జి ఓ 29 తో బహుజనులకు తీరని నష్టం
ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మెన్ సాయిని నరేందర్
ఆధిపత్య వర్గాలకు మేలు చేసే జి ఓ 29 వల్ల తెలంగాణలోని బహుజన ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని, జి ఓ 29 రద్దు అయ్యేవరకు బహుజన వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాటం చేయాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. జి ఓ 29 కు వ్యతిరేకంగా హన్మకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ వద్ద బహుజన సంఘాల జరిపిన నిరసన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష కట్టి బి.సి లకు నష్టం చేస్తున్నాయని, ఇ డబ్లు ఎస్ రిజర్వేషన్లతో కేంద్ర ప్రభుత్వం నష్టం చేస్తుంటే, జి ఓ 29 తో తెలుగు రాష్ట్రాలు నష్టం చేస్తున్నాయని, దొడ్డి దారిన ఆధిపత్య వర్గాలను ఉన్నత ఉద్యోగాల్లోకి పంపి రానున్న 30 ఏండ్ల వరకు వారి అధికారానికి అండ తయారు చేసుకునే కుట్ర పన్నారని అన్నారు. బిజెపి పాలనలో బి.సి లకు అన్యాయం జరుగుతుందని, కుల జనగణన జరిపి బి.సి లకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ వాగ్దానం చేస్తే నమ్మిన ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారని అలాంటి బహుజన ప్రజలను రేవంత్ ప్రభుత్వం మోసం చేయడం సరికాదని ఆయన అన్నారు. జి ఓ రద్దుకు బహుజన ప్రజలు పార్టీలు, సంఘాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అగ్ర వర్ణాల పేదల కోసం తీసుకొచ్చిన ఇ డబ్లు ఎస్ తో అగ్రవర్ణాల్లోని సంపన్నులు బాగుపడుతున్నారని, ఇలాంటి అసమానతలను తొలగించిన నాడే సమసమాజం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి.సి పొలిటికల్ జాక్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ జీవో 29 ను ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా తీసుకువచ్చిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం బ్యాక్ డోర్ తో తలుపులు తెరిచిందని, ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు జీవో 29 తో మరణ శాసనం లికిస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి వరంగల్ ఎలా కేంద్రమైందో అదే తరహాలో ఇక్కడి నుంచి బహుజన ఉద్యమం ఉద్భవిస్తుందని అన్నారు. ప్రభుత్వ విధానాలు ఇలాగే ఉంటే వేలాదిమంది బీసీలు ప్రభుత్వంపై దండెత్తాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నేతలు ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, ఐ ఎం ఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాళి ప్రసాద్, డాక్టర్ లక్ష్మి ప్రసాద్ నేతృత్వంలో పెద్ద ఎత్తున హాజరైన ఆందోళనకారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయగా హన్మకొండ జాక్ అద్యక్షులు తాడిషెట్టి క్రాంతి కుమార్, తెలంగాణ మేధావుల ఫోరం నాయకులు డాక్టర్ కొంగ వీరాస్వామి, పులి రజనీకాంత్, వేణుమాధవ్, విద్యార్థి నాయకులు వీరస్వామి, గణేష్ తెలంగాణ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box