గిరిగీసి గిరిజనం..!


 

*_గిరిగీసి గిరిజనం..!_*


_ఆదివాసి దినోత్సవం_


కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..

మహాపురుషులౌతారు..

తరతరాలకు తరగని వెలుగవుతారు..

ఇలవేలుపులౌతారు..!?


ఏనాటి మాట..

వాల్మీకి..ఏకలవ్యుడు..శబరి..

మరి ఇప్పటి గిరిజనులు..

ఎప్పటి వోలె అదే జీవనం..

నాగరికతకు దూరంగా..

బ్రతుకు భారంగా..!


హరిజనులు..గిరిజనులు..

అందరు నేడు పురజనులే..

నిజమా..కనిపించని దృశ్యమా..అపహాస్యమా..!


స్వర్ణోత్సవ స్వరాజ్యభారతం..

ఏమున్నది గర్వకారణం..

సర్వహరణం..

గిరిజనుల పేర ఖర్చయ్యే 

కోట్ల రూపాయలు

పెద్దోడి కంఠాభరణం..!


కొండకోనల్లో 

కనిపించని వెలుగు..

నువ్వూ నేనూ చూసి మురిసే

ప్రకృతి అందాల నడుమ

నికృష్ట జీవనాలు..

వికృత కథనాలు..

*_చుట్టూ పూల తావి.._*

*_చదువు అందని మావి.._*

వనరులన్నీ బడాబాబుల

నైవేద్యం..

ప్రాణాలు పోయేవేళ

అందుబాటులో 

ఉండని వైద్యం..

మంచినీరు..రహదారులు

కోట్లు వ్యయమవుతున్నా

చక్కబడని బ్రతుకుదారులు..

*_పచ్చని ఎడారులు..!_*


అదిగో..పురిటినొప్పులు

పడుతున్న గిరిపుత్రిక..

లెన్సు పెట్టి చూసినా కనిపించని ఆంబులెన్సు..

బిడ్డ అడ్డం తిరిగితే..

నాటు వైద్యం చేయి దాటి

పట్నం పోదమంటే

డోలీ దిక్కు..

అది చేరేపాటికి

పేనం నిలిచేనా..

బిడ్డ దక్కేనా..!


కష్టమెంత పడినా

ఇప్పటికీ తప్పని పస్తు..

అదే అదే గిరిసీమల వాస్తు..

పేరుకే శ్రీరస్తు..శుభమస్తు..

బతుకులింతే 

అన్నదేమో తథాస్తు..

పాలకులు అస్తుఅస్తు..!


గిరిజనుల థింసా..

అడుగు కలిపే 

నేతలు హైలేసా..

చేతికి అందని పైసా..

మంది సొమ్ముతో 

నాయకుల జల్సా..!


*_మొత్తంగా ఆదివాసి.._*

*_సమస్యల సహవాసి.._*

*_నిత్య వనవాసి..!_*


_సురేష్..9948546286_

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు