హైదరాబాద్ లో గ్రీన్ డేటా సెంటర్



హైదరాబాద్ లో గ్రీన్ డేటా సెంటర్
భారీ పెట్టుబడులకు సిద్ధపడ్డ ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్
ఏఐ ఆధారిత నెక్స్స్ జెన్ సేవలను అందించే లక్ష్యం
దశలవారీగా దాదాపు రూ.3350 కోట్ల పెట్టుబడులు 


ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు భారీగా స్పందన లభించింది. ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే 11 కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. పలు సంస్ధలు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు,  వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించాయి. తాజాగా ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్లో 400 మిలియన్ డాలర్లు  (దాదాపు రూ.3350 కోట్లు) పెట్టుబడులకు సిద్ధపడింది.  హైదరాబాద్‌లో నెక్స్ట్-జనరేషన్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్‌ నిర్మించనున్నట్లు ప్రకటించింది. దశలవారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో సంస్థ సీఈవో, ఛైర్మన్ వెంకట్ బుస్సా సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణలో తమ విస్తరణ ప్రణాళికలతో పాటు భారీ పెట్టుబడులను కంపెనీ ప్రకటించింది.  
గత ఏడాది ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికను ప్రకటించింది. ఇప్పుడు తమ ప్రణాళికలను భారీగా విస్తరించింది. 100 మెగావాట్ల అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ను స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి దాదాపు రూ.3350 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది. 

ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటం సంతోషంగా ఉందన్నారు. దీంతో భారీగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. 

అరమ్ ఈక్విటీ పార్టనర్స్ సంస్థ కొత్త డేటా సెంటర్ ఏర్పాటును మంత్రి శ్రీధర్​బాబు స్వాగతించారు. ఇప్పటికే డేటా సెంటర్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ కు ఈ పెట్టుబడులు మరింత వృద్ధిని తెచ్చిపెడుతాయని అన్నారు. 

తమ సంస్థ నెలకొల్పే అధునాతన డేటా సెంటర్తో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ సేవల మధ్య అంతరం తగ్గుతుందని ఆరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్ సీఈవో, ఛైర్మన్ వెంకట్ బుస్సా అన్నారు. ఈ-సేవ, ఈ-పేమెంట్, ఈ -ఎడ్యుకేషన్ వంటి ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు