దసరా నుండి స్కిల్ యూనివర్సిటీలో కోర్సుల ప్రారంభం - సి.ఎస్ శాంతి కుమారి
హైదరాబాద్, ఆగస్టు 17 : రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనలమేరకు రూపు దిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా పలు రంగాల్లో కోర్సులను దసరా పండగ నుండి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని గుర్తించడం జరిగిందని, వీటిలో దసరా పండగ నుండి ప్రాధమికంగా ఆరు కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు ఈ స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై నేడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక, పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామ కృష్ణారావు, జయేష్ రంజన్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, TGIIC MD విష్ణు వర్ధన్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొ. వెంకట రమణ, శ్రీని రాజు, వీవీఎల్ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ, ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకు స్థాపన చేశారని, ఈ నిర్మాణ పనులు ముగిసేంతవరకు ఈ యూనివర్సిటీ ని తాత్కాలిక భవనంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకు గాను, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా గానీ, నాక్ లేదా నిథమ్ లో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఈ యూనివర్సిటీ చైర్-పర్సన్ గా ఆనంద్ మహేంద్రను, శ్రీనివాస సి రాజు ను కో-చైర్మన్ గా నియమించడం జరిగిందని అన్నారు.
ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయని, దాదాపు 20 కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించగా, తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలోనూ సర్టిఫికెట్ కోర్స్ లు, డిప్లొమా కోర్సులను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో శిక్షణ నిమిత్తం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన SBI , NAC , Dr . Reddi , TVAGA , ADAANI లు భాగస్వాములుగా ఉండేందుకు అంగీకరించారని వీరితోపాటు CII కూడా ముందుకు వచ్చిందని వెల్లడించారు. ఈ యూనివర్సిటీ కి సంబందించిన లోగో ను, Website ను ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ యూనివర్సిటీ లో కోర్సు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయమైన వేతనంతో కూడిన ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు.
-------ends
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box