నూటికి నూరుశాతం కుల జనగణన చేస్తాం బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 


నూటికి నూరుశాతం కుల జనగణన చేస్తాం

బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 


     తరతరాలుగా సమాజ హితం కోసం శ్రమ చేస్తున్న సమాజానికి న్యాయం చేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలో బి.సి కుల జనగణన జరిపి తద్వారా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చేస్తామని అన్నారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ ఆడిటోరియం లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఒబిసి న్యాయవాదుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం రావాల్సిన వాటా కోసం పోరాటం తప్పు కాదని, నిరంతరం అన్యాయంపై వాదించే ఒబిసి న్యాయవాదులు బి.సి లకు అన్యాయం జరుగుతుంటే ఐక్యంగా పోరాడాల్సిన అవసరముందని అన్నారు. ఎన్నో పోరాటాలు, కమీషన్లు రిపోర్టుల ఫలితంగా బలహీన వర్గాలకు మేలు చేసే చట్టాలు వచ్చాయని, బి.సి లకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించబడినా క్రిమీలేయర్ విధానం, 50 శాతం సీలింగ్ పేరుతో అడ్డుకోవడం బాధాకరమని అన్నారు. విజ్ఞానం కలిగిన న్యాయవాదులు బి.సి సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే సమస్యల పరిష్కారం కోసం నేను ముందుంటానని అన్నారు. బి.సి హక్కుల కోసం పోరాటం చేసే న్యాయవాదుల సంఘానికి మొదట్లో కష్టాలు ఉంటాయని, కష్టాలను భరించి బి.సి సమస్యల పరిష్కారంలో ముందు నడవాలని పిలుపునిచ్చారు. 

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి.సి కమీషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం 1951 నుండి దేశంలోని ఎస్సి, ఎస్టీ ల జనగణన చేస్తూ ఆ వర్గాలకు కొంత మేలు చేస్తున్నప్పటికీ బి.సి లను మాత్రం అన్ని రంగాల్లో అణచివేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ ప్రకారం ఒకే ఓటు ఒకే విలువ ఉన్నపుడు బి.సి కుల జనగణన ఎందుకు చేయడం లేదని అన్నారు. కాకా కలేల్కర్ కమీషన్, బి.పి మండల్ కమీషన్ లు జనగణన చేయాలని సూచించినా పాలకులు ఉద్దేశపూర్వకంగా కుల జనగణన జరపకుండా బి.సి ల వాటా ఆధిపత్య వర్గాల వారు అనుభవిస్తున్నారని అన్నారు. రాజ్యాధికారం కొంతమందికి గుత్యాధిపత్యంగా ఉంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని, సకల సామాజిక రంగాల్లో బి.సి వాటా కోసం సమరం చేయాలని, న్యాయపరమైన చిక్కులు పరిష్కరించడంలో బి.సి న్యాయవాదులు మరింత కష్టపడాలని అన్నారు. బి.సి ల స్థితిగతులను మార్చే కుల జనగణన సాధన కోసం స్వాతంత్ర పోరాటం లాగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 



   కర్ణాటకకు చెందిన సీనియర్ న్యాయవాది ఎస్ బాలన్ మాట్లాడుతూ రాజ్యాంగ రచనా సమయంలోనే న్యాయ వ్యవస్థలో జనాభా దామాషా ప్రకారం వాటా ఉండాలని మాట్లాడాడని, నేటికీ ఆ జుడీషియరీ లో బలహీన వర్గాలకు వాటా లేకపోవడం బాధాకరమని అన్నారు. విద్య, ఉద్యోగాల్లో 27 శాతం వాటా కల్పించినప్పటికి ప్రతిబగలవారు లేరని భర్తీలో అన్యాయం చేస్తున్నారని, జుడీషియరీ, చట్టసభల్లో వాటా ఇవ్వడం లేదని అన్నారు. ఆధిపత్య వర్గాలతో పోల్చితే అట్టడుగు వర్గాల నుండి వచ్చిన వారే ప్రజలకు ఎక్కువ న్యాయం చేయగలుగుతారని అందుకు భిన్నంగా ఉన్నత న్యాయ వ్యవస్థలో కొలీజియం విధానం ద్వారా ఆధిపత్య కులాలతో నింపుతున్నారని అన్నారు. బ్రిటిష్ కాలం ముందునుండి నేటి వరకు ఉన్నత విద్యా సంస్థల్లో ఇంగ్లీషు తెలిసిన సంపన్నులు చదువుకొని ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులుగా నియమించబడుతున్నారని, ప్రమోషన్లలో ఆధిపత్య వర్గాలకు పైనున్న వారు మద్దతు చేస్తూ దళిత బహుజనులను అణచివేస్తున్నారని అన్నారు. బి.సి సమస్యలపై బి.సి న్యాయవాదులు ఐక్యంగా సమరం చేయడం ద్వారానే సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా సాధించవచ్చని అన్నారు. 

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూనే కు చెందిన న్యాయవాది వాసంతి నల్వాడ మహిళా బిల్లులో బి.సి వాటా పై మాట్లాడారు. రెండు వేల సంవత్సరాల ముందు నుండి మనుధర్మ శాస్త్రం ద్వారా మహిళలకు విద్య లేకుండా చేసి నోరు లేని పశువులలాగా చేసి అణచి వేశారని, నేడు మహిళా రాజకీయాల్లో అవకాశాలు లేకుండా చేస్తుందని అన్నారు. మహిళల సామాన్య హక్కుల కోసం పోరాడుతూనే మహిళా న్యాయవాదులు రాజ్యాధికారంలో వాటా కోసం పోరాటం చేయాలని అన్నారు. ఇంటా, బయటా, న్యాయ వ్యవస్థలో మహిళలకు అవకాశాలు కల్పించిన నాడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

    ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సింహాద్రి మాట్లాడుతూ బి.సి లను అణచివేస్తున్న పాలకుల కుటిల రాజకీయాలను అర్థం చేసుకొని ఉద్యమించాలని, స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి బి.సి లకు  జరుగుతున్న అన్యాయాలపై బి.సి న్యాయవాదులు పోరాటం చేయాలని అన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం పోరాటం చేసిన అంబేద్కర్, పెరియార్, రామ్ మనోహర్ లోహియా ల ఉద్యమాలను పరిశీలించి నేటికీ ఉపయోగపడే ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. బి.సి లు ఇంతవరకు రాజకీయ పార్టీలకు పావులుగా వాడుకోబడ్డారని, ఇక ముందు అలా జరగకుండా చూడాలని, ఆ దిశగా జరిగే ప్రక్రియలో బి.సి సమాజం నుండి ఎదిగిన వారు ప్రధానంగా న్యాయవాదులు కీలకపాత్ర పోషించాలని అన్నారు. 

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ బి.సి ల దుస్తికి ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి లదేనని అన్నారు. ఎన్నికల ఎజెండాలో కుల జనగణన చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరచిన విధంగా కుల జనగణన జరిపి స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బి.సి హక్కుల ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లి రాజ్యాధికారం సాధించాలని అన్నారు.

 

తీర్మానాలు


    ఒబిసి న్యాయవాదుల సదస్సు ముఖ్యమైన తీర్మానాలు చేసింది. కామారెడ్డి డిక్లరేషన్, మండల్ కమీషన్ నివేదికను అమలు పరచాలని, జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వ సహకారం అందించాలని, మహిళా బిల్లులో బి.సి కోటా ఇవ్వాలని, న్యాయవాదులపై దాడులను అరికట్టే చట్టం, బి.సి భవన్ నిర్మాణం, డిల్లిలో తెలంగాణ న్యాయవాదులకు విశ్రాంతి భవనం, హైదరాబాద్ లో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు, కొత్త చట్టాలను పునఃసమీక్షించాలని తీర్మానించారు.


    ఈ కార్యక్రమంలో తెలంగాణ హై కోర్టు న్యాయవాది జస్టిస్ సూరేపల్లి నంద, తెలంగాణ ప్రభుత్వ మాజీ అడ్వకేట్ జనరల్ బి.ఎస్ ప్రసాద్, మధ్యప్రదేశ్ సీనియర్ న్యాయవాది వినాయక్ ప్రసాద్ షా, బార్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకట్ యాదవ్, బి.శంకర్, రాపోలు భాస్కర్, ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల జీవన్ గౌడ్, కాంగ్రెస్ లీగల్ సెల్ పొన్నం తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు పొన్నం అశోక్ గౌడ్, ఐ ఎల్ పి ఎ రాష్ట్ర అధ్యక్షులు పొన్నం దేవారాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎన్ జె సాంసన్, ఉపాధ్యక్షులు పూస మల్లేష్, సదస్సు ఆర్గనైజర్లు న్యాయవాదులు సాయిని నరేందర్, సామ హేమలత, ఐల కొమరయ్య, తుల రాజేందర్, ఆకుల అర్జున్, ఎం సుమలత, టి లక్ష్మిదేవి, చెక్కిల్ల మహేష్, శ్రీకాంత్ చిందం, గోడ వెంకటేశ్వర్లు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన న్యాయవాదులు లడే రమేష్, చంద్ర ఋషి, భుజంగరావు, హస్సేన్, పులి సత్యనారాయణ, సత్యనారాయణ రెడ్డి, కూనూరు రంజిత్ గౌడ్, సుందర్ రామ్, సుమిత్ర, రూప, దయాల సుధాకర్, సాజిత్ పాషా, విజేందర్, శ్యామ్, జూకూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు