నాసిరకం వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు
ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో నిరంతర తనిఖీలు
మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి సీతక్క
కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యత లేని గుడ్లు పంపిణీ కావడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సీరియస్ అయ్యారు. పలు అంగన్వాడీ కేంద్రాల్లో నాసి రకం వస్తువులు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడి కేంద్రాల్లో నాణ్యతలేని గుడ్లను పంపిణీ చేస్తే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అంగన్వాడి సెంటర్లలో నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో సోమవారం నాడు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల పనితీరును మంత్రి సీతక్క సమీక్షించారు. అంగన్వాడి సెంటర్లకు కాంట్రాక్టర్లు నాసిరకం గుడ్లు, వస్తువులు సరఫరా చేస్తే, వాటిని అంగన్వాడీ కేంద్రాలు తిరస్కరించి ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు. అలా చేయని పక్షంలో సంబంధిత అంగన్వాడీ టీచర్లు, స్థానిక సిబ్బందిని బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అంగన్వాడీల్లో అందుతున్న వస్తువుల నాణ్యత పై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులకు సూచించారు. నాసిరకం వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడి లకు సరఫరా చేసే సరుకుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కోవాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో వస్తువుల దిగుమతి సమయంలో బయోమెట్రిక్ విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వస్తువుల సరఫరా చేసే కాంట్రాక్టులను గత ప్రభుత్వం రెండేళ్లకు పొడిగించడం వల్ల కొందరు కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మంత్రి తెలిపారు. అందుకే కాంట్రాక్టుల గడువును తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు. అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న వస్తువుల క్వాలిటీ ని చెక్ చేసేందుకు జిల్లాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాల్లో అందుతున్న సేవలపై థర్డ్ పార్టీతో అధ్యయనం చేయించి లోపాలుంటే సవరిస్తామన్నారు మంత్రి సీతక్క. అంగన్వాడీ కేంద్రాలకు వస్తువులు సరఫరా చేసే టెండర్ల నిబంధనలను మరింత కఠినతరం చేస్తామన్నారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకతను పెంచే దిశలో మరికొన్ని ప్రభుత్వ శాఖల సహకారం తీసుకుంటామన్నారు. అంగన్వాడిలో బోజన నాణ్యతపై రాజీ పడేది లేదన్నారు మంత్రి సీతక్క. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క తో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, మహిళా సంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీతోపాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సెర్ప్ పై సీతక్క సమీక్ష
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పై మంత్రి సీతక్క సచివాలయంలో సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ తో పాటు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొనగా...సెర్ప్ ద్వారా ప్రస్తుతం అమలవుతున్న పథకాల తీరు, బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రి సీతక్క అడిగి తెలుసుకున్నారు. అయితే గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా వరకు కేంద్ర నిధులను సరిగా వాడుకోలేక పోయామని అధికారులు సీతక్క దృష్టికి తీసుకువచ్చారు. వివిధ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాబట్టుకోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో పథకాల వారీగా పెండింగ్ మ్యాచింగ్ గ్రాంట్ల వివరాల జాబితాను సమర్పించాలని అధికారులకు సీతక్క ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలా కాకుండా, తమ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ కోసం అవసరం అయిన నిధులను కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు మంత్రి సీతక్క. కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సామాజిక పెన్షన్ల కోసం గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన దరఖాస్తులు, తమ ప్రభుత్వానికి అందిన దరఖాస్తులపై మంత్రి ఆరా తీశారు. అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన దిశలో గత ప్రభుత్వం పక్కన పెట్టిన పథకాలను తిరిగి ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అభయ హస్తం వంటి పథకాలను అమలు చేయకుండా వందల కోట్ల రూపాయల మహిళల పొదుపు సొమ్మును గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. పక్కదారి పట్టిన నిధుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన దిశలో మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో మహిళా శక్తికి అవసరమైన నిధులు కేటాయిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
......
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box