_ఇది ధరిత్రి ఎరుగని ప్రళయం..!

 


*_ఇది ధరిత్రి ఎరుగని ప్రళయం.

_మర్మస్థానం కాదది_ 

_మీ జన్మస్థానం.._

_మానవతకి మోక్షమిచ్చు_

_పుణ్యక్షేత్రం.._

_శిశువులుగా మీరు పుట్టి_

_పశువులుగా మారితే.._

_మానవరూపంలోనే_ 

_దానవులై పెరిగితే.._

_సభ్యతకి సంస్కృతికి_

_సమాధులే కడితే_

_కన్నులుండీ చూడలేని_ _దృతరాష్ట్రుల పాలనలో.._

_ఏమైపోతుంది సభ్యసమాజం.._

_ఏమైపోతుంది మానవధర్మం.._

_ఏమైపోతుందీ భారతదేశం..!?_

------------------------------------


ఇది అత్యంత హేయం..

చెప్పనలవికానంత నీచం..

రాక్షసులని మించిన అమానుష ప్రవర్తన..

ఆటవికులు సైతం ఒడిగట్టనంత క్రౌర్యం..!


ఎక్కడ ఉన్నాం మనం..

ఇంకెక్కడికి పోతున్నాం..

వేనవేల సంవత్సరాల నాగరికత నేర్పిన నిబద్ధత..

మానవీయ విలువలు

ఎక్కడికి పోయినట్టు..?


ఔను..ఈ ఉపోద్ఘాతమంతా

కోల్కతా ఉదంతం గురించే.

మనుషుల్లా కనిపించే కొన్ని మృగాలు..రెచ్చిపోయి 

ఒక నిస్సహాయ వైద్యురాలిపై

అత్యాచారం జరిపి..

చాలదన్నట్టు

చిత్రహింసల పాల్జేసి 

చంపేయడం..అబ్బా తలచుకుంటేనే జుగుప్స కలుగుతోంది..

ముష్కర మూక అత్యంత కర్కశంగా 

ప్రవర్తించిన తీరు..

ఛీ..మనిషిగా ఎందుకు పుట్టామా అన్నంత అసహ్యం కలిగించింది.!


ఇది భూమ్మీదనే జరిగింది.

అందునా భారతదేశంలో..

స్త్రీని దేవతాస్వరూపంగా భావించి పూజించిన 

వేదభూమిలో..

*_పురాణాల పుటలు ముడుచుకోగా.._*

*_వేదాలు నిర్వేదమైనటుల_*

జరిగిన ఈ భయంకర ఘటన

పవిత్ర భారత దేశ చరిత్రలో

నిస్సందేహంగా 

*_మాయని మచ్చ..!_*


రావణుడు రాక్షసుడైతే కావచ్చు గాక.. సీతను అపహరించిన సమయంలో గాని..ఆ తర్వాత ఏడాదిపాటు లంకలో బందీగా ఉంచినప్పుడు గాని కనీసం ఆమెను తాకనైనా తాకలేదని

రామాయణంలో చదివాం.

అంతే కాదు అశోకవనంలో ఆమెకు కావలిగా స్త్రీలనే ఉంచాడు.


యుగం మారాక ద్వాపరంలో 

పాంచాలిపై విపరీతంగా కక్ష బూనిన దుర్యోధనుడు నిండు పేరోలగంలో ఆమెను వివస్త్రను చేయతలపెట్టాడు.

ద్రౌపదిని తీసుకువచ్చి వివస్త్రను చేయమన్నాడే

గాని చెరచమని తమ్ముడు దుశ్శాసనుని ఆదేశించలేదే.


ఇది కలియుగంలో సైతం 

ఊహించలేని ఘోరకృత్యం.

*_పైశాచిక క్రీడ..పవిత్ర దేవాలయం వంటి ఆస్పత్రిలో సాగిన కరాళనృత్యం..!_*


ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు..

చేతులు ముడుచుకు కూర్చున్నాయా

చట్టాలు..

చేష్టలుడిగి ఉన్నారా పోలీసులు..

కోల్కతా అనే కాదు..

ప్రతి రోజూ..ప్రతి పూటా ఎక్కడో

ఒక దగ్గర ఇలాంటి రాక్షస క్రీడే.

నిన్ననే మరో చోట..

భర్తను చితకబాది భార్యను

మానభంగం చేసిన ఉదంతం.

నిజానికి జరుగుతున్నవి ఎక్కువే..బయటకి వచ్చేవి కొన్నే..ఆ కొన్నిటిలో ఒకటో రెండో సంచలనంగా మారి

*_నిర్భయ..దిశ_* అనే పేర్లతో చట్టాలు ఏర్పడుతున్నాయి.

అవి ఏ మూలకు..జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.

జరుగుతున్న ఉదంతాలన్నీ

ప్రభుత్వాల వైఫల్యం.

అటు కేంద్రప్రభుత్వం..

ఇటు బెంగాల్ ప్రభుత్వం

ఈ సంఘటనలకు ఖచ్చితంగా బాధ్యత వహించాలి.

భారత ఇతిహాసమే 

పరిహాసమయ్యేంత దారుణ సంఘటనలు ఇవి..!


ఇవి ఎవరి వైఫల్యాలు..

ముమ్మాటికీ చట్టాలే..

సూటిగా చెప్పాలంటే

ఆ చట్టాలు చేసే పెద్దలే.

ఎన్ని చట్టాలున్నా శిక్షలు పడేది 

ఎప్పుడో..పసలేని ఈ చట్టాల్లోని లొసుగులే బాసటగా ముష్కరులు

చెలరేగిపోతున్నారు. 

ఇటువంటి అమానవీయ దుష్కార్యాలకు పాలకులు

ఏమని బదులు చెబుతారు.

ఇంత జరిగినా

ఇప్పుడు కూడా ఇటు 

రాష్ట్ర సర్కార్ గాని..

అటు కేంద్రప్రభుత్వం గాని అంత పటిష్టంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం లేదు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని 

ఏంటి నమ్మకం..

అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు.ఎవరు రాజీనామా చేస్తారు.


ఇప్పుడిక ఏముంది..ముందు విచారం..ఆనక విచారణ..

కేసులు..తిరకాసులు..

కోర్టులు..అక్కడ ఎడతెగని జాప్యాలు..ఈలోగా యుగమే మారిపోతుంది.!


ఈ గొప్ప దేశంలో..

ఎక్కడో ఒక దగ్గర..

ఎప్పుడో ఒకప్పుడు అచ్చంగా ఇలాగే కాకపోయినా

ఇలాంటి దుస్సంఘటనలు

జరుగుతూనే ఉన్నాయి..

ప్రాణానికి..మానానికి

నిస్సిగ్గుగా ఖరీదు కట్టి నగదు రూపంలో చెల్లించే షరాబులున్నంత కాలం

ఏదీ ఆగదు..ఎవ్వరూ ఆగరు.

జనం మర్చిపోతారు..

ఇంకో సంఘటన జరిగే దాకా ప్రభుత్వాలు పట్టించుకోవు..!


_*రేపు మరో రేపు..*_

అంతేగా..

విచారం వ్యక్తం చేయడం..

పరిహారం చెల్లించడం..

సిగ్గులేని ముఖాలపై

దిక్కుమాలిన  నవ్వులు

పులుముకుని విజయగర్వంతో విరగబడి తిరగడం...

ఇదే పాలకుల నీతి..నిరతి..!


ఛీ..ఛీ..ఛీ..ఛీ..

చూసి చూసి అసహ్యం..

రాసి రాసి చిరాకు వేస్తోంది...

మారని వ్యవస్థ..

తీరని దురవస్థ..!


        *_సురేష్..జర్నలిస్ట్_*

             9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు