గలగలా గరికపాటి..!

 



*_గలగలా గరికపాటి..!_*

_______________________


_నరసింహారావు జన్మదినం_


*_(ఎలిశెట్టి సురేష్ కుమార్)_*

           విజయనగరం

          9948546286


*_ఆయన.._*

మాటాడుతుంటే 

ఓ ప్రవాహం..

అక్కడ సాక్షాత్తు 

*వాగ్దేవి ఆవాహం...*

వేయి పండితుల హేల..;

సహస్రావధాన కేళి..

మాటల కథాకళి..

*ప్రతి పలుకు చెక్కరకేళి!*


*_గరికపాటి నరసింహారావు.._*

గలగలా కబుర్లు..

విశేషాల గుబుర్లు..

అంశం ఏదైనా 

ఉండబోదు మీమాంసం..

గళం విప్పితే గడగడే..

*స్వరం వినిపిస్తే గడబిడే..!*


స్కూల్లో మాస్టారి పాఠం

గంట కొట్టే వరకే..

ఎంత అభిమాన హీరో 

సినిమా అయినా 

శుభం కార్డు 

పడితే సరే..

రైలు ప్రయాణం 

గమ్యం చేరే దాకనే..

రాజకీయ నాయకుడి ప్రసంగం

ఆదిలోనే బోరు..

చెల్లని వాగ్దానాల హోరు..

మరి గరికపాటి వారి 

ప్రవచనం

*తినే కొద్ది తినాలనిపించే* 

*గారెల రుచి..*

ఆధునిక యువతకు 

నచ్చే పిజ్జా..

ముసలాళ్లకు వణికించే చలిలో 

వెచ్చదనాల రొజ్జ..

*సుగంధాలు వెదజల్లే*

*పూల సజ్జ..!*

పరధ్యాస లేకుండా ప్రాసలు..

ఆయాసం ఎరుగక యాసలు..

చురకలతో 

కొందరికి ప్రయాసలు..

*వింటున్న కొద్ది*

*పెరిగే జిజ్ఞాసలు..!*


ఆయన బుర్రే 

మొబైల్ అనుకుంటే...

*అన్లిమిటెడ్ టాక్ టైమ్ ...*

వాలిడిటీ లైఫ్ టైమ్..

ఎప్పటికీ నిండని ర్యామ్..

ఎప్పటికప్పుడు 

మారిపోయే సెట్టింగ్స్..

*చమత్కారాలు రింగ్ టోన్స్..*

ఇక యాప్స్.. 

ఆయన నాలిక కొసల టిప్స్..

*ఫోటోగ్రఫిక్ మెమరీ..*

*చలోక్తులు కంపల్సరీ..!*


వాల్మీకిలా హమేషా రామాయణం..

వ్యాసుని కంటే 

తమాషాగా భారతం..

*రగిలిపోయే* 

*ఆధునిక భారతం..*

పగిలిపోయే 

అక్రమార్కుల భాగోతం..

ఎండగట్టే వాదం..

పండిపోయి నవజీవన వేదం!


*ఈ వగ్గు కబుర్ల పోగు..*

చిన్నప్పుడు అమ్మో..అమ్మమ్మో

పోస్తుంటే వస..

వారు ఆదమరచినప్పుడు

మొత్తం కొమ్మునే మింగేసి ఉంటాడు నమిలేసి కసాకస..

*కాళిదాసులా అమ్మ దర్శనమై*

*నాలికపై దస్తకతు చేసిందో..*

తెనాలి లింగడిని మించి

కాళికమ్మని మురిపించి

మైమరపించి 

ఒకటికి మూడు పాత్రలే బుక్కేసాడో..

మొత్తానికి మాటలు చెబుతూనే బతికేస్తున్నాడు

నాకేం భయం లేదంటూ

*కొండొకచో ఉతికేస్తున్నాడు..!*


అమ్మ కన్న అన్నదమ్ముల్లో

కడపటి వాడు..

*రగిలే కుంపటి వీడు..*

తొలి పాఠం నేర్పిన 

అమ్మ పేరెత్తకుండా 

ముగియదు ప్రవచనం..

*_అమ్మ అనే మాట_*

*_ఆ చిన్నోడికి ప్రియవచనం.._*

సామెతలు కంఠాభరణాలు

పాండిత్యానికి గుర్తింపుగా

లెక్కేలేని స్వర్ణాభరణాలు..

ఎన్ని ఇచ్చినా 

*_మానడు కదా వాగ్బాణాలు..!_*


నరసింహారావు..అసలు పేరు

ధైర్యం ఒంటి పేరు..

*చాతుర్యం ఇంటి పేరు..*

ధారణ బ్రహ్మరాక్షసుడు

ముద్దుపేరు..

బోధన వృత్తి..

సాధన ప్రవృత్తి..

*మొత్తంగా అలుపెరుగని*

*అవధానమే ఇతివృత్తి..!*

**********************

తెలుగువారి 

అభిమాన అవధాని..

ప్రపంచ ప్రఖ్యాత ప్రవచనకర్త..

గరికపాటి నరసింహారావు 

జన్మదినం సందర్భంగా

శతకోటి నమస్సులు..


✍️✍️✍️✍️✍️✍️✍️

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు