ముత్యాలమ్మ ఆలయ ఘటన పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది -మంత్రి సురేఖ

 


*తెలంగాణ గంగా జమున సంస్కృతికి విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించం*

*‘ముత్యాలమ్మ’ ఘటనని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది*

*మానసిక దుర్భలురు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడతారు*

*సమాజంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నించే వారిని వదలబోము*

*కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం*

*ఇలాంటి ఘటనల విషయంలో సంయమనంతో వుండాలని ప్రజలకు పిలుపు*

*అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ స్పష్టీకరణ*


తెలంగాణ గంగా జమునా సంస్కృతికి విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు  కొండా సురేఖ  అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఎవరూ దేవాలయాలపై రాజకీయాలు చేయవద్దని మంత్రి సురేఖ విజ్ఞప్తి చేశారు. దైవాన్ని మతాల ప్రాతిపదన విభజింవద్దని హితవు పలికారు. చారిత్మ్రకమైన ఈ హైదరాబాద్ నగరం మత సామరస్యతకు, సర్వమతాల సంరక్షణకు ఆలవాలంగా ఉండి, గంగా జమునా తెహజీబ్ ను కాపాడుకుంటూ వస్తుందని మంత్రి సురేఖ అన్నారు. సికింద్రాబాద్ లోని దేవాలయంలో ‘ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం’ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నదని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితున్ని అరెస్టు చేశామని గుర్తు చేశారు. నిందితునికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కారు  చేతల ప్రభుత్వమని, మాటల ప్రభుత్వం కాదని మంత్రి స్పష్టం చేశారు. 

ఈ ఘటనలో కొంతమంది అల్లరి మూకలు చేరి, మతసామరస్యతకు భంగం కలిగేలా చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా చర్యలు చేపట్టిందని అన్నారు. సంఘటన జరిగిన వెంటనే అక్కడికి దేవాదాయ శాఖ  అధికారులను పంపించి సమగ్ర వివరాలు సేకరించినట్టు మంత్రి తెలిపారు. ఈ రోజు నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. మిగతా పార్టీల మాదిరి తాము గుడుల పై,  ప్రజల నమ్మకాల పై రాజకీయాలు చేయదలుచుకోలేదని మంత్రి స్పష్టం చేశారు రేపు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సికంద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించాలని ఆదేశించినట్టు మంత్రి సురేఖ వెల్లడించారు. ఇటువంటి ఘటనల పట్ల దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంయమనం పాటించాలనీ, హైదరాబాద్ నగర మత సామరస్యాన్ని కాపాడాలనీ మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు