నేను చేసిన ఈ అనువాదాన్ని ((కొంచెం మార్చి అనుకుంటున్నా..

 


(నేను చేసిన ఈ అనువాదాన్ని

((కొంచెం మార్చి అనుకుంటున్నా..

అదీ లేదేమో))

పృథ్వి అనే వ్యక్తి 

ఎలా తన పేరుతో 

వీడియో చేసి

స్క్రిప్ట్ తనదే అంటూ వాడేసుకున్నారో చూడండి..

సోషల్ మీడియాలో ఈ తరహా వ్యవహారాలు పెచ్చుమీరిపోతున్నాయి)


రాకేష్ ఝున్జున్వాలా అనే కోటీశ్వరుడు రెండేళ్ల క్రితం

ఇదే నెలలో అంపశయ్యపై ఉన్నప్పుడు చెప్పిన అక్షరసత్యాలివి..

ఇది అప్పుడే నేను రాసింది.

అయితే ప్రతి మనిషి 

ఎన్ని సార్లయినా మననం చేసుకోవాల్సిన అంశాలు ఇందులో ఉన్నాయి గనక మరోసారి పోస్ట్ చేస్తున్నాను.

వీలు చూసుకుని కాదు చేసుకుని చదవండి..

_______________________

*_కుబేరుడి ప్రవచనం!_*

************************

ఇది నిజానికి బిగ్ బుల్ రాకేశ్  ఝున్జున్వాలా ఇంటర్వ్యూ..

అంతకుమించి ఒక గొప్ప అనుభవజ్ఞుడి సందేశం.. జీవితాన్ని కాచి వడబోసి..స్టాక్ మార్కెట్ ను పిండి ఆరేసి..అంతులేని సంపదను కూడగట్టి...

డబ్బు గడించడంలోని మర్మాన్ని..ఖర్చు పెట్టడంలోని ధర్మాన్ని సూక్ష్మంగా వివరించిన మాటలివి..

కుబేరుడి తత్వబోధ అనుకుందాం..అలాగే చదువుదాం... 


ఇంటర్వ్యూ పాయింట్లు..


1)జనం ఊహిస్తున్న దాని కంటే నా దగ్గర ఉన్న సంపద తక్కువే..కాని చిత్రం ఏమిటంటే అది నాకు అవసరమైన దాని కంటే చాలా ఎక్కువ..!


2)ధనం ఈ ప్రపంచంలో అన్నిటి కంటే కఠినమైన వాస్తవం..కొందరు అదంటే పడి చస్తారు..ఇంకొందరు దాని కోసం నిజంగానే  చస్తారు..కొందరేమో దానిని సద్వినియోగం చేస్తారు..ఎక్కువ మంది వృధాగా ఖర్చు పెడతారు.

చాలా మంది సంపాదన కోసం చాలా కష్టపడతారు.

మొత్తానికి అందరూ దానిని కోరుకునే వారే..!


3)చాలా డబ్బు సంపాదించిన తర్వాత

నాకొక సత్యం అవగతమైంది..

అన్నిటికీ డబ్బే ప్రధానం కాదు..సంపాదన జీవిత పరమార్థం కానే కాదు...!


4)డబ్బుకు కోటానుకోట్ల సుగుణాలు ఉన్నా వాటన్నిటినీ మించి ఒక్క దుర్గుణం ఉంది..

అదేంటా..నీ చివరి ప్రయాణంలో అది నీ వెంట రాదు..!


5)నేనొక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని..కుర్రాడిగా ఉన్నప్పుడు నాకు ఖరీదైన స్నేహితులు ఉండేవారు.

అయితే మా నాన్న గారు(ఆయన ఇన్కమ్ టాక్స్ అధికారి)అప్పట్లో నాకో విషయం చెప్పేవారు..

నువ్వు కూడా వాళ్ళలా అవ్వాలని కోరుకో...

తప్పు కాదు..కాని

నీ కంటే బాగున్నారని 

స్నేహితుల్ని ద్వేషించకు..

వారిని చూసి అసూయపడకు..!


6)నాకు ఫోర్బ్స్ జాబితాలో స్థానం లభించిందని తెలిసినప్పుడు 

మా నాన్నగారు నాతో అన్న మాటలు నాపై మంత్రంలా పని చేశాయి..

నువ్వు ఆ జాబితాలో ఉండడం తండ్రిగా నాకు సంతోషమే...కాని నీకు సిగ్గు అనిపించడం లేదూ..నీ దగ్గర కోట్లు ఉండి ఏం ప్రయోజనం...దానధర్మాల కోసం నువ్వు ఏమీ ఖర్చు చెయ్యలేనప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నా నా దృష్టిలో అదంతా వృధా.. 

దానధర్మాలపై ఖర్చు చెయ్యని నువ్వు నా దృష్టిలో అప్రయోజకుడివి..!

       అంతే..అప్పటి నుంచి నా రాబడిలో ప్రతి ఏడూ 25 శాతం దానధర్మాలకు వెచ్చిస్తున్నాను..ఇప్పుడు నాకు అంతులేని 

తృప్తి ఉంది.!


7)డబ్బు నాకు ఏం చేసింది..


*మారుతి బదులు మెర్సిడెస్ బెంజ్ కారు ఎక్కించింది.

*వెయ్యి చదరపు అడుగుల స్థలంలో ఉండగలిగితే సరిపోయే కుటుంబాన్ని 5000 చదరపు అడుగుల విశాలమైన భవంతిలో ఉండేట్టు చేసింది..

*ఫోర్ స్క్వేర్ సిగరెట్టు అంటించవలసిన నేను 

ఇండియా కింగ్స్ వెలిగించే స్థాయి ఇచ్చింది.

*డిప్లొమెట్ విస్కీ తాగే బదులు బ్లూ లేబుల్ విస్కీ గొంతులో పోస్తోంది..!

అంతకంటే డబ్బు కారణంగా నా జీవితంలో పెద్ద 

మార్పు లేదు..!


8)డబ్బు మనలో మార్పు తేకుండా జాగ్రత్త పడాలి..

నీలోని మనిషిని చంపేయకుండా..

నీ కుటుంబం..

నీ స్నేహితులు..నీతో పాటు పెరిగిన..నువ్వు ముందు నుంచి ఎరిగిన వారి పట్ల 

నీ వైఖరి మారిపోకుండా

ఉండగలిగితే నువ్వు ఎప్పటికీ సంపన్నుడివే..!


డబ్బు కొనగలిగే ఎన్నో నిజంగా ముఖ్యమైనవే..

అయితే అదే డబ్బు కొనలేనివి..ఇంకా విలువైనవి చాలా ఉంటాయి..

వాటిలో ప్రధానమైనవి విశ్వాసం..ప్రేమ..సంతోషం!


డబ్బు గురించి ఇంకేం చెప్పమంటారు..

సంపాదించడానికి కష్టపడండి..

సద్వినియోగం చెయ్యండి..


*_డబ్బుని ప్రేమించండి.._*

*_కాని ఆ డబ్బు కోసమే జీవించకండి.._*

*_డబ్బు కంటే ఎక్కువగా జీవితాన్ని ప్రేమించండి..!_*



ఈ రోజున నా దగ్గర విలువైనవి చాలా ఉన్నాయి..

అవి డబ్బు కంటే కూడా గొప్పవి..మంచి జీవితం..డబ్బు..

విజయాలు..చక్కటి  భార్య..

మంచి స్నేహితులు..


అన్నీ ఉన్నాయి..

అందరూ ఉన్నారు..

*ఏం లాభం ఆరోగ్యం లేదు*


ఆ దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను..


అయ్యో..ఆ అపర కుబేరుడి

ప్రార్థనలు దేవుని చేరినట్టు లేదు..


అపార సంపద..

అంతులేని విలాసాలు..

పిలిస్తే ముంగిట చేరిపోయే సౌకర్యాలు..

మంది..మార్బలం..


ఏవీ వెంటరాని ప్రయాణంలో..

సామాన్యుడిగా..

ఒంటరిగా..

బ్రీచ్ కాండీ అత్యున్నత వైద్య సదుపాయాలు...అత్యంత నిపుణులైన వైద్యులు చేష్టలుడిగి చూస్తుండగా

తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు..రాకేశ్...


*జాతస్య ధృవో మృత్యు..*


ఆంగ్ల ఇంటర్వ్యూ..

అనువాదం..


*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

      9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు