భూమిలేని పేదలకు భూమి పంచాలి

 


భూమిలేని పేదలకు భూమి పంచాలి


వి సి కె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్


   భూమిలేని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూమి పంచాలని విసికె తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్  జిలుకర శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిపబ్లికన్ పార్డీ ఆఫ్ తెలంగాణ (బొజ్జా తారకం) ఆధ్వర్యంలో ఆ పార్టీ కో ఆర్డినేటర్ జన్ను సాంబయ్య అధ్యక్షతన భూమిని పంచు, బడ్జెట్ పెంచు అనే అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు.

     తెలంగాణలో అనేక దశాబ్దాలుగా భూమి కోసం పోరాటాలు జరిగాయని, భూ సంస్కరణ చట్టాలు రావడంతో మిగులు భూములు ఏర్పడ్డాయని అన్నారు. తెలంగాణలో నాలుగు లక్షల రకరాల మిగులు భూములు వున్నాయని, వాటిని గత కెసిఆర్ ప్రభుత్వం వేలం వేసి అమ్ముకుందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్ ను ఓడించి రేవంత్ రెడ్డికి అధికారాన్ని అప్పగించారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను వేలం వేస్తుందని ఆయన విమర్శించారు. పట్టణ, గ్రామీణ గరిష్ఠ భూపరిమితి చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు రెండువందల యాభై గజాల భూమిని ఇస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికలలో హామీ ఇచ్చాడని, వెంటనే ఆ హామీని అమలు చేయాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

    గౌరవ అతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ భూమి, ఉపాధి, ఉద్యోగాలు రావాలంటే అధికారం పేద వర్గాలకు రావాలని అన్నారు. బిసి కులగణన చేసి స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో 90 శాతంగా ఉన్న బహుజన వర్గాలు ఐక్యంగా రాజ్యాధికారం చేపట్టాలని పిలుపునిచ్చారు. 

   సభాధ్యక్షత వహించిన ఆర్ పి ఐ (బొజ్జా తారకం) జన్ను సాంబయ్య మాట్లాడుతూ భూమి వుంటేనే ఆర్థిక అసమానతలు తొలిగిపోతాయని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోనేరు రంగారావు సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

     ఈ కార్యక్రమాన్ని అంకేశ్వరపు రమేష్ సమన్వయం చేయగా విసికె అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్, ఆల్ ఇండియా ఒబిసి జాక్ నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే, రిపబ్లికన్ పార్డీ ఆఫ్ తెలంగాణ సీనియర్ నాయకులు  శ్రీరాముల పైడి, దాసరి రాజు, పీసరి రజిత, కనుకుల శారద, ఎండి షాహిదా, బుర్రి సాంబలక్ష్మి, తరాల సమ్మక్క, తరాల విజయ, మానాల మరియ, పార్నంది రమేష్ చంద్ర, గునిగంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. 


ఆర్ పి ఐ (బొజ్జా తారకం) రాష్ట్ర కమిటీ ఎన్నిక


రాష్ట్ర అధ్యక్షునిగా జన్ను సాంబయ్య


    రాష్ట్ర సదస్సు అనంతరం కమిటీ నాయకులు రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఆర్ పి ఐ (బొజ్జా తారకం) రాష్ట్ర అధ్యక్షులుగా జన్ను సాంబయ్య, ప్రధానకార్యదర్శిగా అంకేశ్వరపు రమేష్, ఉపాధ్యక్షురాలుగా పీసరి రజిత, రాష్ట్ర కార్యదర్శిగా పార్నంది రమేష్ చంద్ర లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు