కుల గణనలో తెలంగాణ ఒక మోడల్




*కుల గణనలో తెలంగాణ ఒక మోడల్*  

*ప్రజల అభిప్రాయానికి పట్టం కడుతాం*

*నేడు మంగళవారం కలెక్టర్లతో కాన్ఫిరెన్స్* 

*వచ్చే నెల 6 నుంచి కులగణన*

*కులగణన పై సామాజిక వేత్తలు, మేధావులతో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క* 

రాష్ట్రంలో చేపట్టనున్న కుల గణన దేశవ్యాప్తంగా ఒక మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  సమావేశమయ్యారు. కుల గణనలో చేయాల్సిన మార్పులు, చేర్పులు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారితో సమాలోచనలు జరిపారు. రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి చేపట్టనున్న కులగణనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక, దిశా నిర్దేశం చేయడానికి నేడు (మంగళవారం) కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి సమాచారం తీసుకునేందుకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు వేస్తే బాగుంటుంది అని వారిని సలహాలు అడిగారు.  రాష్ట్రవ్యాప్తంగా 300 మంది సామాజికవేత్తలు, మేధావులు, అభ్యుదయ వాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను, సందేశాలను పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. వీరితో పాటు కుల సంఘాలు, యువజన సంఘాలను

పిలిచి  వారి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. వీరితో పాటు బీసీ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇతర భాగస్వాముల అభిప్రాయాలను సేకరిస్తామని వివరించారు. ప్రణాళిక శాఖ రూపొందించిన ప్రశ్న పత్రం సమగ్రంగా ఉందని సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ లాంటి మేధావులు అభినందించిన విషయాన్ని ఈ‌ సందర్భంగా వివరించారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేస్తామని ఎన్నికలకు ముందు కామారెడ్డి లో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో ప్రకటించామని, ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచామని చెప్పారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చిన హామీని అమలు చేయడానికి కార్యరూపం తీసుకువచ్చామని తెలిపారు. పాత కమిషన్ కాలం ముగిసిన వారంలోపే కొత్త బీసీ కమిషన్ వేశామని, బీసీ సంక్షేమం అభ్యున్నతి పట్ల ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని తెలిపారు. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో 56 ఇండ్లు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని కులగణన సర్వే పూర్తి చేసినట్టు తెలిపారు. 

న్యాయ పరమైన చిక్కులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్ మురళి మనోహర్ సూచించారు. రోజుకు ఒక ఎన్యుమరేటర్ 15 ఇండ్లు సర్వే చేయడం భారం అవుతున్న నేపథ్యంలో ఆ సంఖ్యను పదికి కుదించాలని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ సింహాద్రి, సామాజిక విశ్లేషకుడు పాశం యాదగిరి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు