చంద్రబాబు అనే నేను..!

 


*_చంద్రబాబు అనే నేను..!_*

_ఇంతకు ముందాయన_

_గదుల్లో.._

_ఈయన విధుల్లో..వీధుల్లో.._


_ఆయన సాక్షి.._

_ఈయన మనస్సాక్షి.._


________________________


*_సురేష్ కుమార్ ఎలిశెట్టి_*

             జర్నలిస్ట్

       9948546286


✍️✍️✍️✍️✍️✍️✍️✍️



*_నేను చూసాను.._*


ఆయన రాత్రనక..

పగలనక కష్టపడడం..


రాత్రి ఎంత ఆలస్యంగా 

పడుకున్నా తెల్లారే లేచి

యోగ చేసి అత్యవసరమైన

ఫోన్లు మాట్లాడి సూర్యుడు

ఉదయించే పాటికి రెడీ అయి

ప్రజలకు..అధికార్లకు అందుబాటులో ఉండడం..


పంచభక్ష్య పరమాన్నాలు

అందుబాటులో ఉన్నా

మనసుని నియంత్రించుకుని

డ్రై ఫ్రూట్స్ మాత్రమే తిని

ఇక బయలుదేరదామా అని

బస్సులోకి ఒక్క అంగలో

ఎక్కడం..


జన్మభూమి..

ప్రజల వద్దకు పాలన..

శ్రమదానం..

ఇలాంటి సందర్భాల్లో

ఆయనతో కలిసి కొన్నిసార్లు

బస్సులో..ఒకసారి ఆయన కారులోనే కలిసి 

ప్రయాణం చేసాను..

అలాంటి సందర్భాల్లో

ఆయనలోని వేగం..నిబద్ధత..

క్రమశిక్షణ..సమయపాలన..

అంకితభావం..

ఏదో చెయ్యాలన్న తపన..

ఏదైనా చేసెయ్యాలనే తాపత్రయం..

దగ్గర నుంచి చూసాను..


ఇవి మాత్రమేనా..

విషయ పరిజ్ఞానం..

విషయాలపై అవగాహన..

చెయ్యాల్సిన పనులపై స్పష్టత..

ఎవరికి ఏ పని అప్పగించాలనే

అంశాలపై క్లారిటీ..


ఇలా ఆ ఒక్క మనిషిలో 

చాలా విషయాలను

గమనించాను..

ఆయన అలుపెరుగని శ్రామికుడు..

సాధించిన దానితో తృప్తి పడని 

నిత్య కృషీవలుడు..

అధికారం చేతికి వచ్చేసింది కదా..ఇంకో అయిదేళ్ల పాటు ఢోకా లేదులే అని 

భావించే టైపు కాదు..

మునుపటి కంటే ఇంకా బాగా..

మరింతగా కష్టపడి..

పని చెయ్యాలనుకునే 

సైనికుడు..

మంచి కార్యకర్త..

ఇంకా మంచి నాయకుడు..!


ఈ సరికే ఆయన కటౌట్ 

కళ్ల ముందు కనబడే ఉంటుందిగా..

అదే ఆరడుగుల విగ్రహం..

ఢిల్లీ వెళ్లినా..

అమెరికాలో పర్యటించి

బిల్ గేట్స్..క్లింటన్..

ఎవరితో సమావేశమైనా..

సింగపూర్ వీధుల్లో తిరుగాడినా 

అదే ఫుల్ హ్యాండ్స్ జుబ్బా..

ఆ రంగులోనే ఫ్యాంట్..

బూట్లు..

పరుగు లాంటి నడక..

సింగిల్ హ్యాండ్ తో విష్..

పనంటే క్రష్..

ఎప్పుడూ ఫ్రెష్..


ఉమ్మడి ఆంధ్ర అభివృద్ధి దాత..

నవ్యాంధ్ర నిర్మాత..

స్ఫూర్తి ప్రదాత..

పద్నాలుగు సంవత్సరాల

వంద రోజుల పాటు ఇప్పటికి 

ముఖ్యమంత్రిగా పనిచేసిన

విశేష అనుభవశాలి..

విజనరీ..

*_నారా చంద్రబాబు నాయుడు_*


కొందరు ఆయన్ని *_సిఈఓ_* అంటారు..

ఇంకొందరు *_పని రాక్షసుడ_* ని 

అభివర్ణిస్తారు...

*_చాణక్యుడ_* ని పిలుస్తారు..

కిట్టనివాళ్ళు _వెన్నుపోటు దారుడ_ ని కూడా అనుకుంటారు..

_ఊసరవెల్లి_ మచ్చు అని కూడా

అనుకోవచ్చు..


ఎవరు ఏమనుకున్నా గాని

ఆయన 

*_ఫైటర్..లీడర్.._*


ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే...

మొన్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన నేతృత్వంలో టిడిపి..బిజెపి.. జనసేన కూటమి అఖండ విజయం సాధించి అధికారం చేపట్టిందని కాదు..


ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయి

వంద రోజులైందనీ కాదు..

అధికారం చేపట్టిన తర్వాత రెండు నెలల్లో ఠంచనుగా ఫించన్లు..జీతాలు..రేషన్ వంటివి ఇచ్చేస్తున్నారనీ కాదు..

అయిదేళ్ల పాలనలో రెండు మూడు నెలలు ఇవ్వడం ఏపాటి..రానున్న యాభై

ఏడు నెలలు కూడా క్రమం తప్పకుండా అన్నీ జరగాలి.

ఇవన్నీ పక్కన బెడితే

ఇప్పుడు ఇలా రాయడం చంద్రబాబు అనే వ్యక్తిని ఆకాశానికి ఎత్తేయడం కాదు.

వందరోజుల పాలన అసలు ప్రత్యేక సందర్భం కానే కాదు..


ఆ వ్యక్తి..డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో

విజయవాడలో వరద సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్న వైనం..విధానం..నచ్చి ఇలా మెచ్చవలసి వచ్చింది..


నిజానికి ఆయన ఎక్కడో 

తన ఏసి చాంబర్లో కూర్చుని

అధికారులతో,సిబ్బందితో

పని చేయించవచ్చు..

అలా చేస్తే ఆయన బాబుజీ ఎందుకు అవుతారు.. 

*_పబ్జీగా ఉండిపోతారు.!_*


ఆ అర్థరాత్రి..అన్ని సెక్యూరిటీ బంధనాలను తెంచి..

ప్రోటోకాల్ నిబంధనలను పక్కన బెట్టి..

ప్రమాద భయం లెక్క చేయక..

ప్రాణాన్ని ఫణంగా పెట్టి 

పడవలో విజయవాడ నగరంలో పర్యటించిన తీరు

అత్యంత ఆశ్చర్యకరం..

ప్రశంసనీయం..!


ఆయన అలా పరిగెత్తారు గనక

అధికారులూ పరుగులు తీశారు.ఆనాటి నుంచి తీస్తునే 

ఉన్నారు.కొందరు దీనిని

పబ్లిసిటీ స్టంట్ అని తేలిగ్గా అనేయవచ్చు గాని..

ఒక నాయకుడు..

సాక్షాత్తు ముఖ్యమంత్రి 

అలా స్ఫూర్తిదాయకంగా తిరిగితే..అదీ ఆ వయసులో

దాని ఫలితాలు ఎక్కడికి చేరతాయో ఇదంతా రాజకీయ కోణంలో చూసే వారికి కనిపించకపోవచ్చు.అయితే వరద..ముంపు ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలు చంద్రబాబు నాయుడు

స్ఫూర్తికి..నాయకత్వ పటిమకు

అద్దం పడతాయి.ఏ క్షణాన ముఖ్యమంత్రి అడుగుతారో..

సమీక్షిస్తారో..స్వయంగా వచ్చి పరిశీలిస్తారో.. అందరిలో 

అదే అప్రమత్తత..!..


*_నేను నిద్రపోను..మిమ్మల్ని నిద్రపోనివ్వను.._*..

చంద్రబాబు నాయుడు తరచుగా వాడే మాట..

ఇది నేను కూడా చాలాసార్లు

ఆయన ప్రసంగాల్లో విన్నాను.

కొన్నిసార్లు చూసాను..


హుదూద్ విలయం సమయంలో విశాఖలో

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన సేవ..

చేపట్టిన చర్యలు విశాఖ వాసులు మాత్రమే కాదు..

ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో 

శాశ్వత ముద్ర వేశాయి.

ఉత్తరాంధ్ర మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయి..మళ్ళీ విద్యుత్ వెలుగులు ఎప్పటికి 

చూస్తామో అని ప్రజలు తీవ్ర కలవరపాటులో ఉంటే 

రెండో రోజు సాయంకాలానికే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ వెలుగులు కనిపించాయి..


చెట్లు కూలిపోయి 

ఇక పచ్చదనం ఉత్తిమాటే అనుకుంటే అతి తక్కువ కాలంలోనే విశాఖ మళ్లీ

పచ్చగా ప్రత్యక్షం అయిందంటే

అది చంద్రబాబు కృషి వల్లనే..


ఇలా చంద్రబాబు చాలాసార్లు

స్ఫూర్తిదాయక నాయకత్వ పాత్ర పోషించి ముఖ్యమంత్రిగా తాను ఎందుకు విలక్షణమో చూపించారు..


ఇదే సందర్భంలో 

ఒక జర్నలిస్టుగా 

చంద్రబాబు నాయున్ని 

నేను దగ్గరగా చూసినప్పటి

అనుభవాలను 

మీతో పంచుకుంటున్నాను.

నేను జర్నలిస్టుగా 

వృత్తి జీవితాన్ని ప్రారంభించిన తొలిరోజుల్లో మొదటగా వెళ్ళిన పెద్ద ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడిదే..ఆ రోజునే చూసాను రెప్ప వేయని 

ఆయన కళ్ళను.. 

చెప్పకేం చేస్తాను.

కాస్త ప్రమాదకరమైన మనిషి సుమా అని ఓ క్షణం పాటు అనిపించినా ఆయన మాటల్లో..తెలుగుదేశం పార్టీపై.. విధానాలపై.. కార్యకర్తలపై ఆయనకు గల అభిమానం.. పట్టు ప్రత్యక్షంగా కనిపించాయి.

అప్పట్లోనే ఆయనలోని విజనరీని గాంచి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాను.


ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు అనేకం కవర్ చేసాను..

ముఖ్యమంత్రి అయిన తరువాత మొదటిసారి ఒంగోలు పర్యటనకు ఆయన వచ్చారు..అప్పటికే తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు దంపతులు కొంచెం ఎడం అవుతున్నారు..పోనీ బాబే దూరం పెడుతున్నారు అనుకుందాం.ఆ రోజున ఆంధ్రప్రభ రిపోర్టర్/ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన 

కవర్ చెయ్యడానికి 

నన్ను ప్రత్యేకంగా

విజయవాడ నుంచి ఒంగోలు పంపారు మా బాసులు..

చంద్రబాబు ఒంగోలు 

రావడం మధ్యానం మూడుకో..నాలుగుకో..

నేను ఉదయానికే ఒంగోలు చేరాను..అయితే ఆ రోజు ఉదయాన్నే నక్సలైట్లు నిజామాబాద్ లో మందుపాతర పేల్చడంతో కొందరు పోలీసులు

అసువులు బాసారు.దాంతో చంద్రబాబు అటు వెళ్లారు.

ఈలోగా ఒంగోలులో చిన్నపాటి భూకంపం రావడం..ఆ వెంటనే

భయంకరమైన వర్షం కురవడం..ఫలితంగా కరెంట్ పోవడం జరిగాయి.

ఇక ముఖ్యమంత్రి పర్యటన రద్దవుతుందని అనుకున్నారంతా..


మధ్యానం రెండు అయింది.

అప్పటికి నేను..కొంతమంది జర్నలిస్టు మిత్రులు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీసులో కూర్చుని ఉన్నాం..కె ఎల్ రెడ్డి అని ఎస్పీ..ఆయన అంతకు ముందు విజయనగరంలో 

పని చేసి ఉండడంతో నాకు మంచి మిత్రులే.సిఎం టూర్ క్యాన్సిల్ అనుకుంటుండగా హైదారాబాద్ నుంచి సందేశం వచ్చింది.సిఎం నిజామాబాద్ నుంచి తిరిగి వచ్చి ఒంగోలు బయలుదేరాలి అనుకుంటున్నారని..

ఒంగోలులో వాతావరణం గురించి వాకబు పూర్తయిన తర్వాత..బహిరంగ సభాస్థలి వద్ద జనం ఏపాటి ఉన్నారని మరో ఎంక్వయిరీ..అంటే దగ్గుబాటిని సైడ్ పెట్టడాన్ని ఒంగోలు ప్రజలు ఎలా రీసీవ్ చేసుకుంటున్నారని శ్లేష..జనం 

లెక్కకు మించిన సంఖ్యలో ఉన్నారని తెలియడంతో 

వెంటనే ఆయన హుటాహుటిన

హెలికాఫ్టర్ ఎక్కేసారు..


ఇదంతా చంద్రబాబు రాజకీయం గురించి చెప్పడానికి మాత్రమే కాదు.ఇక్కడ చంద్రబాబు ధైర్యాన్ని గురించి వివరించే సన్నివేశం కూడా ఉంది.


సరే..సభాస్థలి వద్ద జనం విపరీతంగా ఉన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో బాబుని చూద్దామని..ఈలోగా హెలికాప్టర్ సైట్ అయింది.

ఇంకేం..జనాలు ఈలలు వెయ్యడం మొదలైంది.

ఈలోగా గాలిలో హెలికాప్టర్ 

తూగడాన్ని చూసి అధికారులు..తెలుగుదేశం నాయకులు ..ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

చూస్తుండగానే అలా ఊగిపోతున్న హెలికాప్టర్

మొత్తానికి హెలిప్యాడ్ కు కొంచెం దూరంలో సురక్షితంగా లాండ్ అయింది.


వెంటనే చంద్రబాబు పైలట్ కు షేక్ హ్యాండిచ్చి ఠక్కున దిగేసి 

వేదిక ఎక్కిపోయారు.ఇదంతా దగ్గర నుంచి చూసాను నేను. జర్నలిస్టు బుద్ధి కదా..ఆగలేక పైలట్ దగ్గరికి వెళ్లి గాల్లో 

ఏం జరిగింది అని అడిగాను.

పైలట్ ఇలా చెప్పారు..

ఆరోజున మామూలుగా హైదారాబాద్ నుంచి ఒంగోలు

రాక పోక కోసం ఫ్యూయల్ నింపాము..అయితే అనుకోకుండా నిజామాబాద్ పర్యటన..తిరిగి రాగానే ఉండదు అనుకున్న ఒంగోలు ప్రయాణం..ఫ్యూయల్ తనిఖీ చేసుకోవడానికి కూడా సమయం  లోకపోయింది.ఇందాక గాల్లో ఉన్నప్పుడు చూస్తే ఫ్యూయల్ ఇంచుమించు అయిపోయింది.

అదే విషయాన్ని వీఐపీకి చెబితే

ఈ సమయంలో మీరేం చేస్తారు బ్రదర్ అని అడిగారు సిఎం.. క్రాష్ ల్యాండింగ్ సార్..అని చెబితే ఆయన చాలా నిబ్బరంగా మీరు ఏం చెయ్యగలరో అదే చెయ్యండి అన్నారు.సినిమాల్లో ఎన్నో అవలీలగా చేసే హీరో ఒకసారి (విమానం క్రాష్ కాండింగ్ అయితే భయంతో భోరున ఏడ్చిన వైనాన్ని గురించి విని ఉన్నాం)మొత్తానికి 

సేఫ్ ల్యాండింగ్..

వెంటనే ముఖ్యమంత్రి 

థాంక్యూ బ్రదర్ అని చెప్పి కరచాలనం చేసి దిగి వెళ్ళిపోయారు.


ఇదంతా వింటే నాకు ఆశ్చర్యం వేసింది. అటు వేదికపై అంతకు ముందు ఇంత ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తేనా అన్నట్టు నిమ్మళంగా కూర్చుని వేరే వాళ్ళు చెబుతున్న మాటలు నవ్వుతూ వింటున్నారు.. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి..

*_ది బ్రేవ్ సిఎం..!_*


మరో చిన్న అనుభవం..

ఎక్కువే అనుభవాలు ఉన్నా ఇందాక చెప్పింది..

ఇదీ కొంచెం ప్రత్యేకమైనవి గనక షేర్ చేస్తున్నాను...

అది విజయవాడలో జరిగింది..

జన్మభూమి పర్యటనలో భాగంగా ఆరోజున ముఖ్యమంత్రితో పాటు ఇంచుమించు ఆయన పక్కనే కూర్చుని చాలా సేపు ప్రయాణం చేసాను.

ఆ కారణంగా ఏర్పడిన చనువుతో మధ్యలో ఒక దగ్గర రోడ్డు పక్కన ఒక గమ్ము వద్ద భోజనానికి ఆగినప్పుడు 

బాబు నన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు.

నేను బిర్యానీ తింటుంటే ముఖ్యమంత్రి డ్రై ఫ్రూట్స్ బాక్స్ ఓపెన్ చేసి కొన్ని తిని నీళ్లు తాగి.. అనూహ్యంగా 

నా చేతిలోని ఎంగిలి ప్లేట్ తీసుకుని పక్కన బెట్టి ఎప్పుడూ ఇవేనా బ్రదర్ ..ఈసారికి ఇవి తిని చూడండి ..తేలిగ్గా ఉంటుందంటూ నా చేతిలో 

డ్రై ఫ్రూట్స్ బాక్స్ పెట్టారు..

ఎందుకో అప్పుడు మాత్రం..ఈయన భలే సింపుల్ అనిపించింది నాకు.

ఇంచుమించు అప్పటి నుంచి చంద్రబాబు నన్ను గుర్తు పడతారు.ఆ తర్వాత విజయవాడలో గాని ..గుంటూరులో గాని ..ఖమ్మం..

తాడేపల్లిగూడెం..వైజాగ్..

విజయనగరం..శ్రీకాకుళం..

పాతపట్నం..ఇలా ఎన్ని సభలకో కవరేజీ నిమిత్తం వెళ్ళినప్పుడు ఆయన నన్ను పలకరించి ప్రత్యేకంగా ముందు వరసలో లేదంటే పక్కన కూర్చోబెట్టుకునే వారు..


అదండీ..చంద్రబాబుతో నాకున్న పరిచయం..

అనుభవం..

అందుకే ఈ రోజున ఆయన విజయవాడలో ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్న సేవ నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు.

అది ఆయన సహజ శైలి..

అలవాటైన పని తీరు.


అలాగే జగన్ హయాంలో తనను జైల్లో పెట్టినపుడు కూడా ఆయనలో కనిపించిన నిబ్బరం కూడా నేచురలే..

ఆయన చెదరని శిల..మొహంలో భావాలే కనబడనివ్వని స్థితప్రజ్ఞుడు.

పని చెయ్యడం ఆయన శైలి..

కష్టపడడం అలవాటు...

*_He is a leader..!_*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు