అప్పుడలా....ఇప్పుడిలా..-నిధులు వరదలా..!



 


 *_అప్పుడలా....ఇప్పుడిలా.._*

*_నిధులు వరదలా..!_*


_కేంద్రం కేటాయింపులతో_

_నవ్యాంధ్రకు నవశకం.._


  (*_సురేష్ కుమార్ ఇ..జర్నలిస్ట్_*)

         9948546286 


✍️✍️✍️✍️✍️✍️✍️


ఔను..

కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ మొత్తంలో

15000 కోట్ల రూపాయలు

కేటాయించడం గొప్ప వార్తే.

రాష్ట్ర ప్రజలకు అది నిజంగా శుభవార్తే..ఈ మొత్తం కేవలం రాజధానిగా అమరావతిని

అభివృద్ధి చెయ్యడానికే అన్న విషయాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.


ఒక రకంగా చెప్పాలంటే

ఇంత భారీ కేటాయింపు జరగడం ఇంచుమించు

ప్రత్యేక హోదా..స్పెషల్ ప్యాకేజీకి తీసిపోయింది ఏమీ కాదు.


ఇన్నాళ్లు ఇలా ఎందుకు జరగలేదు.నిజానికి 2014 ఎన్నికలకు ముందు ఉమ్మడి 

ఆంధ్రప్రదేశ్ విడిపోయి నవ్యాంధ్ర ఆవిర్భావం తర్వాత

ఏర్పడిన ప్రభుత్వంలో బిజెపి కూడా అంతర్భాగమే.అలాగే అదే సంవత్సరం కేంద్రంలో అధికారం చేపట్టిన ఎన్డీయే కూటమి సర్కారులో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉంది.

నిజానికి అప్పట్లో హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా వాడుకోడానికి పదేళ్ల వరకు సమయం ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ చూపించి అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా ఎంపిక చేసారు.ఆనాడు అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని తెచ్చి అమరావతి మట్టిలో కలిపారు.

కారణాలు ఏవైనా ఈరోజు వరకు బిజెపి సర్కారు నుంచి

ఆంధ్రకు గాని..అమరావతికి గాని ఆ మట్టే మిగిలింది.

కేంద్రంలోని బిజెపి సర్కార్ ఇతరత్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి

చెయ్యి పెద్దగా విదిల్చింది లేదు.

మిత్రపక్షం అధికారంలో ఉన్నా గాని..మొండి చెయ్యే..!


ఆ రోజుల్లో చంద్రబాబు మీద నమ్మకం లేకనో..ఆయన కీర్తి తనను మించి పెరగకూడదనో

మొత్తానికి ప్రధాని మోడీ 

బాబుని..ఆంధ్రప్రదేశ్ ను అక్కడే ఆపేసారు.మరి ఇప్పుడు ఎందుకు అంత ఇస్తున్నారనా..అది కూడా

తర్వాత పేరాలలో చర్చిద్దాం.


మొత్తానికి 2014..19 మధ్య కాలంలో బిజెపి..టిడిపి చెలిమి..మైత్రి..భాగస్వామ్యం..

అవగాహన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదు.


అటు తర్వాత మొదలైంది జగన్ శకం..జగన్ హయాంలో బిజెపి ఆంధ్ర రాష్ట్రాన్ని..

ప్రత్యేకంగా రాజధానిని పట్టించుకోలేదు..ఎందుకంటే

అసలు రాజధాని విషయంలో

జగన్ కే క్లారిటీ లేదు..జనానికి స్పష్టత ఇవ్వలేదు.అయిదేళ్ళూ 

అయోమయమే..మూడు రాజధానుల నినాదం..అది నినాదమో.. ఉన్మాదమో..

కప్పగంతో..కుప్పి గంతో...

ఓటు రాజకీయమో..మొత్తానికి

అంతా ఎవరికీ అంతుబట్టని నాటకీయం..!


జగన్ అవలంబించిన ఈ వైఖరి

బిజెపికి చులకనగా అనిపించింది.ఫలితం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవడం మానేసింది.

నిధులు ఇవ్వాల్సిన అవసరం తప్పిపోయింది.మీకే లేని బాధ మాకేంటని మోడీ సర్కార్ మిన్నకుంది.


ఇన్నాళ్లు మన డిమాండ్ ప్రత్యేక హోదా..లేదా ప్యాకేజీ..

బిజెపి వాటిని లెక్క చెయ్యలేదు.నిజానికి అవి విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు..

అందుకే బిజెపి పట్టించుకోలేదు..కారణం ఏదైనా..తప్పు ఎవరిదైనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిరాశ తప్పలేదు.


అప్పుడు బాబు గాని..

తర్వాత జగన్ గాని..

ఎంతసేపు మోడీ ముందు మోకరిల్లడమే గాని

ఆంధ్రకు రావాల్సింది గట్టిగా అడిగిన పాపాన పోలేదు.

మన పెద్ద నేతలు ఇద్దరిదీ..

ఒక్కొక్కరిది ఒక్కో రకం బలహీనత.!..


ఇప్పుడు ఇందాక ప్రస్తావించిన అంశం..ఇప్పుడు ఎందుకు ఇంత ఇస్తున్నారని..

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది.

ఇప్పుడు అధికార పార్టీకి బిజెపి 

2014 మాదిరి కేవలం మిత్రపక్షంగా మాత్రమే లేదు.

నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీయే నేతృత్వంలోని సర్కార్.అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వం. అంతే కాక మునుపటి కంటే ఇప్పుడు బిజెపికి రాష్ట్రంలో బలం ఉంది.

దాన్ని మరింతగా పెంచుకోవాలనే ఆలోచన బిజెపికి ఎటూ ఉండనే ఉంటుంది.మా సహకారంతోనే ఆంధ్రలో తెలుగుదేశం సాధించిందనే ముద్ర..

రేపు ఎటు పోయి ఏం జరిగినా మేము లేకపోతే మళ్ళీ కథ మొదటికే అనే సూచన..

మేముంటేనే అన్నీ అనే సంకేతం..బిజెపి కత్తికి అన్ని వైపులా పదునే..


ఏది ఏమైతేనేం...

బిజెపికి కలిసి వచ్చింది..

రాష్ట్రానికి కలిమి ప్రాప్తించింది..

తెలుగుదేశానికి..అధినేత

చంద్రబాబుకి తాజాగా

పవన్ కళ్యాణ్ రూపంలో

ఎన్డీయే అచ్చొచ్చింది.


రాష్ట్రానికి సొమ్ములు

వచ్చాయి..

అమరావతితో పాటు అక్కడి రైతులకు సంతోషం వచ్చింది.!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు