నృత్యం..నటరాజులో ఐక్యం..!


 నృత్యం..నటరాజులో ఐక్యం..!


ఆమె గజ్జె కడితే..

గుండె ఝల్లుమంది..

గుండె ఝల్లుమంటే 

కవిత వెల్లువవుతుంది..


ఆమె నర్తనమే శివకవచం..

నటరాజ పాద సుమరజం..


యామినీ కృష్ణమూర్తి..


ఎప్పుడు నేర్చిందో నాట్యం

నటరాజే చేస్తున్నట్టు నృత్యం..

తనకే వచ్చా 

ఇంత గొప్పగా అన్నట్టు..

ప్రతి భంగిమ..ఓ మధురిమ..

అభినయం..

అడుగడుగునా రసమయం..!


గురువులు నేర్పిన విద్య అయినా

అంతకు మించి అధ్యయనం..

సాధన..శోధన..

సరికొత్త రీతులు..

తానే అక్షరీకరించిన కృతులు..

ఆ లయకారుని భంగిమలకే

కొంగొత్త ఆకృతులు..

నిజానికి..

ఈ యామిని

శివుడే

తానుగా రూపుదాల్చిన భామిని..!


ఆమె..భామాకలాపం..

సాక్షాత్తు సత్యభామే

దిగివచ్చి నర్తిస్తున్న అనుభూతి..

సాత్రాజితిలోని స్వాతిశయం..

కిట్టయ్య పట్ల 

తన అనునయం..

అతిశయం కాకుండగ 

వెన్నదొంగ ఇష్టసఖి

భావనలకు తన హావభావాలతో సమన్యాయం..!


వేదాలకూ నృత్యరూపకం

యామిని ప్రత్యేకం..

నాట్యకళ ప్రచారానికి పదమూడేళ్ళ పరిశోధన..

పదమూడు భాగాల

ధారావాహిక..

ఈ స్త్రీమూర్తి సృష్టి..

నృత్యమూర్తి..!

స్థల పురాణాలు..

భారతీయ చరిత్ర..

వీటి మేళవింపుగా 

వ్యాఘ్రపాద..

పతంజలి సూక్తులు...

కర్నాటక సంగీతం...

వీటన్నిటి కలయికగా

ఆమె సృష్టించిన నృత్యసర్వస్వం..

ఆ లయకారుడే కాలేదా

ఆమె వశం...

కళాసరస్వతే అవలేదా

పరవశం..!


నృత్యమే జీవితమై..

అభినయమే ప్రాణమై..

శోధనే వ్యాపకమై..

కళామతల్లి ప్రాపకమై..

ప్రదర్శనలే ప్రపంచమై..

నర్తనమే కవచమై..

కళారీతుల వ్యాప్తి ప్రవచనమై..

కళకే తాను బహువచనమై..

శివుని భూషణమై...

పద్మభూషణమై...

నృత్యానికే అంకితమైన

యామిని..గజగామిని..

ఆమె లయ ఆగిందా..

అద్భుత విన్యాసం విశ్రమించిందా..

ఆ తృష్ణ ఉపశమించిందా..

ఇదా మీమాంస..

యామిని మరణమంటే

లయకారుని అవతారం

ఉపసంహరణ..

శివుడే తన అంశను 

మళ్ళీ తనలో 

ఐక్యం చేసుకున్న

విశేషం..

యామిని కీర్తిశేషం..

కళ ఉన్నంత వరకు

కళ్ల ముందు కదలాడే 

ఆమె ఆకృతి..

వినిపిస్తూ ఉండే తన ప్రస్తుతి..

ఇదే ఇదే 

ఆ నాట్యసరస్వతికి 

నా సన్నుతి..

నీరాజన కృతి..!


🙏🙏🙏🙏🙏🙏🙏🙏


అభినయ సరస్వతికి 

అక్షర నివాళి..


(సురేష్..9948546286)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు