• *ఇల్లు పీకి పందిరి వేసిన చందంగా ఉంది కేసిఆర్ నిర్వాకం*
• *కేసిఆర్ ను నమ్ముకుంటే ఉన్న ఇల్లు పాయె... గుడిసె పాయె ...*
• *తక్షణమే కేసీఆర్ సొంతం గ్రామం చింతమడక లో పర్యటించాలని అధికారులకు ఆదేశాలు*
• *బేషజాలకు పోకుండా చింతమడకలో ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తాం*
• *తన దృష్టికి వచ్చిన వెంటనే పేదోళ్ల కష్టాలపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
* * *
*హైదరాబాద్* : ఎనకట ఒకడు ఉన్న ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితనం కూడా ఆలాగే ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. తన పుట్టినిల్లు అయిన చింత మడక గ్రామంలో సిఎం హోదాలో ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని పేదోళ్ల ఇండ్లన్నీ కూల్చి వేసి ఇప్పటివరకు వారికి నిలువ నీడ లేకుండా చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి దశ దిశ చూపిస్తా అని ప్రగల్పాలు పలికిన ఆయన ఉన్న ఉరోళ్లకే పంగ నామాలు పెట్టారని విమర్శించారు.
“చింతమడకలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మించి ఇస్తానని 22 జులై 2019 లో ఆర్భాటంగా ప్రకటించారు. పెద్ద సారు చేసిన ప్రకటనను నమ్మి తమ ఇళ్లను, గుడిసెలను అక్కడి నిరుపేదలు సర్కారుకు అప్పగించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వాటిని కూల్చి వేశారు. ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన మేరకు లబ్ధిదారులను గుర్తించి 1909 ఇళ్లను అధికారులు మంజూరు చేశారు. కానీ 1215 ఇళ్ల ను నిర్మించడానికి మాత్రమే కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకున్నారు. 694 ఇళ్లకు అగ్రిమెంట్ జరగలేదు, నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు, గత ఏడాది డిసెంబర్ నాటికి నాలుగు సంవత్సరాల లో 1103 ఇళ్ల ను మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 148 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో దాదాపు 60 నుంచి 70 కుటుంబాలు ఉన్న ఇంటిని, గుడిసెలను కోల్పోయి రోడ్డున పడ్డాయి. పలువురు పేదలు పొలంగట్ల దగ్గర గుడిసెలు వేసుకున్నారు. మరి కొంతమంది ఇతర ప్రాంతాలకు వలస పోయారు. ఇళ్ల కోసం ఐదేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు, కానీ...ఇల్లు రాలేదు ఉన్న ఇల్లు పోయింది, గుడిసె పోయింది. లబ్ధిదారులకు కేటాయించినా కొన్ని ఇళ్లకు తాళం చెవులు ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేయలేదు. చేసిన ఇండ్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదు” అని తెలిపారు.
నిరుపేదలకు నిలువ నీడను కల్పించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమని, కానీ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన గత పాలకులు ఈ కర్తవ్యాన్ని విస్మరించారని, ప్రజల అవసరాలను ఆశలను గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుందని విమర్శించారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ సొంత గ్రామం చింతమడికే అని అన్నారు,
“హామీలు ఇవ్వడమే కాదు ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో అమలు చేయడమే ఇందిరమ్మ రాజ్యమని, ముఖ్యంగా పేదవాడికి సొంత ఇల్లు ఒక కల... అది నెరవేరితే పేదవాడి ఇంట పండుగే అని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్ళకు పూర్తి న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి మేలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం...లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు మాత్రమే రాష్ట్ర చరిత్రలో శిళాశాసనాలు అయ్యాయి.
గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలంతా ఫామ్ హౌజ్‌లు కట్టుకుని పేదలకు మాత్రం ఇంటి సౌకర్యాన్ని విస్మరిస్తే ఇప్పుడు మేం వారికి కూడా నివాస వసతిని కల్పిస్తున్నాం. ఇది ప్రజా ప్రభుత్వం.. పేదల మేలు కోరే ప్రభుత్వం.. అందుకే ఇందిరమ్మ రాజ్యం అని గర్వంగా చెప్పుకుంటున్నాం” అన్నారు. తక్షణమే చింతమడకలో పర్యటించి ఇండ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదని ఎలాంటి భేషజాలకు పోకుండా వీలైనంత త్వరగా అక్కడి ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box