నువ్వు డౌనైతే కౌంట్ డౌనే!_

 



*_నువ్వు డౌనైతే కౌంట్ డౌనే!_*

ఇచ్చేసావా మొత్తం నీ సిరి..

ఇక నీ పని సరి..

ఇంకేమి మిగిలున్నా ఇవ్వు..

*_సలహా మినహా..!_*


ఆఫీసులో పదవీ విరమణ

ఇంట్లో పెదవీ విరమణ..

విధులకు గుర్తింపుగా పెన్షన్

ఇంట్లో మొదలయ్యే టెన్షన్

అక్కడ చివరి రోజున సన్మానం

ఇక్కడ మొదటి రోజు నుంచే అవమానం..

ఇన్నాళ్లు విధినిర్వహణ...

*_ఇకపై కష్టసుఖాల_*

*_ఆరోహణ అవరోహణ...!_*


వృద్ధాప్యమంటే మంటే..

పంటి బిగువున బాధ..

కంటిలో కనిపించని ధార..

గుండెల్ని పిండేసే వేదన...

వడలే మోము..కదిలే పళ్లు..

అవయవాలకు తెగుళ్ళు..

మనసుకు పగుళ్లు..

భారంగా గడిచే పగళ్లు..

నిద్రపట్టని రాత్రుళ్ళు..

నెమరువేసుకుంటూ

గతకాలపు స్మృతులు..

*_అనుభవిస్తూ వర్తమానపు_*

*_చేదు అనుభూతులు!_*


*_వృద్ధాప్యం.._*

నీకుగా అనిపించకపోయినా 

ఇంట్లో వారు వేసేసే ముద్ర..

ఆపై శాశ్వత నిద్ర..

ఊరు పొమ్మంటుంది

కాడు రమ్మంటుంది..

నరకమో.. స్వర్గమో

అది చేరేలోగానే

ఇంట్లో మొదలయ్యే నరకం

మారే బంధువుల వాలకం..!


మెయిన్ హాలు నుంచి 

మూల గదిలోకి మారే 

నీ మకాం..

అప్పటి నుంచి 

అన్నిటికీ బీ కాం

ఫించను ఠంచనుగా వస్తే ఓకే

లేదంటే అధ్వానపు బ్రతుకే..

ఇన్నాళ్లు నీ వారి కోసం 

నువ్వు పెట్టిన పరుగు..

ఇప్పుడేమి మిగిలేను

నిన్ను చూస్తేనే విసుగు...

పనులకైనా 

పనికొస్తుందేమో అమ్మ..

*_నాన్న ఉత్తి దిష్టిబొమ్మ!_*


వ్యాపారంలో..

మోసాలు సాగినంతకాలం 

హవాలా.. 

అన్నీపోతే దివాలా..

జీవితంలో అంతా 

బాగున్నప్పుడు రంగీలా..

లేదంటే గిలాగిలా..

వృద్ధాప్యం కారాదు శాపం..

అనిపించుకోవద్దు 

అయ్యో పాపమని..

సంపద ఉంటే తప్పేను ఆపద

ఆపై ఆరోగ్యమే మహాభాగ్యం

ఈ రెండూ కరవైతే 

ముసలి కాలం 

కష్టనష్టనికృష్ఠాల మిశ్రమం..

అదిగో పిలుస్తోంది వృద్ధాశ్రమం..

*_నీ జీవిత_* 

*_చరమకాల ఆరామం!_*

************************

(అందరూ ఇలా లేరు..

కొందరు ఆర్థికంగా 

ఉన్నవారు బాగానే ఉన్నారేమో..

కొందర్ని పిల్లలు చక్కగా చూసుకుంటూ ఉండవచ్చు..

అవకాశం ఉన్నవారు ఖరీదైన

వృద్ధాశ్రమాల్లో ఉంచి మేము

మా పెద్దలకు న్యాయం చేస్తున్నామని ఫీల్ అవ్వొచ్చు గాక..ఏదిఏమైనా వృద్దుల్లో అత్యధికులు ఏవో రకాల

బాధలు పడుతున్నారనేది

వాస్తవం..)


_అంతర్జాతీయ_ 

_సీనియర్ సిటిజెన్స్ డే.._

      

 *_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

         విజయనగరం

        9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు