ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధ్యయనం
ఇతర రాష్ట్రాలకు బృందాలు
ఇందిరమ్మ ఇండ్లకు సోలార్ తప్పనిసరి
ఆవుటర్, రిజీనల్ రింగ్ రోడ్డు మధ్యన ఇండ్ల నిర్మాణంపై హౌజింగ్ శాఖ దృష్టి సారించాలి
హౌజింగ్, రెవెన్యూ, ఐఅండ్‌పీఆర్ అధికారుల సమీక్షలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క
బడ్జెట్ సమీక్ష సమావేశానికి హాజరైన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి అధ్యయనం చేయించి త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క హౌజింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి ఈ ఏడు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్ల చొప్పున బడ్జెట్‌లో నిధులు కేటాయించిందన్నారు. ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారంటీల అమలులో భాగమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమన్నారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి హౌజింగ్, రెవెన్యూ, ఐ అండ్ పిఆర్ శాఖల అధికారులతో బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించారు. ఇతర రాష్ట్రాల్లో పేదలకు అక్కడి ప్రభుత్వాలు నిర్మిస్తున్న ఇండ్ల నమూనాలు, లబ్ధిదారుల ఎంపిక విధానం గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని సూచించారు. కాలుష్యం లేనటువంటి గ్రీన్ ఎనర్జీని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున ఇందిరమ్మ ఇండ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఇండ్ల నిర్మాణ సమయంలో కచ్చితంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. రాష్ట్ర రాజధాని హైదరబాద్ మహానగరం శర వేగంగా అభివృద్ది చెందుతున్న నేపత్యంలో ఆవుటర్, రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ ఇండ్ల నిర్మాణంపై హౌజింగ్ శాఖ దృష్టి సారించాలన్నారు. మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయాల్సిన బాధ్యత హౌజింగ్ శాఖపై ఉందని గుర్తు చేశారు. ఎస్ ఆర్ నగర్, బర్కత్‌పుర, కూకట్‌పల్లి, ఈసిఐఎల్ లాంటి ప్రాంతాల్లో హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి పేరిట ఇండ్ల నిర్మాణాలు చేయడం వల్ల ఎంతో మంది మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. అవుటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యన హౌజింగ్ బోర్డు ఇండ్ల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ నుంచి భూమిని సేకరించుకోవాలని సూచించారు. ఇండ్ల నిర్మాణం చేయడానికి అనువైన ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఇండ్లు నిర్మాణం చేయడానికి కావాల్సిన భూమి కొరకు హౌజింగ్ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. రాష్ట్రంలో చేపట్టబోయే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం హౌజింగ్ శాఖ అధికారులు మూడు బృందాలుగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నట్టు అధికారులు డిప్యూటి సీఎంకు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై, కర్ణాటకలో బెంగళూర్, మహారాష్ట్రలో ముంబాయి నగరాలకు హౌజింగ్ శాఖ అధికారులు వెళ్లి ఇండ్ల నిర్మాణం, లబ్ధిదారులు ఎంపిక, లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హత తదితర విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేసి వచ్చిన తరువాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని డిప్యూటి సీఎంకు తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల గురించి ఆరా తీశారు. ఇప్పటి వరకు నిర్మాణమైన ఇండ్లు, ఇంక పూర్తి కావాల్సిన ఇండ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసి పరిధిలో గత ప్రభుత్వం లక్ష ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకొని 69 వేల ఇండ్లను మాత్రమే పూర్తి చేసి 65 వేల ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిందని అధికారులు వివరించారు. మిగత ఇండ్ల నిర్మాణం ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల గురించి ఆరా తీశారు. డిజిటల్ భూ సర్వే చేయడానికి నిధులను ఇవ్వాలని అధికారులు డిప్యూటి సీఎంను కోరారు. సంపద సృష్టించి ఆ సంపదను ఈ రాష్ట్ర ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం లక్ష్యమని, ఈ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు ప్రత్యామ్నాయ వనరులను సమీకరించడంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరి రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరి సందీప్ సుల్తానియా, నవీన్ మిట్టల్, తదితరులు పాల్గొన్నారు.
---
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box