..!


_అమ్మకు అక్షర నీరాజనం.._


_*సురేష్ కుమార్ ఎలిశెట్టి*_

      విజయనగరం

    9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు