వారానికో రోజు క్షేత్ర స్థాయి పర్యటన -నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష - సీఎం రేవంత్ రెడ్డి

 జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక 

కొందరు కలెక్టర్లు గడప డాటడం లేదంటూ చురకలు 


వినూత్నంగా ఆలోచించండి

* ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

* తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

* వారానికో రోజు క్షేత్ర స్థాయి పర్యటన

* నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష

* ఐఏఎస్ అధికారులకు సీఎం దిశానిర్దేశం

త్వరలోనే సీఎం జిల్లాల పర్యటనలు


ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐఏఎస్ అధికారులందరూ విధిగా తమ పరిధిలోని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా పాలనను అందించేందుకు అందరూ బాధ్యతగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. అందరూ కలిసికట్టుగా పని చేసి ప్రజలకు సుపరిపాలనను అందించి తీరాలని చెప్పారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు. తమ శాఖల పని తీరును మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రక్షాళన చేసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్ షిప్ ఐడియాను రెండు వారాల్లో  ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. 


ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు  పలువురు ముఖ్యమంత్రులతో పని చేసిన అనుభవమున్న అధికారులు ఇప్పటికీ కీలక విభాగాల్లో ఉన్నారని, ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వ ప్రాధాన్యాతలను గుర్తించి అధికారులు తమ పనితీరును చాటుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలనే సంకల్పంతో విధులు నిర్వహించాలని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని కోరారు.


సచివాలయంలో మంగళవారం అన్ని విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమావేమయ్యారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమీక్షలో పాల్గొన్నారు. మొత్తం 29 విభాగాలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అధికారులందరూ ఏకతాటిపై పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ తమ విభాగాలపై పట్టు సాధించాలని చెప్పారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో అయిదు గ్యారంటీలను అమలు చేసిందని సీఎం చెప్పారు. తర్వాత వంద రోజులు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయని, ఇకపై అధికారులు విధిగా పరిపాలనపైనే దృష్టి సారించాలని ఆదేశించారు. 


దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు. తమ శాఖల పని తీరును మెరుగుపరిచేందుకు అవసరమైతే అధికారులు, సిబ్బంది ప్రక్షాళన చేసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలను ఎప్పటికప్పుడు నేరుగా సీఎంవోతో పంచుకోవాలని సూచించారు. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్ షిప్ ఐడియాను రెండు వారాల్లో  ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. 


ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు అధికారులు క్రమశిక్షణ పాటించాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి ప్రజా ప్రయోజనాలకు ప్రాదాన్యమివ్వాలని సీఎం చెప్పారు. వేళాపాళలను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి రోజు టైమ్ ప్రకారం సెక్రేటేరియట్లో అందుబాటులో ఉండాలని కోరారు. కేవలం ఆఫీసులకు పరిమితం కాకుండా తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు  వారానికి ఒక రోజు విధిగా జిల్లాలకు క్షేత్ర పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, సంబంధిత విభాగం చేపట్టిన కార్యక్రమాలు, జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు. 


చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని, తమ అనుభవంతో సుపరిపాలన విధానాలు అమలు చేయాలని సూచించారు. విధిగా కలెక్టర్లు కూడా క్షేత్ర పర్యటనకు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి సీఎస్ను ఆదేశించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను అప్పుడప్పుడు విజిట్ చేయాలని చెప్పారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు, అనూహ్యంగా జరిగే సంఘటనలు, దుర్ఘటనలన్నింటా అధికారులు సత్వరమే స్పందించాలని కోరారు. అన్ని శాఖల్లో మెరుగైన విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం గుర్తు చేశారు. 


వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని,  కేవలం పని తీరు ఆధారంగానే అధికారులకు తదుపరి ఉన్నత అవకాశాలుంటాయని, బాగా పని చేసే వారికి ప్రోత్సాహకాలుంటాయని సీఎం అధికారులకు భరోసా ఇచ్చారు. లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని, ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని చెప్పారు. 


త్వరలోనే వారానికో జిల్లా పర్యటనకు వెళుతానని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఈ సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్ర స్థాయిలో  వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. అక్కడి  ప్రజలను కలుసుకునేలా తన పర్యటన ఉంటుందని అధికారులను అప్రమత్తం చేశారు. త్వరలోనే తన జిల్లా పర్యటనల షెడ్యూలు విడుదల చేస్తామని చెప్పారు.

_--ends

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు