ప్రభుత్వ ఆఫీసులలో పని ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు బిల్లా పెట్టుకుని వెళ్లాలని, అధికారులు టీ ఇచ్చు మరీ పనులు చేసి పెడతారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ఆయనకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు పాటు కార్యకర్తలు అవమానాలు పడ్డారని, వారందరికీ తాను మాటిస్తున్నానన్నారు.
'రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెబుతాను. ప్రతి కార్యకర్త ఎస్సై దగ్గరకు వెళ్లినా, ఎమ్మార్వో దగ్గరికి వెళ్లినా, ఎండిఓ దగ్గరకు వెళ్లినా, ఏ ఆఫీసుకు వెళ్లిన పసుపు బిల్ల పెట్టుకుని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి మరి మీ పని ఏమిటి అని అడిగి చేసిపెడతారన్నారు . మీ అందరికీ పని చేయించేలా అధికారులను లైన్ లో పెడతాను. ఎవరైనా ఒకరిద్దరు నా మాటను జవదాటితే ఏమవుతారో వారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు' అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు .
తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, 2019-24 మధ్య పరిపాలన ఎలా జరిగిందో చూశామన్నారు. రాష్ట్రంలో తన పార్టీ తప్ప ఇంకొక ఉండకూడదు అన్నట్లు జగన్ వ్యవహరించారని, ఎప్పుడూ ఇన్ని బాధలు పడలేదన్నారు. పార్టీ ఉంటుందా..? లేదా..? అని నిద్ర లేని రాత్రులు గడపానన్న మంత్రి.. కష్టపడి పని చేసినట్టు తెలిపారు. కార్యకర్తలు అండగా నిలబడ్డారని స్పష్టం చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 95 శాతం సీట్లు గెలిచిన చరిత్ర ఏ పార్టీకి లేదని, కూటమి ఆ స్థాయిలో విజయాన్ని సాధించిందన్నారు. ఎలా పరిపాలన చేయాలో ఆలోచన చేస్తున్నామని, ఎవరూ టెన్షన్ పడొద్దు అని పేర్కొన్నారు. తమది డబుల్ ఇంజన్ సర్కార్ అని, మోడీ సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తామన్నారు. జీవితాంతం శ్రీకాకుళం వాసులకు సేవ చేసి రుణం తీర్చుకుంటామన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box