విజయనగరం మహారాజు.. అభినవ దానకర్ణుడు

 


విజయనగరం మహారాజు..

అభినవ దానకర్ణుడు 

పివిజి రాజు జీవిత

చరిత్రపై ప్రచురించిన

పుస్తకం ఆవిష్కరణ ఇప్పుడే విజయనగరం కోటలో జరిగింది.ఆ వేడుకలో

పీవీజీ గుణగణాల విశ్లేషణ చేస్తూ పుస్తకాన్ని పరిచయం చేసే అవకాశం నాకు లభించింది..

ఇది ఇప్పుడే ముగిసిన నా ప్రసంగ పాఠం..చదవండి



*_సభాయనమః_*


ఇది పర్వదినం..

ఈరోజు కృష్ణాష్టమి..

ఆ సందర్భంగా ఇక్కడ కొలువై

ఉన్న ఆహుతులందరికీ శుభాకాంక్షలు..


ఈ రోజు ఇంకో వేడుక..

విజయనగరం 

పూర్వ మహారాజు 

అలక్ నారాయణ 

గజపతి రాజు జన్మదినం..

ఈ ప్రాంత వైభవానికి ప్రధాన కారకుల్లో ఆయన ఒకరు.

అంతేగాక పివిజి రాజు అనే దానచక్రవర్తికి జన్మనిచ్చిన 

పుణ్య పురుషుడు..

తానుగా మహాదాత..

కళాపోషకుడు..

ఆపై గొప్ప మేధావి..

తన ఆస్తిపాస్తులనే గాక

కన్నబిడ్డలను కూడా తన నుంచి వేరు చేసే ప్రయత్నాలు జరిగినప్పుడు మద్రాస్ హై కోర్టులో తన కేసును తానే స్వయంగా వాదించుకుని

ఆనాడే తెల్లదొరల భరతం పట్టిన మహా వ్యక్తి.ఆ రోజున ఆయన సాధించిన విజయం

విజయనగరం కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన అపురూపఘట్టం..


ఇక ఈ రోజున ఇందరు మహామహులు..ఈ చారిత్రక ప్రాకారంలో..అపూర్వ వేదికపై..

ఇంత వేడుకగా సమావేశం కావడానికి ప్రధాన కారణం.


*_పూసపాటి విజయరామ గజపతిరాజు.._*

ఇప్పుడు..ఈ శుభముహూర్తాన

ఆ మహాచక్రవర్తి కీర్తిప్రతిష్టలను శ్లాఘిస్తూ తెలుగులో ముద్రించిన 

పుస్తక ఆవిష్కరణ

మహోత్సవం మీ అందరి సాక్షిగా..ఈ చల్లని ప్రదోష వేళ 

జరగుతోంది.*_స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజా_* అనే శీర్షికతో

ప్రచురితమైన ఈ పుస్తకం నిజానికి ఆ అభినవ 

దాన కర్ణుడి 

జీవిత సమగ్రం కాదు.

అయితే ఆయన జీవితంలోని

ప్రధాన ఘట్టాలను కాస్త లోతుగా స్పృశిస్తూ

ఆయన విశేష గుణగణాలను

సునిశితంగా విశ్లేషించే 

ఓ విశిష్ట ప్రయత్నం.

ఆ పుస్తకాన్ని 

పరిచయం చేసే ముందు

మీ అందరికీ తెలిసిన..

మా అందరి దైవం శ్రీ పూసపాటి విజయారామ గజపతి రాజు

గురించి నాలుగు ముక్కలు చెప్పే మహదావకాశాన్ని..

జీవితకాలపు భాగ్యాన్ని 

నాకు కలగజేసిన

పెద్దలు శ్రీ అశోక్ గజపతిరాజుకి..

వారి కుటుంబానికి.. 

మాన్సాస్ సంస్థకు 

సదా రుణపడి ఉంటాను..


ఇక విషయానికి వస్తే..

*_పీవీజీ రాజు.._*

ఎవరి పేరు చెబితే ఈ గడ్డపై పుట్టిన ప్రతి మనిషి హృదయం పులకిస్తుందో..


ఎవరి దానగుణం గురించి నేల నలుచెరగులా అబ్బురంగా మాట్లాడుకుంటారో..


ఎవరి స్ఫూర్తితో ఈ గడ్డపై

వేలాది విద్యార్దులు చదువులమ్మ ఒడిలో అక్షరాలు దిద్ది ప్రపంచం నలుమూలలా

ఉన్నత స్థానాలను అలంకరించి

ఈ నేల ప్రతిష్టను విశ్వవ్యాప్తం గావించారో..


ఎవరి కీర్తి సూర్యచంద్రులు 

ప్రకాశిస్తున్నంత కాలం

అఖండంగా నిలిచి ఉంటుందో..


ఆ మహోన్నత చక్రవర్తిని..

యశోమూర్తిని..

చిర యశస్విని..

మహాతేజస్విని..


ఒక్క పుస్తకంలో 

పట్టి చూపించడం..

173 పుటలలో ఆయన 

ఘనకార్యాలను అభివర్ణించడం

క్లిష్ట ప్రక్రియే..కఠిన పరీక్షే..!


అయితే..పివిజి రాజు అనే

దాన చక్రవర్తి..విద్యాపిపాసి 

తాను స్వయంగా పురుడు పోసి ఊపిరి నింపిన

మహా సంస్థ.. *_మాన్సాస్_* 

ఆ విశిష్ట కార్యానికి నడుం కట్టి

దిగ్విజయంగా సాధించింది.


నిజానికి పివిజి జీవితం 

ఒక మహా గ్రంథం..

ఆయన కథ గొప్ప పురాణం..

మనకు తెలిసిన చరిత్రలో..

మనం విన్న కథల్లో..

మనం చదివిన పురాణాల్లో..

మహామహులు..

విశిష్ట వ్యక్తులు..

చరిత్ర పురుషులు..

ఎందరెందరో తమ సుదీర్ఘ జీవిత కాలంలో సాధించిన

అపురూప కార్యాలను 

రాజాసాహెబ్ 

అవలీలగా..అపురూపంగా..

సునాయాసంగా 

సుసాధ్యం చేసి

విజయనగర సామ్రాజ్య కీర్తిని

ఆనాటి కృష్ణ రాయల వారి 

హంపీ విజయనగరం సరసన ప్రతిష్టించారు.


అంతటి మహనీయుని గురించి

నా పరిధిలో..అదీ నిర్ణీత 

కాల పరిమితిలో చెప్పడం...

దుస్సాహసమే..

అయినా గాని

చందమామను అద్దంలో చూపించే ప్రయత్నం చేసాను..

మహా ప్రకాశవంతమైన

ఆ తేజోమూర్తిని దగ్గర నుంచి చూసిన చిన్ననాటి అనుభూతి..


ఆ విద్యాదాత నెలకొల్పిన 

వాగ్దేవి కొలువు..

*_మహారాజా కళాశాల_* లో

అక్షరాల అస్త్రాలను ప్రోధి 

చేసుకుని ఆ అస్త్రాలే శస్త్రాలుగా..జీవన శాస్త్రాలుగా బ్రతుకును పండించుకున్న 

సగర్వ పూర్వ విద్యార్థిగా..


అపార మేధోసంపత్తి 

కలిగిన ఆ సృష్ట ప్రసంగాలను.. మాటలను

చెవులారా విని..

వార్తలుగా మలచి..

రాజా వారి గురించి రాసానోయ్

అంటూ కాలరెగరేసి 

నేను సైతం..

గొప్ప వార్తాహరున్నే 

అని ఘనంగా చాటుకున్న జర్నలిస్టుగా..


ఈరోజున నా గుండె నిండుగా..

బ్రతుకు పండగా..

చదివిన చదువు సార్థకత నొందగా..నేర్చిన అక్షరాలు తరియించగా మా రాజాసాహెబ్ పెట్టిన అక్షరభిక్ష కారణంగానే

ఈ రోజున ఇలా పూసపాటి మహాచక్రవర్తులు ఎందరో సంచరించిన..కొలువు దీరిన

మహోన్నత సంస్కృతీ ప్రాంగణంలో..సరస్వతీ నిలయంలో..చారిత్రక వేదికలో..అపూర్వ వేడుకలో

ఇందరు మహామహుల ముందు నిలబడి మాట్లాడే 

మహాభాగ్యం..విద్యాదాత రుణం తీర్చుకునే అపూర్వ అవకాశం..

జన్మమే ధన్యం..!


ఇక్కడ మరో ముఖ్య విషయం..

అది నేను జర్నలిస్టుగా..

ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ గా చేరిన తొలి రోజుల నాటి గొప్ప అనుభూతి.

సింహాచలంలోని చందనా గెస్ట్ హౌస్ లో రాజా సాహెబ్ తో ఇంటర్వ్యూ...ఆ రోజున పీవిజి నన్ను ప్రపంచం మొత్తం తిప్పేసారు..ఎన్ని చెప్పారో..

ఎంత వివరించారో..

ఎన్నెన్ని చూపించారో..

ఆ క్షణాన నాకు సరస్వతీ కటాక్షమే లభించినట్లు అయింది..ఒక పరిపూర్ణ మానవతా మూర్తి..

మహా తత్వవేత్త..

గొప్ప మేధావి..

ఒక మహారాజు 

చిన్న పిల్లాడిలా మారి..

తను నేర్చుకున్న..

చదువుకున్న..

గ్రహించిన..చూసిన.. అనుభూతించిన ఎన్నో విషయాలను నాతో అబ్బురంగా పంచుకున్నారు.

అప్పుడే తెలిసింది నాకు.. పివిజి రాజు అనే వ్యక్తి

నేను చిన్నప్పటి నుంచి విన్న..

తెలుసుకున్న ఎన్నో విషయాలను మించిన

గొప్ప స్రష్టని..

ఆ రోజున ఆ మహాచక్రవర్తి విశ్వరూప సందర్శన భాగ్యం..

నా జీవితానికి సరికొత్త భాష్యం..!


ఇక ఈరోజు ముఖ్యాంశం..

రాజాసాహెబ్ పివిజీపై

మాన్సాస్ సంస్థ ఎంతో రమణీయంగా ప్రచురించిన పుస్తకం..*_స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజా.._*

ఇంతకు ముందే ఆవిష్కరించిన అపూర్వ గ్రంథం..

ఒక గొప్ప వ్యక్తి..దార్శనికుడు..

మహాదాత..విద్యా ప్రదాత..

మహారాజుగా పుట్టినా 

పేద గొప్ప తారతమ్యాలు ఎంచని నిజమైన సోషలిస్టు..

నవయుగ వైతాళికుడు..

కళాపోషకుడు..ఇలా ఎన్ని చెప్పినా సరితూగని చారిత్రక పురుషుని పరిచయం..

ఈ పుస్తకం మా విజయనగరం ప్రజలకు రామాయణ సమానం.. మరో భగవద్గీత..

ఇది అతిశయోక్తి కాదు.

ఈ విద్యలనగరం ప్రజల 

అభీష్టం..మనోగతం...

విజయనగర 

చారిత్రక గతం..

మా అవగతం..!


విజయనగరం అనగానే 

అందరికీ గుర్తుకు వచ్చేది

రాజవంశం తర్వాత

*_మహాకవి గురజాడ అప్పారావు.._*


ఆయన రాసిన స్ఫూర్తిదాయక 

సందేశాలు..

*_దేశమును ప్రేమించుమన్నా.._*

*_మంచియన్నది పెంచుమన్నా.._*


*_దేశమంటే మట్టికాదోయ్_* 

*_దేశమంటే మనుషులోయ్.._*


ఈ గొప్ప సందేశంతో మొదలైన 

పేజీలు..పుస్తకంలోని గంభీరతను పరిచయం చేస్తాయి..


ముందుమాట..

ఇది రాయడానికి పివిజి కుమారులు..ఆయన సంస్కృతీ వారసులు..

నిజాయితీ అనే ఆస్తిని

పంచుకున్న వారు

అయిన *_అశోక్ గజపతిరాజు_* ను

మించిన వ్యక్తి ఇంకెవరు ఉంటారు..తండ్రిగా ఆయన ప్రేమను..పెంపకాన్ని..

నాయకుడిగా ఆయనలోని ఆదర్శాన్ని..మహారాజుగా

ఠీవీని..దాతగా స్ఫూర్తిని..

విద్యావేత్తగా తన తండ్రిలోని 

మేధస్సును అతి దగ్గర నుంచి చూసిన..ఆస్వాదించిన..

అనుభూతించిన అశోక్

ఆ మేరునగశిఖరంతో

కొడుకుగా..వారసుడిగా

తన అనుభవాలు అన్నిటినీ రంగరించి అందించిన 

ముందు మాట..

ఆయన తన అనుభవాల మూటను అత్యంత హృద్యంగా

అక్షరబద్ధం చేసారు.చదువుతుంటే

పివిజి అలా కళ్ల ముందు

కదలాడుతున్నట్టు అనిపిస్తుంది.


విజయనగరం సంస్థానంలో

చివరి పట్టాభిషిక్తుడైన 

పివిజి రాజు ఎంతో హుందాగా..

అందంగా..రాజఠీవి ఉట్టిపడేలా...మోమున మేధస్సు ప్రస్ఫుటంగా కనిపించేలా కూర్చుని ఉన్న

చిత్రం కవర్ పేజీగా ముద్రితమైన పుస్తకంలో

తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి..

అశోక్ గజపతిరాజు 

ముందుమాటతో

శ్రీకారం..

బ్రిటిష్ వర్సెస్ మహారాజా

అన్న శీర్షికతో

అలక్ నారాయణ 

విజయగాథ..

పూసపాటి వారసత్వం..

వ్యక్తిత్వ నిర్మాణం..

కొత్తదారిలో ప్రయాణం..

సోషలిస్టు స్ఫూర్తి..

కాంగ్రెస్ లో చేరి ప్రజాసేవ..

విధి తెచ్చిన విషాదం..

కర్మ చక్రం..

ఇలా సాగింది రచన..

ప్రతి విభాగంలో ఆయా సందర్భాలలో..పివిజి జీవితంలో చోటు చేసుకున్న విశేషాలను..ఆయన ఆలోచనల్లో వచ్చిన మార్పులను నిశితంగా

వివరించే ప్రయత్నం జరిగింది.


ఎవరి పేరు మీద మాన్సాస్ అనే నహాసంస్థ పురుడు పోసుకుందో ఆ అలక్ నారాయణ గజపతి జీవిత విశేషాలను వివరిస్తూ..

బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన 

ఇంటా బయటా సాగించిన పోరాటాలను వివరిస్తూ

ప్రస్తుతం అశోక్ గజపతి రాజు నివసిస్తున్న నంబర్ 5 బంగళాలో జాతిపిత గాంధీజీకి

ఆతిధ్యం ఇచ్చి స్వరాజ్య పోరాటానికి భారీ విరాళాలు అందజేసిన సువర్ణ ఘట్టం వరకు స్పృశించారు.


ఇక పూసపాటి వారసత్వం

శీర్షికన సాగిన కథనంలో

రాజవంశీయుల

మిలటరీ బలగాలు..

విజయనగరం చారిత్రక కోట నిర్మాణం..ఆ మహా ప్రాకారం నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసిన ఢంకేషా వలీ బాబా

ఈ చోటు శాంతికి నిలయంగా 

చరిత్రలో నిలిచిపోతుందని చెప్పిన మాటలను ప్రస్తావించారు.


పివిజీ వ్యక్తిత్వ నిర్మాణం 

ఎలా జరిగింది..ఈ అంశాన్ని

ఆద్యంతం ఆసక్తికరంగా

వివరిస్తూ..పద్మనాభం యుద్ధానంతరం పూసపాటి కుటుంబం ఆలోచనల్లో వచ్చిన మార్పులు..సోషలిస్టు దృక్పథం దిశగా జరిగిన పరివర్తన..

ఇవన్నీ మాన్సాస్ ఆవిర్భావం..

విద్యాసంస్థల ఆవిష్కారంలో

ఎంత కీలక పాత్ర వహించాయో 

వివరిస్తూ వాటి పర్యవసానంగానే విజయనగరం మరో దక్షిణ బెనారస్ గా అవతరించిన 

వైనాన్ని చక్కగా ఆవిష్కరించారు.


పివిజీ పితామహుడు ఆనందగజపతి రాజు ప్రస్తావన లేకుండా పూసపాటి రాజవంశం చరిత్ర ఉండదు.అభినవ భోజునిగా కీర్తిగాంచిన 

ఆయన స్ఫూర్తితోనే

విజయనగరం సంస్థానం ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థలు ఆవిర్భవించడమే గాక

బెనారస్..కలకత్తా..మద్రాస్ ఆలిఘర్ విశ్వవిద్యాలయాలకు భూరి విరాళాలు వెళ్లాయి.

అలాగే రాజాసాహెబ్ ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ఎన్నో స్థలాలతో పాటు ఒక రాజభావనాన్ని కూడా ఇచ్చిన వైనాన్ని కూడా ప్రస్తావించారు.


రాజవంశంలోని స్త్రీ మూర్తులు

కూడా ఎక్కడా తగ్గలేదు.

మేము సైతం అంటూ దానధర్మాలతో పాటు

విజయనగరం ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు

కల్పించడంలో ముందున్నారు.

ఆ పరంపరలోనే ఆనందగజపతి సోదరి 

అప్పలకొండయాంబ మంచినీటి ప్రాజెక్టును అందివ్వడమే గాక

ఆ రోజుల్లోనే స్త్రీల కోసం ప్రత్యేకంగా ఘోషా ఆస్పత్రిని నిర్మించి తన ఉదారతను చాటుకున్నారు.


మూడవ అంకంలో పివిజి

జీవితాన్ని ఏ మహనీయ వ్యక్తులు ఎంతగా ప్రభావితం చేశారో వివరించే 

ప్రయత్నం జరిగింది.

రాజాసాహెబ్ మొదటగా అక్షరాలు దిద్దింది ఇంట్లోనే..

అటు తర్వాత విశాఖలోని సెయింట్ అలాయ్ సిస్ కాన్వెంట్..అక్కడి నుంచి

బెంగుళూరు సెంట్రల్ కాలేజీ..

అనంతరం మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాల.. 

ఇవన్నీ పివిజీ అనే వ్యక్తి మేధావిగా రూపొందడానికి అవసరమైన మెట్లను పేర్చాయి.


పివిజి జీవితాన్ని లేతప్రాయంలోనే అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి వేరెవరో కాదు..సాక్షాత్తు మన దేశ రెండవ రాష్ట్రపతి..అంతకు ముందు మహోన్నత ఉపాధ్యాయుడు శ్రీ సర్వేపల్లి

రాధాకృష్ణన్.. చాలా కొద్ది మందికి తెలిసిన గొప్ప విషయాన్ని ఈ పుస్తకంలో చెప్పారు.అప్పటికి కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న

రాధాకృష్ణన్ కేవలం పీవిజిని కలిసేందుకే అప్పుడప్పుడు ప్రత్యేకంగా విజయనగరం వచ్చి వెళ్ళేవారట.రాజాసాహెబ్ 

ఫిలాసఫీని తన ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకోడానికి కూడా

సర్వేపల్లి స్ఫూర్తి కారణం.


నిజానికి పివిజి జీవితాన్ని ప్రభావం చేసిన ఎందరెందరో

ప్రముఖుల్లో ప్రధాన వ్యక్తులు

సర్వేపల్లి రాధాకృష్ణన్..

స్వామి దయానంద ఉన్నారు..

ఆయనలోని విద్యావేత్త..

దానశీలి..వితరణశీలి..

వేదాంతి..తత్వవేత్త..అన్నిటినీ మించి సోషలిస్టు..

ఈ గుణాలన్నిటిపైనా ఆ ఇద్దరి ప్రభావం ఎంతైనా ఉంది.ఈ అంశాలన్నీ ఈ పుస్తకంలో 

వ్యక్తిత్వ నిర్మాణం అనే శీర్షికలో

కాస్త కూలంకషంగానే చర్చించారు.


ఇక క్రీడల పట్ల రాజాసాహెబ్ లో 

ఆసక్తి పెరగడానికి స్ఫూర్తి

స్వయంగా ఆయన పినతండ్రి

సర్ విజ్జి.. పివిజీ క్రికెట్..టెన్నిస్..గోల్ఫ్ ఆటల్లో మంచి ప్రావీణ్యం కనబరిచే వారు.అలాగే ఆయన గుర్రం పందేల పట్ల కూడా ఆసక్తి పెంచుకుని గుర్రాలను పెంచడమే గాక హైదారాబాద్ రేస్ కోర్స్ ఆవిర్భావంలో కూడా కీలక పాత్ర పోషించారు.


ఇలా పివిజి వ్యక్తిగత అభిరుచులు..అలవాట్ల గురించి ఈ పుస్తకంలో 

చర్చించి రాజాసాహెబ్ 

భావి జీవితంలో ఒక పరిపూర్ణ

వ్యక్తిగా రూపుదిద్దుకోడానికి

ఆయన అలవాట్లు..

అభిరుచులు ఎలా దోహదపడ్డాయో 

చర్చించారు.


పివిజి వ్యక్తిగతంగా

రాజభోగాల నుంచి సామాన్య

జీవితంలోకి తన దారిని ఎలా మళ్లించుకున్నారో దృష్టాంతాలతో సహా ఆసక్తికరంగా స్పృశించారు.

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణను తానే డ్రైవర్ గా తన సొంత కారులో దక్షిణాది మొత్తం తిప్పడమే గాక ఆయన పక్క బట్టలను మోసిన సింప్లిసిటీ...

పగలంతా సోషలిస్టు పార్టీ

కార్యక్రమాల్లో ఎడతెరిపి లేకుండా పని చేసి రాత్రుళ్ళు

సోషలిస్టు కార్యాలయంలో కటిక నేలపై నిదురించిన ఉదంతాలు రాజాసాహెబ్ లోని

ఉదాత్త భావాలను కళ్ళకు కట్టాయి. పివిజి నేలపై పడుకున్న చిత్రాన్ని 

చూపించారు.


అంతకు ముందు అమెరికాలో చదువు..

అక్కడ కుసుమ గారితో పరిచయం..పరిణయం..

ఆ దంపతులకు ఆనంద్..అశోక్..సునీత జన్మించడం..ఈలోగా రాజకీయ ప్రవేశం..ఇవన్నీ చకచకా జరిగిపోయాయి.పుస్తకంలో కూడా అంతే చక్కగా పేజీలు సాగిపోయాయి.


పివిజి రాజు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి అసెంబ్లీకి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.అలాగే రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి కావడానికి వీలుగా ఎస్ కోట నియోజకవర్గంలో అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్న సివి సోమయాజులు చేత రాజీనామా చేయించి పంతులు గారిని ఏకగ్రీవంగా సభకు పంపిన ఘనత రాజాసాహెబ్ కు దక్కింది.అటు తర్వాత 1955లో సతీమణి కుసుమ గారిని గజపతినగరం నియోజకవర్గం నుంచి

అత్యధిక మెజారిటీతో గెలిపించిన రికార్డు పివిజి సొంతం.


పివిజి తన సోషలిస్టు ప్రస్థానంలోనూ..ఇతరత్రా

ఎందరో మహనీయులతో

సన్నిహితంగా సంచరించారు.

వారిలో రామ్ మనోహర్ లోహియా..జేపీ..అచ్యుత్ పట్వర్ధన్..ఆచార్య నరేంద్ర దేవ్..మినూ మసానీ..ఆచార్య జేబి కృపలానీ..అశోక్ మెహతా ఉన్నారు.ఆ అశోక్ మెహతాపై గల అభిమానంతోనే తన రెండవ కుమారుడికి అశోక్ అని పేరు పెట్టారనే సంగతి 

ఈ పుస్తకం చదివే వరకు 

నాకు కూడా తెలియదు.

పార్లమెంటు సభ్యునిగా కూడా ఆయన పాత్ర స్ఫూర్తిదాయకం.రోల్స్ రాయిస్ వంటి కార్లు ఉన్నా సొంతంగా ఫియట్ కారు నడుపుకుంటూ

పార్లమెంటుకు వెళ్లారని చదువుతుంటే 

ఆ మహనీయుడు

అలా కళ్ల ముందు కదిలినట్టే అనిపించింది.


ముద్రా ఉదంతంలో పార్లమెంటులో పివిజీ స్పందన నెహ్రూను ఆకట్టుకుంది.

దాంతో పండిట్ జీ

రాజాసాహెబ్ ను ఒప్పించి

కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు..అప్పుడే ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి భీమిలి నుంచి శాసనసభకు ఎన్నికై

దామోదరం సంజీవయ్య క్యాబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పివిజి చొరవతోనే 

నిజాం ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సెంటర్ ఏర్పాటైన విషయం 

పుస్తకంలో ప్రముఖంగా చోటు చేసుకుంది.ఆ తర్వాత 1962లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై నీలం సంజీవరెడ్డి కొలువులో విద్యాశాఖను చేపట్టారు.విద్య రాజవారికి అన్నిటికంటే ఇష్టమైన అంశం.

ఆయన హయాంలోనే

రాష్ట్రంలో విద్యాపరంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.


అదే విద్యామంత్రి హోదాలో పీవీజీ విద్యాశాఖ మంత్రుల సమావేశానికి చండీఘర్ వెళ్ళడం ఆయన జీవితంలోనే కాదు విజయనగరం చరిత్రలోనే అత్యంత విషాద ఘట్టానికి 

దారి తీసింది.ఈ ఉదంతం గురించి చిన్ననాటి నుంచి విని ఉన్నా పుస్తకంలో చదువుతుంటే హృదయం ద్రవించిపోయింది.సహజంగానే

డ్యాంల పట్ల అమిత ఆసక్తి కలిగిన రాజాసాహెబ్ బాక్రానంగల్ చూడ్డానికి వెళ్ళిన 

సందర్భంలో ఆయన కారు దారుణ ప్రమాదానికి గురైంది.

డెబ్భై తొమ్మిది రోజుల పాటు కోమాలో ఉన్న పివిజీ తిరిగి వస్తారని ఎవరూ అనుకోలేదు.

ఆయన చేసిన మంచి..దానధర్మాలు..విజయనగర ప్రజల ప్రార్థనలు..ఇవన్నీ ఫలించి ఆ శిబి  చక్రవర్తిt పునర్జన్మనొంది..కొన్నాళ్లపాటు కఠిన నియమాలు..యోగా ఇత్యాది కర్మల ద్వారా తిరిగి ప్రజాజీవితంలోకి వచ్చిన వైనం

పుస్తకంలోని కొన్ని పేజీల తడి ద్వారా మనం కళ్ళకు కట్టినట్టు

అనుభూతిస్తాం..!


ఆ తర్వాత రాజాసాహెబ్ లో మునుపటి వేగం కొరవడినప్పటికీ రాజకీయాలపై

ఆసక్తి తగ్గక..భీమిలి నుంచి మళ్ళీ అసెంబ్లీకి వెళ్లడమే గాక విశాఖ..బొబ్బిలి పార్లమెంటు స్థానాల్లో సునాయాసంగా గెలిచి మళ్ళీ పార్లమెంటులో అడుగుపెట్టారు.ఇదంతా కొత్త దారిలో ప్రయాణం అధ్యాయంలో సుస్పష్టంగా ప్రస్ఫుటించింది..


ఇంతటి మహారాజు..

అఖండ సంపదకు అధిపతి..

అపారమైన ఆస్తిపాస్తులను

విద్యాసంస్థలు.. దేవాలయాల పరం చేసిన దానశీలి 

పివిజి రాజు తన చివరి రోజులను సింహాచలంలోని

గోశాల పక్కనే ఉన్న సింగిల్ రూం కాటేజీలో గడిపారు.

విలాస జీవితం అనుభవించలేక కాదు..

మనసు రాక.. వానప్రస్థ ధర్మం  ఖచ్చితంగా పాటించిన రాజరుషి ఆయన..పుస్తకాలే నేస్తాలు..అలాగని పూర్తి వైరాగ్య స్థితిలోనూ లేరు.

బయటప్రపంచంలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎంతో అప్డేటెడ్  గా ఉండేవారు.ఇది నేను కూడా

ఆయనతో మాట్లాడినప్పుడు

తెలుసుకుని చకితున్నైన సందర్భం..


ఎన్నో కష్టసుఖాలు..బరువు బాధ్యతలు..జీవిత పర్యంతం లెక్కలేనన్ని తీపి..చేదు జ్ఞాపకాలు..వంద జన్మలకు సరిపడా అనుభవాలు..

అనితరసాధ్యమైన 

కీర్తి ప్రతిష్టలు.. 

పరిపూర్ణ జీవితం..

ఇక చాలనుకున్నారో ఏమో..

డెబ్బై రెండు సంవత్సరాల వయసులో

1995 నవంబర్ 14 న 

ఆ రాజర్షి తుది శ్వాస విడిచారు.

తమ ప్రియాతి ప్రియమైన చక్రవర్తి మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైన విజయనగరం ప్రజలు అంతలోనే తేరుకుని రాజు అంతిమ యాత్రలో అశేష సంఖ్యలో స్వచ్చందంగా పాల్గొని తిరిగిరాని మహా లోకానికి పయనమైన

విశిష్ట సామ్రాట్టుకు ఘనంగా నివాళి అర్పించారు.ఆ యాత్రను చూస్తున్నట్టే అభివర్ణించారు పుస్తకంలో..

యాత్రలో పాల్గొన్న..విషయం తెలిసిన అందరి నోటా ఒకటే మాట.. ఇందుకే గామోసు..

మునుపటేడు సిరిమాను తిరగలేదని..పెద్ద కీడును 

ఆనాడే శంకించామని..!


మొత్తంగా.. 

ఎన్నో మహత్తర ఘట్టాలు..

అపురూప సన్నివేశాలు..

చిరస్మరణీయ అనుభవాలు..

అనితరసాధ్యమైన 

దానవిశేషాలు..

బహుముఖ ప్రజ్ఞ..

అపార మేధో సంపత్తి..

తత్వగుణాలు..

వేదాంత ధోరణి..

ఎప్పటికేది అవసరమో అప్పటికి అందులోకి

తనంతట తానే ప్రవేశిస్తూ..

ఎదురైన ఎన్నో అనుభవాలను

తనకు తానే అన్వయించుకుంటూ..

మృత్యువుని కూడా జయించి..ఆ తర్వాత కూడా

తన  జీవితాన్ని తాను నమ్మిన మార్గంలోనే సాగించి 

చరితార్థుడైన మానవతా మూర్తి పూసపాటి విజయారామ గజపతిరాజు..!

పురాణ సమానమైన పివిజి 

జీవిత కథను ఈ పుస్తకం

అనేక కోణాల్లో మన కళ్ళ ముందు ఆవిష్కరించింది.


ఎన్ని చేసినా...

ఎంత సాధించినా..

ఇంకెంత పేరు గాంచినా..


పివిజి చరిత్రలో

సువర్ణ అధ్యాయాలుగా

నిలిచిపోయేవి..

ఆయన బాగా ఇష్టపడి చేసినవి..


జ్ఞానానంద మార్గదర్శనంలో మాన్సాస్ స్థాపన..

సింహాచలం కొండపైకి సొంత నిధులతో ఘాట్ రోడ్డు నిర్మాణం...

దళితులకు ఆలయంలో ప్రవేశం కల్పించడం..

కళాశాలల స్థాపన..

విద్యార్థుల భోజన వసతి కోసం

సింహాచలం చౌల్ట్రీ ఏర్పాటు..

అందుకోసం 370 ఎకరాల కేటాయింపు..

కోరుకొండలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు చొరవ..

సర్ విజ్జి పేరిట వందలాది ఎకరాలతో పాటు చారిత్రక భవనం దానం..

వీటన్నిటినీ మించి తన కోటను 

విద్యాసంస్థల నిర్వహణ కోసం వినియోగించేలా మాన్సాస్ ట్రస్టుకు ధారాదత్తం చేయడం...


కోటను దానం ఇచ్చేనాటికి

పీవిజి వయసు ఎంతో తెలుసా..

*_ముప్పై నాలుగు..!_*


అంత చిన్న వయసులోనే

ఆ చక్రవర్తికి 

అంతటి దానగుణం..

గొప్ప పరిపక్వత..

పెద్ద మనసు..

విశాల దృక్పథం..


నేను మహారాజుగా అమెరికా వెళ్లి సామాన్య పౌరుడిగా స్వదేశానికి తిరిగి వచ్చాను...

అని ఎంతో సులువుగా చెప్పిన 

పరిపక్వత పీవిజీ గుణవిశేషం.

అలాగే అమెరికాలో ఉన్నప్పుడు చేసిన చిన్న ఉద్యోగాలు..నాటి అనుభవాలను కూడా ఆయన అబ్బురంగా చెప్పుకునే వారు.

ఇవన్నీ పుస్తకంలో చదువుతున్నప్పుడు మనకు పీవిజిలోని గొప్ప వ్యక్తిత్వం సాక్షాత్కారమవుతుంది.

ఔను..

చరిత్ర పురుషులకే 

అది సాధ్యం..


ఇక్కడే పుస్తకంలో పొందుపరచిన మరో అపురూప ఘట్టాన్ని ప్రస్తావించక తప్పదు..

అంగరంగ వైభవంగా

పివిజి ఇరవై రెండవ ఏట

జరిగిన పట్టాభిషేకమహోత్సవంలో

బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ కచేరీ జరిగింది.ఆ రోజున కచేరీ ముగిసిన వెంటనే పివిజి

తన కంఠంలోని నెక్లెస్ తీసి అచ్చమైన మహారాజు మల్లె

బిస్మిల్లాకు బహుకరించారట.

ఈ విషయాన్ని ఇరవై సంవత్సరాల తర్వాత ఖాన్ తనను జపాన్లో కలిసిన ఒక వ్యక్తితో అబ్బురంగా చెప్పారు.

ఆ వ్యక్తి కూడా ఆనాటి పట్టాభిషేక వేడుకలో పాల్గొన్న వారే..


సంస్థానాల రద్దు సమయంలో రాజాసాహెబ్ వయసు ఇరవై రెండు..అప్పుడే ఆయన భరణం తీసుకోడానికి నిరాకరించి తమ కుటుంబాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతుల సొమ్ము తనకు అక్కర్లేదని చాటిచెప్పారు..ఆ రోజుల్లోనే ఆ మొత్తం సాలుకు యాభై లక్షల రూపాయల పైమాటే.

ఈ ఘట్టం గురించి చదువుతుంటే ఒళ్ళు పులకించింది.


నిజానికి..పివిజి 

మనిషి రూపం దాల్చిన దాతృత్వం..


ఆధునిక రుషి..


పురాణ పురుషుడు..


ఈ కలియుగంలో

మనసున్న మారాజై ఆయన 

అవతరించారు..


ఆయన మన మహారాజై

మనం తరించాము..!


ఈ పుస్తకం ఇంత అద్భుతంగా 

రావడానికి ప్రధాన కారణం 

అశోక్ గజపతి సంకల్పం..

అనుసరించి మాన్సాస్ కృషి..

రూపకర్త హైదారాబాద్ బుక్ ట్రస్ట్..రాయడమే గాక అచ్చుతప్పులు..

ముద్రారాక్షసాలు లేకుండా 

అన్ని జాగ్రత్తలూ తీసుకున్న 

గీతా రామస్వామి..శశి కుమార్..జయదీప్ ఉణుదర్తి..

శివాని కాశీనాథుని.. అనంత్ మరిగంటి ప్రభృతులకు..

పివిజి జీవితంలోని కొన్ని ఘట్టాలను సజీవంగా ఆవిష్కరించిన చిత్రకారులు

అంట్యాకుల పైడిరాజు...పూసపాటి పరమేశ్వర రాజు గార్లకు 

మాన్సాస్ తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు..ఇంగ్లీషులో రాసిన పుస్తకాన్ని ఎంతో సరళంగా..సజీవంగా తెలుగులోకి అనువదించిన వేమన వసంతలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు..


అలాగే విజయనగరం సంస్థానంలో శతాబ్దాల తరబడి

భాగస్వాములుగా ఉన్న కుటుంబాలకు కూడా కృతఙ్ఞతలు.వారు రాజవంశం వారసత్వం..మూలాల గురించిన విలువైన సమాచారాన్ని గుండె విప్పి పంచారు.


ఇదంతా అశోక్ గజపతి రాజు స్వయంగా రాసిన ముందుమాట..అదే ఆయన హృదయాంతరాలలోని అనుభూతుల మూటల నుంచి సేకరించినది..


మన కాలంలో మన మధ్య ఉండి మనిషిలా సంచరించి..దేవుడిగా ఎదిగిన 

పివిజి రాజు జీవిత చరిత్ర అనదగ్గ ఈ పుస్తకం కొందరి జీవితాల్లో మార్పుకు...

అభివృద్ధికి స్ఫూర్తిని ఇవ్వగలిగితే మాన్సాస్ అయితేనేమి.. రాజవంశం అయితేనేమి చేసిన కృషికి సార్థకత లభించినట్టే..


పీవిజి రాజు అమర్ రహే..

జై హింద్...


ప్రణామాలు..


సురేష్ కుమార్ ఎలిశెట్టి

     జర్నలిస్ట్ 

  విజయనగరం

9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు