పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించటమే తమ ప్రభుత్వం ఎంచుకున్న మొదటి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజల ప్రయోజనాలను అర్థం చేసుకొని పని చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు.
సచివాలయంలో మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాద్యక్షుడు చిన్నారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సదస్సును ప్రారంభించగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభోపన్యాసం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జిల్లా కలెక్టర్లతో ఇది రెండో సమావేశమని, ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరేనని సీఎం గుర్తు చేశారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి వారధులు.. సారధులు మీరేనని అన్నారు. ఇటీవలే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమర్థులైన యువ కలెక్టర్లను నియమించామని, రాజకీయ ఒత్తిళ్లు, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా కలెక్టర్ల బదిలీలు చేపట్టామన్నారు.
ఐఏఎస్ అధికారుల కెరీర్లో జిల్లా కలెక్టర్లుగా పని చేయటమే అత్యంత కీలకమైన అవకాశమని సీఎం అన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే బాధ్యతలతో పాటు క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలపై అవగాహన వస్తుందని, జిల్లాల్లో పని చేసిన అనుభవమే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను చివరి లబ్ధిదారుల వరకు చేరవేసే కీలక బాధ్యత కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కలెక్టర్లు ఏ జిల్లాలో పని చేసినా.. అక్కడి జిల్లా ప్రజల మదిలో చెరగని ముద్ర వేయాలని, తాము పని చేసే ప్రాంత ప్రజలందరి అభిమానాన్ని అందుకునేలా పని చేయాలని సీఎం అన్నారు. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం టీచర్లకు ప్రమోషన్లతో పాటు బదిలీలు చేసిందని, కొన్నిచోట్ల టీచర్లు బదిలీపై వెళుతుంటే విద్యార్థులు సొంత కుటుంబసభ్యుడిలా స్పందించారు. వాళ్లకు అడ్డుపడి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు మీడియాలో చూసినట్లు సీఎం చెప్పారు. జిల్లాల్లో కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితీరు ఉండాలని అభిప్రాయపడ్డారు. అక్కడి ప్రజలు కలెక్టర్ ను బదిలీ చేయకుండా అడ్డుకునేంత అనుబంధాన్నిసంపాదించుకోవాలని ఉదాహరణగా చెప్పారు.
వివిధ రాష్ట్రాల నుంచి వివిధ సంస్కృతుల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులు తెలంగాణలో పని చేస్తున్నారని, విధి నిర్వహణలో భాగంగా ఇక్కడి భాష నేర్చుకుంటే సరిపోదని, భాషతో పాటు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం కావాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి పని చేయాలని, ఇక్కడి ప్రజలతో మమేకం కావాలని, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా ఐఏఎస్లు పని చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని.. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే ఎలాంటి సంతృప్తి ఉండదని అన్నారు. తాము చేపట్టే ప్రతి పని.. ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు.
జిల్లా కలెక్టర్లు అందరూ క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాఠశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రుల ద్వారా ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి పేద విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి నెలా రూ.85వేలు ఖర్చు పెడుతుందని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు పిల్లల భవిష్యత్తును నిర్దేశించే విద్యా వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీలకు వెళ్లినప్పుడు ప్రజలతో మాట్లాడాలని, అక్కడికక్కడ పరిష్కారమయ్యే చిన్న చిన్న పనులను వెంటనే పరిష్కరించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.
’గతంలో పది పెద్ద జిల్లాలుండేవి. అప్పడు పది మంది కలెక్టర్లే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపించారు. అప్పటితే పోలిస్తే ఇప్పుడు జిల్లాల పరిధి, జనాభా తగ్గిపోయింది. అప్పటితో పోలిస్తే కలెక్టర్ల అధికారాలు, బాధ్యతల్లో తేడా ఏమీ లేదు. అప్పుడు పది మంది చేసిన పనిని ఇప్పుడు 33 మంది కలెక్టర్లు కలిసికట్టుగా ఎందుకు చేయలేరు..? ఎవరికివారుగా మీ ఆలోచనలు, మీ పనితీరును సమర్థతను చాటుకోవాలి. ఇది ప్రజా ప్రభుత్వం. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలతో ప్రజలకు విశ్వాసం కల్పించే బాధ్యత మీదే...’ అని సీఎం కలెక్టర్లకు మార్గదర్శనం చేశారు.
కలెక్టరేట్లలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సమస్యలు పరిష్కారమైతే, హైదరాబాద్లో ప్రజాభవన్ కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గిపోతుందని, అదే మీ పనితీరుకు అద్దం పడుతుందని సీఎం అన్నారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు.
ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలను రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని సీఎం పునరుద్ఘాటించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని గృహ జ్యోతి, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకాలకు అర్హులెవరికైనా ఈ పథకం వర్తించకపోతే.. తమ ఆధార్, రేషన్ కార్డు, లేదా గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్తు సర్వీసు నెంబర్లు సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు పని చేసేలా చూడాలని, అవసరమైతే ప్రజావాణి జరిగే రోజున కలెక్టరేట్లలోనూ సేవాకేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటివరకు గృహజ్యోతికి 5.89 లక్షల మంది, అయిదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకానికి 3.32 లక్షల మంది సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వివరించారు.
పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ‘ధరణి సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి మార్చి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇప్పటికే ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1,61,760 దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించిందని, కొత్తగా 1,15,308 దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వివరించారు. ధరణిలో దరఖాస్తులను తిరస్కరిస్తే అధికారులు తిరస్కరణకు కారణాన్నికూడా తప్పకుండా నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 15లోగా పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని గడువు నిర్ణయించారు.
మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులున్నారని, కోటి మందిని సభ్యులుగా చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీరిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం ప్రకటించారు. అయిదేండ్లలో రూ. లక్ష కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పని చేయాలన్నారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు, చేపట్టే వ్యాపారాలకు తమ వినూత్న ఆలోచనలు కూడా జోడించాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూములు, చెర్వులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సీఎం కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అవసరమైతే జియో ట్యాగింగ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసి.. ప్రభుత్వ భూములపై నిఘా ఉంచాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని ఆదేశించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వైద్య సేవలందించే ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందని, అధ్యయనం చేసి అందుకు సంబందించిన ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. రూరల్ ఏరియాలో పనిచేసే డాక్టర్లకు పారితోషికం అందించి ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ ఉండాలని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చెప్పారు. స్థానికంగా స్వచ్ఛంద సంస్థల సహకారం, పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులు తీసుకోవాలని, వ్యాపార వాణిజ్యవేత్తల భాగస్వామ్యం తీసుకొని వాటి నిర్వహణ మెరుగుపరిచే విధానాన్ని అవలంబించాలని సూచించారు. అనుభవజ్ఞులైన స్పెషాలిటీ డాక్టర్లను ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి వైద్య సేవలకు వినియోగించుకోవాలని, మిగతా డాక్టర్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు.
రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ..
రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ..
భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ...
కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన.
కలెక్టర్ల సదస్సులో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ...
18 సాయంత్రం లోగా రైతుల రుణఖాతాల్లో జమ కానున్న డబ్బులు....
అదే రోజు రైతు వేదిక ల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు...
హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు,ప్రజాప్రతినిధులు...
రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు...
రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు...
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box