గద్ధరన్న విగ్రహాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

 


ప్రజలే గద్దరన్న వారసులు

గద్ధరన్న విగ్రహాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

గద్దర్ కుమారుడు గుమ్మడి సూర్య కిరణ్ 


  భారతదేశ పీడిత ప్రజల విముక్తి కోసం తుదివరకు పోరాడిన గద్దర్ అన్నకు నిజమైన వారసులు పీడిత ప్రజలేనని గద్దర్ కుమారుడు గుమ్మడి సూర్య కిరణ్ అన్నారు. గద్ధరన్న విగ్రహ ప్రతిష్టాపన కమిటీ చైర్మన్ కొండ్ర నర్సింగరావు అధ్యక్షతన శనివారం హన్మకొండ జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో జరిగిన గద్దరన్న ప్రథమ వర్ధంతి లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పీడిత ప్రజల విముక్తి కోసం తుదివరకు త్యాగపూరిత పోరాటం చేసిన గద్దరన్న విగ్రహాలను, స్మృతి కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజా పాలన కొనసాగిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వంపై ఉందని అన్నారు. గద్ధరన్న స్ఫూర్తితో చెట్టు పుట్టతో మమేకమై జీవిస్తున్న ఆదివాసీల రక్షణ కోసం, అణగారిన ప్రజల హక్కుల కోసం  ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుడు సంగంరెడ్డి పృధ్వీరాజ్ మాట్లాడుతూ భారతదేశ ప్రజలను, వారి కష్టాలను అర్థం చేసుకున్న మహా నాయకుడు గద్ధరన్న అని, పేద ప్రజలకు పెద్ద అండగానున్న గద్ధరన్న లేకపోవడం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. తెలంగాణ నలుమూలల్లో తన ఉద్యమ యాత్ర కొనసాగించిన గద్దర్ అన్న ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమై దిక్కులేని ప్రజలకు పెద్ద దిక్కుగా నిలిచిన గుండెనిండా ప్రేమ కలిగిన మహా నాయకుడని అన్నారు. గద్ధరన్న ప్రతి మాటలో, ప్రతి అడుగులో, ప్రతి పాటలో పీడిత ప్రజల విముక్తి కోసం సందేశముందని అన్నారు. త్యాగానికి ప్రతిరూపమైన గద్దరన్న తన భార్య, బిడ్డ, కొడుకు గురుంచి ఆలోచన చేయకుండా ప్రజల కోసమే పని చేసి అమరజీవిగా నిలిచారని అన్నారు

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ పుట్టుక, చావు తనది బతుకంతా ప్రజల పక్షాన నిలబడి కలబడి పోరాటం చేసిన గద్దర్ చరిత్రను వివరంగా నమోదు చేసి ప్రజలకు అందివ్వాలని అన్నారు. వరంగల్ కేంద్రంగా జరిగిన ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న గద్ధరన్న స్మృతి కోసం బాగంగా వరంగల్ లో రెండు ఎకరాల్లో గద్ధరన్న స్మృతి వనం, కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వరంగల్ జిల్లా ఎమ్మెల్యే, మంత్రులకు విజ్ఞప్తి చేశారు.

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న విముక్త చిరుతల కక్షి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ గద్దర్ అన్నను, గద్దర్ చరిత్రను చంపాలని, రూపుమాపాలని చూస్తున్నారని, ఏ పార్టీ కోసం ఆయన తన సర్వస్వాన్ని త్యాగం చేశాడో ఆ పార్టీ నేడు గద్దర్ అన్నను స్మరించుకోవడం లేదని, ఆ పార్టీ అనుబంధ సంఘాలు, ఆయన పని చేసిన విభాగం కూడా గద్దర్ అన్న యాది సభలు పెట్టకపోవడం బాధాకరమని అన్నారు. నిజమైన పేదలు, పీడిత వర్గాల ప్రజలు గద్దర్ అన్న యాది సభలు పెట్టుకుంటున్నారని, గద్దర్ అన్న మరణాన్ని, గద్దర్ అన్న పతనాన్ని కోరుకున్న వారు నేడు గద్దర్ వర్ధంతి సభల్లో మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. గద్దర్ అన్న సాహిత్యం మీద తెలంగాణలో ఏ విశ్వ విద్యాలయంలో సదస్సులు జరగడం లేదని, గద్దర్ చరిత్రను, సాహిత్యాన్ని, ఆయన ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో చర్చకు పెట్టాలని, గద్దర్ మార్గాన్ని ముందుకు తీసుకు పోవడానికి అందరం కలిసి ఐక్యంగా కదలాలని, గద్దరన్న స్మాకార్థంతో పాటు ఆయన ఆశయాలను కొనసాగించడానికి వరంగల్ లో ఒక స్మారక భవనాన్ని ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గద్దర్ అన్న విగ్రహ ప్రతిస్టాపనకు దోపిడి వర్గాల నుండి సొమ్ము తీసుకోకుండా పేద ప్రజల సొమ్ముతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.

     ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ నాయకులు సాయిని నరేందర్ మాట్లాడుతూ మార్క్స్, లెనిన్, మావో బాటలో నడిచిన గద్ధరన్న బుద్ధుడు, అంబేద్కర్  మార్గంలో విలువల సమాజ నిర్మాణంతో పాటు బహుజన రాజ్య స్థాపనకు కృషి చేశారని, ఆయన మార్గంలో అందరం నడవాలని విజ్ఞప్తి చేశారు.  


  ఈ కార్యక్రమంలో గద్ధరన్న కోడలు సరిత, గద్దరన్న సహచరుడు సి ఎల్ యాదగిరి, వివిధ సంఘాల నాయకులు సుంకరి భిక్షపతి, పటేల్ వనజక్క, సోమ రామమూర్తి, సాయిని నరేందర్, నున్న అప్పారావు, తాడిశెట్టి క్రాంతి కుమార్, మచ్చ దేవేందర్, బండి మొగిలి, చింతకింది కుమారస్వామి, నలిగింటి చంద్రమౌళి, సాగర్, సింగారపు అరుణ, వెంగళ్ రెడ్డి, రాంబ్రహ్మం, మన్నె బాబురావు, గాజాల గోవర్ధన్, చుంచు రాజేందర్, దూడల సాంబయ్య, కేడేల ప్రసాద్, మదుపాక ఎల్లయ్య, ఇమాన్యుల్, అశోక్, ఐతం నగేష్, గడ్డం శరత్, రాజ్ మహ్మద్, సద్గుణ, నీలిమ, తెలంగాణ కొమురయ్య, బుంగ జ్యోతి, నర్సింగరావు, నేదునూరి రాజమౌళి, డాక్టర్ ఎదులాపురం తిరుపతి, న్యాయవాదులు పులి సత్యనారాయణ, కూనూరు రంజిత్ గౌడ్, రాచకొండ ప్రవీణ్, గురిమిల్ల రాజు, కుమార్, చింత నిఖిల్ కుమార్, వెంకట్రాజం, ఎగ్గడి సుందర్ రామ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు