ప్రపంచ వాతావరణ రోజు
ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి, ఆ దేశాల్లో ఉన్న రకరకాల ప్రజలందరు జరుపుకోవలసిన ప్రపంచ పర్వదినం.
ఈ రోజు ప్రపంచ వాతావరణ దినం. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం 1972 లో ఈ రోజును ప్రపంచ వాతావరణ దినంగా ప్రకటించింది.
అప్పటినుండి అన్ని దేశాలు ఈ రోజుని ఒక ఉత్సవంగా ఒక అలవాటుగా జరుపుకుంటున్నాయి. కానీ వీటిపై నిబద్ధత మాత్రం చాలా తక్కువ దేశాలలో ముఖ్యంగా ప్రజలలో ఉందని మన వాతావరణ పరిస్థితులు మనకు తెలియజేస్తున్నాయి.
ఈ సంవత్సరం భారతదేశంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు ఊహించనంతగా పెరిగాయి. ప్రపంచం మొత్తంగా కూడా వాతావరణం పరిస్థితులు అత్యంత భయానకంగా మారుతున్నాయి.
మొట్టమొదటిసారి రాచల్ కార్సన్ అనే ఆమె సైలెంట్ స్ప్రింగ్ అనే ఒక పుస్తకంలో డిడిటి వాడకం వల్ల ఏవిధంగా వాతావరణానికి పక్షులకు నష్టం వస్తుందో వ్రాసింది. అలాంటి ప్రమాదం ఏమీ లేదని ఆ రసాయనం తయారు చేసేటువంటి పరిశ్రమలు గట్టిగా వాదించాయి. కానీ ప్రజలందరూ ఆమె చూపిన నిరూపణలు నమ్మి చాలా పెద్ద స్థాయిలో మద్దతు ఇవ్వడం వల్ల అమెరికా ప్రభుత్వం దిగివచ్చి డిడిటిని నిషేధించింది.
1973లో ఎఫ్ షూమేకర్ అనే బ్రిటిష్ లో పుట్టిన జర్మన్ ఎకనామిస్ట్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తకంలో ప్రస్తుత ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి వాతావరణానికి హాని గలిగేటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలను విమర్శిస్తూ పుస్తకం రాశాడు. ఆ పుస్తకం సంచలనం రేపింది.
ది టైమ్స్ లిటరరీ సప్లిమెంటరీ ఈ పుస్తకాన్ని ప్రపంచంలో అత్యంత ప్రభావితమైనటువంటి 100 పుస్తకాల్లో ఒకటిగా పేర్కొంది. ఈ పుస్తకంలో ఒక అద్భుత వాక్యం ఉంది.అదేంటంటే మనకున్న ఈ ఒక్క భూమిలోని వనరుల్ని మనము మూలధనం పై వచ్చే వడ్డీ లాగా వాడుకోవాలి కానీ మూలధనం లాగా వాడుకోకూడదు. కానీ ఇప్పటివరకు మనం చేస్తున్నది మూలధన వాడుక.
ఈ పుస్తకం తర్వాత వాతావరణ పరిస్థితులపై ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ప్రపంచ అధినేతలు వాతావరణ పరిస్థితుల ప్రభావం మన మునుగడపై ఇంత ప్రమాదకరమైన ప్రభావం చూపుతుందో అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిసారిగా గ్రహించారు.
తరువాత చాలా కాలం వరకు ప్రభుత్వాలు వాతావరణ పరిస్థితుల గురించి పట్టించుకోలేదు. కానీ 1988లో పరిస్థితి విషమించడం చూసి వరల్డ్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్(WMO )మరియు యునైటెడ్ నేషన్స్ వాతావరణ సంస్థ(UNEP )రెండు కలిపి ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఆన్ క్లైమేట్ చేంజ్(IPCC )అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ యొక్క కార్యాలయం స్విజర్లాండ్ లోను జెనీవాలో ఉంది.
IPCC లక్ష్యం ప్రభుత్వాలని వాతావరణ మార్పులపై శ్రద్ధ వహించేలా చేయడం మరియు ఈ ప్రతికూల మార్పుల కారణాలు వెతికి వాటిని తగ్గించేందుకు ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం. ఈ కార్యనిర్వహణ కోసం ఈ కమిటీ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి వాతావరణ మార్పుల వివరాలను ప్రపంచవ్యాప్తంగా సేకరించి వాటిని విశ్లేషించి వాటి ప్రభావాన్ని అంచనా వేసి తద్వారా ఎలాంటి దుష్పరిణామాలు ప్రపంచంలో సంభవించగలవో అంచనా వేసి వాటిని ఏ విధంగా ఎదుర్కొనాలో సలహాలు పరిష్కారాలు సూచిస్తాయి.
అంతేకాకుండా 1922లో యునైటెడ్ నేషన్స్ ప్రేమ్ వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే(UNFCC) నే సంస్థను కూడా జర్మనీలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ యొక్క ఆధ్వర్యంలో 154 దేశాల మధ్య వాతావరణ విధ్వంస నివారణకై ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందానికి దారితీసినటువంటి సమావేశం మొట్టమొదటిసారి 1994 మార్చిలో రియో డి జనరి, బ్రెజిల్ లో జరిగింది.
అప్పటి నుండి ఇప్పటి వరకు జపాన్లో మరియు ఇతర దేశాల్లో సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని దేశాలలో కూడా హరిత వాయువుల నియంత్రణ చేసి ప్రపంచం యొక్క సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవానికి ముందు ఉన్నటువంటి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కన్నా రెండు డిగ్రీల కన్నా ఎక్కువ పెంచకుండా చర్యలు చేపట్టడం.
అయితే ఇప్పటివరకు కూడా ఎంతో కొంత ప్రయత్నం జరిగినప్పటికీని ఈ ఉష్ణోగ్రత నియంత్రణ లక్ష్యానికి బహు దూరంలో ఉన్నామని తెలుస్తుంది.
ప్రతికూల వాతావరణ మార్పులను అదుపులో తెచ్చుకునేందుకు ప్రభుత్వాలు కాలుష్య నివారణ, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, పునరుత్పత్తి విద్యుత్ పద్ధతులు పాటించటం, ఎలక్ట్రానిక్ మరియు ఇతర వస్తువుల తిరిగి వాడకము, వాడుక తగ్గించడం, పునర్నిర్మితము, ఎలక్ట్రానిక్ వాహకాల తయారీ, సత్వర ఆర్థిక అభివృద్ధి విధానాలను అవలంబించడం, నీరు గాలి కాలుష్య నివారణ లాంటి చాలా పరిష్కారాలను గుర్తించి కొత్తవి కనుక్కుని వాడుక దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మనదేశంలో కూడా 21 రకాల ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా మోడీ ప్రభుత్వంలో సోలార్ మరియు గాలి ఆధారిత విద్యుత్ ఉత్పాదనకు చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది.
వాతావరణ అవగాహన కల్పించే నిమిత్తం ప్రతి కోర్సులో పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిలలో వాతావరణ సంబంధిత విషయాలు పాఠ్యాంశాలలో చేర్చడం జరిగింది.
ఆధునిక యంత్రాలు , వాహనాలు, ఉత్పత్తి విధానాల ద్వారా వెడలే అటువంటి విషవాయువుల నియంత్రణ కోసం చెట్లు పెంచడం అడవులను కాపాడడం అనే చర్యలు కూడా విస్తృతంగా మన ప్రభుత్వాలు తీసుకున్నాయి. దీనికోసం అటవీశాఖ మంత్రిత్వ శాఖ పేరును అటవీ మరియు వాతావరణ మార్పు శాఖగా మార్చారు.
ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పారిశ్రామిక విప్లవం నాటి ఉత్పత్తి పద్ధతుల వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని ఆపేందుకు సత్వర అభివృద్ధి లక్ష్యాల పేరుతో యునైటెడ్ నేషన్స్ 2015 లో 17 లక్ష్యాలతో ఒక ఒప్పందం జరిగింది. 2030 నాటికి ఈ లక్ష్యాలు నెరవేర్చాలని ఒక కాలపరిమితి పెట్టుకుంది.
ఈ 17 లక్ష్యాలలో ముఖ్యమైనవి బీదరిక నిర్మూలన, క్షుద్భాద నిర్మూలన, ఆరోగ్యం, అందరికీ నాణ్యమైన విద్య, లింగ బేద నిర్మూలన, స్వచ్ఛమైన నీరు మరియు పరిశుభ్రత, చౌక మరియు స్వచ్ఛ విద్యుత్తు, గౌరవనీయమైన ఉద్యోగాలు మరియు ఆర్థిక అభివృద్ధి, పరిశ్రమలు, నూతన ఆవిష్కరణలు మరియు మౌలిక సదుపాయాలు,ఆర్థిక సమానత్వం, సత్వర నగరాలు జన సముదాయాలు, వాతావరణహిత వాడకం, ఉత్పత్తి, వాతావరణ రక్షణ చర్యలు, సముద్ర జీవాల పరిరక్షణ, జంతు పరిరక్షణ, శాంతి మరియు న్యాయం చేకూర్చే సంస్థల అభివృద్ధి, పై లక్ష్యాలు సాధించేందుకు కావలసిన సహకార వ్యవస్థలు.
ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా నాయకులు మరియు ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ వాతావరణ పరిక్షణకు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కలిసిమెలిసి హాయిగా శాంతియుతంగా బతికేందుకు కావలసిన ఎన్నో ప్రణాళికలు వేయడం జరిగింది. వాటి నిర్వహణలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. వాటిని అధికమించడం కూడా జరుగుతుంది.
ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు ఈ రకంగా దిగజారడానికి కారణం అధికంగా అభివృద్ధి చెందిన దేశాల విశృంఖల వినియోగ విధానాలు. ఈ దేశాలు వారు తప్పిదాలను ఒప్పుకున్నా కూడా వాటిని పరిష్కరించేందుకు కావలసిన వనరులు, సాంకేతికత ఇవ్వడంలో కావాల్సిన దానికన్నా చాలా తక్కువ సమకూరుస్తున్నారు.
మన దేశంలో కూడా ఉత్పత్తి విధానాల్లో ప్రజల అతి వస్తు వాడకంలో అభివృద్ధి చెందిన దేశాలను అనుకరించడం జరుగుతుంది. దానితో ఈ లక్ష్య సాధన ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కినట్టుగా సాగుతుంది.
ఈ సందర్భంలో గాంధీ మహాత్ముడు అన్న మాటలు " ఈ ప్రకృతి అందరి అవసరం తీర్చగలదు గాని ఒక్కరి దురాశ తీర్చలేదు." గుర్తు చేసుకోవాలి, పదే పదే స్మరించుకోవాలి, అవలంబించాలి.
ఇప్పటికే వాతావరణ పరిస్థితులు చేయి జారిపోయాయని కొందరు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కానీ దీన్ని విస్మరించటం మన భావి తరాలకు తీరని అన్యాయం చేసినట్టే. వాతావరణ పరిరక్షణ బాధ్యత ఏ సంస్థలతో ప్రభుత్వాలలో కాదు ప్రతి ఒక్కరిది.
Dr M H Prasad Rao
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box