• ముగిసిన అభిప్రాయ సేకరణ
• భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా
• కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనకు కసరత్తు
- రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రెవెన్యూ చట్టం ముసాయిదాపై ప్రజలనుండి అభిప్రాయ సేకరణ పూర్తి అయిన నేపథ్యంలో చట్ట రూపకల్పనపై దృష్టి సారించాలని, కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి అవసరమైన కసరత్తును త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
వచ్చిన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అన్నింటినీ ఒక దగ్గర పొందుపరచి పరిశీలించాలని, వచ్చిన వాటిలో ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి ఏది అవసరమో ఆ అంశాలను ఈ కొత్త చట్టంలో ఉండేలా జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి, పరిస్థితులకు తగినట్టుగా భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నామని వెల్లడించారు.
“తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తే, గత పాలకుల తొందరపాటు నిర్ణయాలతో అది నెరవేరకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నం అయ్యాయని విమర్శించారు. 2020 రెవెన్యూ చట్టం లోపభూయిష్టంగా ఉండడంతో రైతులు, భూ యజమానులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
ధరణి పోర్టల్ వల్ల భూ సమస్యలు మరింత పెరిగాయని, దీంతో రైతులు, భూ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సివచ్చింది. తప్పుల తడకల ధరణి వల్ల రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది రైతులు ధరణి బాధితులుగా మారారు. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేలా మేధావులు, నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, ప్రజా ప్రతినిథులు, రైతులు, సామాన్య ప్రజలనుంచి కూడా అభిప్రాయాలను స్వీకరించడం జరిగింది.
ముసాయిదాపై ఈ నెల రెండవ తేదీన శాసన సభలో చర్చించి అదే రోజు హైదరాబాద్ లోని భూ పరిపాలన ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో వర్క్ షాప్ లు కూడా నిర్వహించడం జరిగింది. జిల్లా స్థాయిలో నిర్వహించిన వర్క్ షాప్ లలో వచ్చిన సూచనలను ఒక నివేదిక రూపంలో కలెక్టర్లు వెంటనే భూపరిపాలన కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున సూచనలు వచ్చాయి. లిఖిత పూర్వకంగా, అలాగే ఈమెయిల్ ద్వారా కూడా సూచనలు వచ్చాయి. సామాన్యులు సైతం పలు సూచనలు చేశారు.
అమలు చేసేవారికి అవగాహన ఉండేలా రైతులకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవినీతి రహితంగా చట్టాన్ని తీసుకురాబోతున్నాం. గత ప్రభుత్వంలో అత్యంత రహస్యంగా ఉన్న ధరణిని మా ప్రభుత్వం ఒక పబ్లిక్ డాక్యుమెంట్ గా అందరికీ అందుబాటులో ఉంచబోతుంది అని ప్రకటించారు.”
* * *
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box