కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ లో లో తెలంగాణ కు అన్యాయం చేసారని విమర్శించారు. వికసిత్ భారత్ 2047 బడ్జెట్ లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష ప్రదర్శించారని రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్పై ఆయన స్పందిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడారు. “బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారు....మా ప్రభుత్వంలోని మంత్రులు 18 సార్లు దిల్లీకి వెళ్లారు. తెలంగాణకు అవసరమైన నిధులు ఇవ్వాలని స్వయంగా నేను ప్రధానికి విజ్ఞప్తి చేశా. కానీ, తెలంగాణ పదం పలకడానికి కేంద్రం ఇష్టపడటం లేదు. మొదటి నుంచి ప్రధాని మోదీ తెలంగాణ పట్ల కక్ష కట్టారు. ఇప్పటి వరకు ట్రిపుల్ ఆర్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఏ రంగానికీ సహకారం అందించలేదు. వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారా " అని ప్రశ్నించారు.
"తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. బడ్జెట్లో బిహార్, ఏపీని మాత్రమే పట్టించుకున్నారు. ఇతర రాష్ట్రాలను పట్టించుకోలేదు. 8 సీట్లు ఇచ్చి తెలంగాణ ప్రజలు భాజపా పట్ల వివక్ష చూపలేదు. 8 సీట్లు ఇవ్వడం వల్లే మోదీ ప్రధాని కుర్చీలో ఉన్నారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వలేమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. అలాంటప్పుడు కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి ఎందుకు కొనసాగుతున్నారు? కేంద్రమంత్రి పదవి కోసం కిషన్రెడ్డి.. తెలంగాణ హక్కులను మోదీ వద్ద తాకట్టుపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్రెడ్డి బాధ్యత వహించాలి. కేంద్ర వైఖరికి నిరసనగా కేంద్రమంత్రి వర్గం నుంచి రాజీనామా చేసి బయటకు రావాలి" అన్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి కేంద్రం నిధులు కేటాయించిందని మరి తెలంగాణకు ఎందుకు కేటాయించ లేదని ప్రశ్నించారు.?
" పోలవరానికి నిధులిచ్చిన కేంద్రం.. పాలమూరు-రంగారెడ్డికి ఎందుకు నిధులు ఇవ్వట్లేదు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మార్చారు. ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు.. కుర్చి బచావో బడ్జెట్. తెలంగాణపై కేంద్రం చూపించే వివక్ష మంచిది కాదు బడ్జెట్ను సవరించి నిధులు కేటాయించాలి...ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే.. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కేవలం క్విడ్ ప్రోకో విధానంలో కుర్చీని కాపాడుకునేందుకే ప్రధాని బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చారు. విభజన చట్టం కేవలం ఏపీకే కాదు.. తెలంగాణకూ వర్తిస్తుంది. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుంది. బడ్జెట్ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. లేకపోతే భాజపాకు తెలంగాణలో నూకలు చెల్లినట్లే. పార్లమెంట్ లో నిరసనకు భాజపా ఎంపీలు కలిసి రావాలి. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తే.. మరో ఉద్యమం తప్పదు" అని రేవంత్రెడ్డి అన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box