*_నా దేశం నమోనమామి.._*
*_నా సైనికుడు శరణం గచ్చామి..!_*
_కార్గిల్ దివస్ సందర్భంగా_
*_(ఎలిశెట్టి సురేష్ కుమార్)_*
9948546286
నిప్పులు చెరిగే ఎండలో..
ఎముకలు కొరికే చలిలో
నిన్నూ నన్నూ కాచేది..
దేశాన్ని కాపాడేది..
ఎవడురా..
*_వాడు భారత సైనికుడు..!_*
బుల్లెట్టు తగిలినా బల్లెట్టులా దూసుకు వెళ్లి శత్రు శిబిరంలో
దడ పుట్టించేది
ఎవడురా..
*_వాడు భారత సైనికుడు..!_*
నా ఉద్యోగం..
నా సద్యోగం..
నా యోగం..
నా యాగం..
ఇది నా యుగం..
అని గర్వంగా చెప్పుకునేది ఎవడురా..
*_వాడు భారత సైనికుడు..!_*
యుద్ధభూమి మరుభూమి..
ఏదైనా ఒకటేరా..
నా దేశం కోసం
అసువులు బాసినప్పుడు..
చివరి శ్వాస వరకు
అదే పోరాటం..
మాతృ భూమి రక్షణ కోసమే
ఆరాటం..
ఇలా తెగింపుగా చాటే వీరుడు ఎవడురా..
*_వాడు భారత సైనికుడు..!_*
మరణంలోనూ మోముపై
చెరగని నవ్వు..
చెదరని రోషం..
బుసలు కొట్టే పౌరుషం..
చేతిలో గన్ను..చూపని వెన్ను
ఇవన్నీ చాటేది
ఎవడురా..
*_వాడు భారత సైనికుడు..!_*
ఇప్పుడు కన్ను మూసినా
మళ్లీ ఇలాగే పుట్టాలని..
మరోసారి ఇదే రీతిన
చనిపోవాలని..
నరనరానా కోరుకునే వాడు
ఎవడురా..
*_వాడు భారత సైనికుడు..!_*
🫡🫡🫡🫡🫡🫡🫡🫡
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box