రైతు భరోసాపై విస్తృతంగా ప్రజాభిప్రాయం - అసెంబ్లీలో చర్చ- ఆతర్వాతే నిర్ణయం - ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

 


హనుమకొండ,జులై 15,2024: రైతు భరోసా పథకాన్ని అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలను నిర్వహించి  రైతుల అభిప్రాయాల మేరకు శాసనసభ సమావేశాల్లో చర్చించిన అంశాలను తీర్మానం చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.


సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో రైతు భరోసా పథక విధివిధానాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి  విస్తృత సమావేశం నిర్వహించగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉప సంఘం ఛైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు,  రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రు నాయక్, పలువురు ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు.



వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎన్నికలకు ముందు  హామీలను  ప్రకటించామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హామీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ లో నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ రైతులకు పలు గ్యారెంటీలను ప్రకటించారని అన్నారు. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చర్యలు మొదలుపెట్టామని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్  హామీని అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళను అందించనున్నట్లు పేర్కొన్నారు.  సాగు కోసం రైతులకు ఒక దఫా పంట సాయాన్ని  చెల్లించామని తెలిపారు. రాష్ట్రంలోని రైతులందరి అభిప్రాయాల మేరకు ప్రజా ప్రభుత్వం రైతు భరోసా పై నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేబినెట్ సబ్ కమిటీ రైతుల అభిప్రాయాలను రాష్ట్రవ్యాప్తంగా తీసుకుంటుందని, రైతుల అభిప్రాయాల మేరకు శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో చర్చించి రైతు భరోసా కోసం  తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. రైతులకు పంట సాయం కోసం ప్రభుత్వం అందించే ప్రతి పైసా ఎక్కడ కూడా  దుర్వినియోగం కాకూడదనే  రైతులు, రైతు సంఘాలు, ప్రజా ప్రతినిధులు అభిప్రాయాలను ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కట్టే పన్ను లతో ప్రజల సంక్షేమం కోసం పథకాలను అందిస్తున్నామని అన్నారు.  రైతు భరోసా విషయంలో ప్రజల అభిప్రాయమే జీవోగా రాబోతుందన్నారు. సంపూర్ణంగా ప్రజలు ఏమి చెబితే  దాన్నే అమలు చేస్తామన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని.. ప్రజల ఆలోచనల మేరకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా  రైతు భరోసా విషయంలో సమావేశాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశాల్లో ప్రతి రైతు చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకొని వాటిపై చర్చిస్తామన్నారు.  



రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల  నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఆరు నెలల క్రితం  తమ ప్రభుత్వం ఏర్పడిందని, తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాలని  సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సూచనల మేరకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ  ఆగస్టులో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం విధివిధానాల రూపకల్పన జరుగుతుందన్నారు. రైతుల ఖాతాల్లో  7562 కోట్ల రూపాయలను  ప్రభుత్వం జమ చేసిందన్నారు. రైతుబంధు లో జరిగిన  అనేక అవకతవకలు రైతు భరోసా విషయంలో జరగకూడదనే ఉద్దేశంతోనే  రైతుల అభిప్రాయాలను తీసుకొనేందుకు సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాన్య రైతులు, చిన్న, సన్న కారు  రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుందనే సమావేశాల్లో అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో  పంట నష్టం జరిగితే ఎలాంటి పరిహారం  రాకపోయేదని అన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంట నష్టపోతే బీమా ఇవ్వాలనే  నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. 



రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పేదోడి రాజ్యం రావాలని, మంచి ప్రభుత్వం కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని, అందుకు తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని  పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడే నాటికే 7 లక్షల కోట్ల అప్పు భారం తమకు అప్పగించారని అన్నారు.  రైతును రాజు చేసే కార్యక్రమాలను తమ ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రైతులను, నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం  ప్రధాన ప్రతిపక్షం చేస్తుందన్నారు. ఇన్కమ్ టాక్స్,  పాన్ కార్డ్  ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వరని చేస్తున్న  దుష్ప్రచారం సరికాదన్నారు. రైతులకు సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం వెనకడుగు వేయదని, రైతుల నిర్ణయాలే ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలుగా పరిగణిస్తామన్నారు. 



రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో అందించిన పథకంలో లోపాలు ఉన్నాయన్నారు. నిజమైన రైతులకు, కష్టపడే రైతులకు రైతుబంధుతో  అన్యాయం జరుగుతుందన్నారు. పేరుకే పెట్టుబడి పథకం అయినా నిజమైన రైతులకు అందలేదన్నారు.  అసలైన రైతులకు రైతు భరోసా అందించాలని  తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతు భరోసా విషయంలో రైతుల అభిప్రాయం అనేది ఎంతో ముఖ్యమన్నారు. అందుకే జిల్లాల వారీగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి రైతుల అభిప్రాయాలను తీసుకొని  ఒక మంచి నిర్ణయంతో మంచి పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు.  క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవంగా వ్యవసాయం చేసే రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

 పేద రైతులకు న్యాయం జరిగేలాకృషి చేస్తామన్నారు.



రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చిత్తశుద్ధితో అర్హులైన రైతులకు రైతు భరోసాను ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కి రైతుబంధు విషయంలో కటాఫ్ పెట్టుకోవాలని తాను చెప్పానని, తాను చెప్పిన విషయాన్ని వినకపోగా మిగిలిన 20% మంది రైతులకు కూడా రైతుబంధు వర్తింపజేయడంతో ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నారు. ఇందిరా గాంధీ  నిరుపేదలకు అందించిన భూములను ధరణి పోర్టల్ రాకతో అన్యాయం జరిగిందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణతోనే న్యాయం జరుగుతుందని, నాలుగు గోడల మధ్య జరగదని ప్రజల హర్షించే విధంగా రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందని అన్నారు. పంటలకు బీమా ఎలా చేస్తున్నామో  అదేవిధంగా  పశువులకు కూడా  బీమాను వర్తింప చేస్తే బాగుంటుందన్నారు. గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు  మేలు చేసేందుకు రైతు భరోసా పథకాన్ని తీసుకువస్తున్నారన్నారు. ప్రజలు హర్షించే విధంగా రైతు భరోసా ఉండబోతుందన్నారు. 



 రైతు భరోసా ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలువురు రైతులు, యువ రైతులు, ప్రొఫెసర్లు, వైద్యులు రైతు భరోసా కు సంబంధించి పలు సూచనలు చేశారు. 


   అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  పాత్రికేయులతో మాట్లాడుతూ.. రైతుల అభిప్రాయాల మేరకు  శాసనసభలో రైతు భరోసా పథకం రూపకల్పనకు చర్చిస్తామన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉపాధి హామీ పథకం కూలి నుండి ప్రజలందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా వస్తున్న పన్నులను  ప్రతి రూపాయిని ఆదా చేసి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. అందుకు ఉప సంఘంతో  అన్ని  జిల్లాల్లో పర్యటిస్తున్నామని, కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమక్షంలో ప్రజల అభిప్రాయాలనే ప్రభుత్వ ఉత్తర్వులుగా చారిత్రాత్మక నిర్ణయంగా తీసుకురావడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. 



ఈ సమావేశంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య,  ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు,  కె ఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, డాక్టర్ మురళి నాయక్, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ఆయిల్ సీడ్స్ అండ్ గ్రోవర్స్  ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని  రవీందర్ రావు, కుడా చైర్మన్  ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, రిజ్వాన్ భాషా షేక్, అద్వైత్ కుమార్ సింగ్, రాహుల్ శర్మ, దివాకర, ఉమ్మడి జిల్లా రైతులు రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు