మహిళా ఉన్నతి తోనే తెలంగాణ ప్రగతి - మంత్రి సీతక్క


జిల్లా DRDO అధికారులకు మంత్రి సీత‌క్క దిశానిర్దేశం



మహిళా శక్తి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక పై స‌మీక్ష‌

ప్రజా పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట

మహిళలను కోటీశ్వరులు చేయ‌డమే ప్ర‌భుత్వ లక్షం 

గ్రామీణ మ‌హిళ‌లు పారిశ్రామికవెత్త‌లుగా ఎద‌గాలి


          మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మ‌రియు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. మహిళా ఉన్నతి తోనే తెలంగాణ ప్రగతి సాధ్య పడుతుందన్నారు. రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ లో జిల్లా DRDO, అదనపు  DRDO  తో మహిళా శక్తి రాష్ట్ర స్థాయి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక త‌యారిపై  పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి  శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ సీఈఓ కాత్యాయ‌ని తో క‌లిసి మంత్రి సీత‌క్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సీతక్క దిశా నిర్దేశం చేశారు. ప్రజా పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నమన్నారు.


            డిమాండ్ ఉన్న వ్యాపారాల్లో మహిళల సంఘాలకు ప్రోత్సహిస్తున్నమని తెలిపారు.క్షేత్రస్థాయి వాస్తవాలకు, ప్రజల అవసరాలు, వనరుల లభ్యతకు తగ్గట్టుగా బిజినెస్ మోడల్ ఉండాలన్నారు. స్థానికంగా లభ్యమయ్యే వస్తువుల ఆధారంగా వ్యాపారం చేస్తే అద్భుతాలు సాదించగలమన్నారు.

ఆధార్ కేంద్రాలు, మీ సేవ సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కొత్తగా ప్రారంభించబోయే మహిళా శక్తి క్యాంటీన్లలో రుచి, శుభ్రత బాగా వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్ గా ఎదగాలని ఆకాంక్షించారు. పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ రహదారుల వెంట, రద్దీ ప్రాంతాల్లో మహిళా క్యాంటీన్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. కల్తీ భయంతో బయట తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారని.. పాలను కూడా కల్తీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కల్తీ వస్తువుల పైన అధికారులు, మహిళా సంఘాలు యుద్ధం చేయాలని పిలుపు నిచ్చారు. క్వాలిటీ పైమహిళా శక్తి క్యాంటిన్లు రాజీ పడొద్దన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పల్లె రుచులను, ఇప్ప పువ్వు లడ్డులు, నన్నారి వంటి సాంప్రదాయిక పానీయాలను పట్టణాలకు పరిచయం చేయాలని సూచించారు.


            ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల స్కూల్ యూనిఫామ్ లను సకాలంలో అందించి.. మార్పు చూయించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన DRDOలను, అధికారులను అభినందించిన మంత్రి సీతక్క.. అదే స్ఫూర్తితో మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిగతులను మార్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అక్షర జ్ఞానం అంతగా లేనీ గ్రామీణ మహిళలనూ ఆర్థికవెత్తలుగా మార్చే దిశలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలన పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(serp) ఏర్పాటయిందని గుర్తు చేశారు. దాన్ని మరింత పటిష్ట పరిచి సేవలను విస్తరించాలన్నారు.


               వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి మహిళలకు విముక్తి కల్పించేందుకే.. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వమే అందజేస్తోందన్నారు మంత్రి సీతక్క. వచ్చే ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల రుణాలు అందిస్తామన్నారు. మహిళా సంఘాల కోసం మంచి బిజినెస్ మోడల్ లను అధికారులు గుర్తించాలని సూచించారు. DRDO లు జిల్లాలో పర్యటించి మహిళా సంఘాల అనుభవాలు తెలుసుకోవాలన్నారు. అందు కోసం వారం రోజులపాటు ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. మహిళలు ఇతరుల మీద ఆధారపడకుండా ఆర్థికంగా సొంత కాళ్ళ మీద నిలబడేలా తోడ్పాటు అందించాలన్నారు. మహిళలు అభివృద్ధి చెందిన తర్వాత  ప్రభుత్వాలకే రుణాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని తెలిపారు. మ‌హిళ సంఘాల‌కు ఆర్దిక చేయుత నందించేందుకు  కలెక్టర్లతో త్వరలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వాహిస్తామ‌న్నారు. మ‌హిళా పారిశ్రామిక వెత్త‌ల‌కు భూ కేటాయింపులు మొదలుకుని..ప్రభుత్వ రాయితీల వరకు  మ‌హిళా సంఘాల‌కు క‌లెక్ట‌ర్లు స‌హ‌క‌రించాల‌న్నారు. మహిళ బాగుంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంద‌ని.. కుటుంబం సంతోషంగా ఉంటేనే స‌మాజం, రాష్ట్రం, దేశం బాగుంటాయ‌ని తెలిపారు. 


        అన్ని సమస్యలకు ఆర్థిక సమస్యలే మూల కార‌ణ‌మైనందున‌, ఆర్దిక స‌మస్య‌ల‌ను పార‌దోలేలా అధికారులు స‌న్న‌ద్దం కావాల‌ని మంత్రి సీత‌క్క పిలుపునిచ్చారు. మహిళా శక్తికి అధికారులే బ్రాండ్ అంబాసిడర్ల‌న్నారు. ఆగస్టు 15 న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరో జత యూనిఫామ్ ఇచ్చేలా అధికారులు కార్య‌చ‌ర‌ణ సిద్దం చేయాల‌న్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయాల‌న్న సీఎం ల‌క్ష్యానికి అనుగుణంగా అధికారులంగా అడుగులు వేయాల‌ని కోరారు. ప్రజాప్రతినిధుల‌కైనా, అధికారుల‌కైనా ప్ర‌జా సేవ‌కు మించిన త్రుప్తి లేద‌న్నారు. గొప్ప లక్ష్యాన్ని చేరుకున్నమన్న సంతృప్తి అధికారులకు కలిగినప్పుడే ప్రభుత్వం సక్సెస్ అవుతుందన్నారు మంత్రి సీత‌క్క‌. ఈ కార్య‌క్ర‌మంలో TGIRD CEO కాత్యాయ‌నీ, PR&RD స్పెష‌ల్ క‌మీష‌న‌ర్ ష‌ఫీ ఉల్లా,  ESD క‌మీష‌న‌ర్ ర‌వికిర‌ణ్, శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి,  వివిధ శాఖ అధికారులు వంద మంది DRDOలు, అద‌నపు DRDOలు పాల్గోన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు