నక్సలైట్ అమరవీరుల త్యాగాలను మరచిన పాలకులు

 నక్సలైట్ అమరవీరుల త్యాగాలను మరచిన పాలకులు



    ఒకరి ఓటమి మరొకరి విజయానికి కారణవుతుంది. కొందరి త్యాగం ఎందరికో ఉపయోగపడుతుంది. తల్లి తండ్రుల త్యాగం బిడ్డల భవిషత్ కు బాటలు వేస్తుంది. ఆదిమ మానవుడి నుండి ఆధునిక మానవుడిగా ఎదిగిన మానవ సమాజంలో పూర్వీకుల త్యాగాల వల్లనే అభివృద్ధి జరిగింది. అర్థం కాని ప్రకృతి వైపరీత్యాల నుండి, అవసరమైన వస్తువుల ఉత్పత్తి వరకు మానవ సమాజం, శాస్త్రజ్ఞులు ఎన్నో త్యాగాలు చేసారు. ఆహారం, ఆశ్రయం కోసం ఆదిమ మానవుడు అడవిలో క్రూర మృగాల నుండి వారిని రక్షించుకోవడమే కాకుండా వారి పరివారాన్ని కూడా రక్షించుకోవడం కోసం ఎన్నో త్యాగాలు చేసారు. ఆదిమ మానవుడు ఆధునిక మానవుడిగా మారిన నాటి నుండి వారి పోరాటం, యుద్ధం అంతా మానవుల మధ్య నానాటికి పెరుగుతున్న స్వార్థం వల్ల జరుగుతుంది. వ్యవసాయం కనుగొని వస్తూత్పత్తి పెరిగిన నాటి నుండి మానవుల మధ్య అసమానతలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన ఎన్నో పోరాటాల్లో ఎందరో విప్లవకారులు అమరులైన చరిత్ర భారతదేశంతో పాటు తెలంగాణలో వుంది.

    ఎన్నో త్యాగాలు, మరెన్నో ప్రాణ త్యాగాలు, తెలంగాణలోని దోపిడి పీడనలకు వ్యతిరేకంగా సాగిన యుద్ధంలో ఎందరో నేలకొరిగారు. పదేండ్ల తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ త్యాగధనుల చరిత్రను నెమరు వేసుకోవాల్సిన అవసరముంది. ఆ త్యాగధనుల్లో నక్సలైట్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి, గొప్పవి. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎందరో త్యాగధనులు వారి ప్రాణాలను అర్పించారు. నిజాం పాలనను అంతమొందించే దశలో  ఆనాటి కాంగ్రెస్ పార్టీ నమ్మించి చేసిన పోలీసు యాక్షన్ లో వేలాది మంది అమరులయ్యారు. దురాక్రమణతో స్వాతంత్ర భారతదేశంలో కలుపుకున్న తెలంగాణలో పాలకుల నిరంకుశత్వం మరింత ఎక్కువైంది. దానికి తోడు నిజాం కాలంలో ఆధిపత్యం చెలాయించిన భూస్వామ్య వర్గాలు ప్రజలపై తిరిగి పెత్తనం చేయడం మొదలుపెట్టారు. తెలంగాణలోని దోపిడి, అణచివేత చాలదన్నట్లు ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణలో కలిపి మరింత దోపిడి పెంచి సకల సామాజిక రంగాల్లో మరిన్ని అసమానతలు పెంచారు. నిజాం పాలనపై తిరుగుబాటు చేసిన చరిత్ర కలిగిన తెలంగాణ సమాజం తెలంగాణలో జరుగుతున్న దోపిడి, అణచివేతలపై, పెత్తందారీ, భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేశారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో మొదలైన నక్సలైట్ పోరాటం తెలంగాణకు విస్తరించింది. తెలంగాణలో నెలకొన్న అసమానతలు, ప్రాంతీయ దోపిడి, అనచివేతలపై తిరుగుబాటు చేస్తున్న తెలంగాణ సమాజం పోరాటాలు, త్యాగాల చరిత్ర కలిగిన తెలంగాణ ప్రజలు నక్సలైట్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు.

     దేశంలో మొదలైన నక్సలైట్ ఉద్యమం మొదట సిఒసి (సెంట్రల్ ఆర్గనైజేషన్ కమిటీ) గా ఏర్పడగా కాను సన్యాల్, మాధవ్ ముఖర్జీ, చార్ ముజుంధార్ లు ఆ కమిటీకి నాయకత్వం వహించారు. సిఒసి కి తెలంగాణలో రాయల సుభాష్ చంద్ర బోస్ నాయకత్వం వహించారు. తర్వాత జరిగిన పార్టీల విభజన పరిణామాల్లో యుసిసిఆర్ఎంఎల్, కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో ఆర్ ఎస్ యు, సిపిఐ (ఎం.ఎల్) పీపుల్స్ వార్, చంద్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సిపిఐ (ఎం ఎల్), ఆ తర్వాత వచ్చిన చీలికల్లో ప్రజాపంథా, జనశక్తి, సిపియుఎస్ఐ (ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ) న్యూడెమోక్రసీ, ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన తదితర పార్టీలుగా విడిపోయి పోరాటం చేశాయి. సిద్ధాంత విభేదాలతో ఎన్ని పార్టీలుగా విడిపోయినా కూడా వీరంతా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో జరుగుతున్న దోపిడి, పీడనలను ఎదురించి పోరాటం చేసి ఎందరో అమరులయ్యారు.

      సీమాంధ్ర పాలనలో తెలంగాణలో జరుగుతున్న అణచివేత, నిర్బంధం, అసమానతలను ఎంత ఎదురించి పోరాటాలు చేసినా కూడా విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయ అవకాశాల్లో తెలంగాణ ప్రజలకు అన్యాయమే జరుగుతూ వచ్చింది. మెజార్టీ ప్రజలకు ఆధారమైన వ్వవసాయ రంగాన్ని నిర్లక్షం చేయడం వలన వరుస నష్టాల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ఆత్మ బలిదానాలు, చేనేతలు, బీడీ కార్మికులు, అసంఘటిత కార్మికుల ఆత్మ హత్యలపై చలించిన సిపియుఎస్ఐ కార్యదర్శి కామ్రేడ్ మారోజు వీరన్న మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి 1997 ఆగష్టు 11 న సూర్యాపేటలో వేలాది మందితో తెలంగాణ మహాసభ ఏర్పాటు చేసారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, న్యాయవాది వి. ప్రకాశ్, డాక్టర్ చెరుకు సుధాకర్, కేశవరావు జాదవ్, ఉ సాంబశివరావు లాంటి వారిని ఆ మహాసభలో నాయకులుగా పెట్టి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపాడు. మారోజు వీరన్న ఉద్యమ తీవ్రతను గమనించిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వీరన్నను బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపింది. వీరన్న ముందు, తర్వాత కూడా ఎందరో సిపియుఎస్ఐ నాయకులను, కార్యకర్తలను 140 మందిని చంద్రబాబు ప్రభుత్వం కాల్చి చంపింది తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను గమనించిన పీపుల్స్ వార్ పార్టీ కూడా తెలంగాణకు మద్దతుగా 1998 జూలై 5 న తెలంగాణ జమసభను ఏర్పాటు చేసి భువనగిరి సభ పెట్టి ఉద్యమాన్ని ఉదృతం చేసింది. జనసభలో చురుకుగా పాల్గొంటున్న తెలంగాణ గాణ కోకిల బెల్లి లలితక్కతో పాటు ఎంతోమంది పోరాట యోధులను ఆనాటి ప్రభుత్వాలు పొట్టన పెట్టుకున్నాయి. ప్రజా యుద్ధ నౌక గద్ధరన్నపై కాల్పులు జరిపి చంపాలని చూసారు. ఎంతమందిని ఎన్ని ఒడిదొడుకులు చంపినా వీరోచితంగా ముందుకు సాగిన పోరాటాన్ని అణచివేయడానికి పార్టీ అగ్ర నాయకులపై గురిపెట్టిన పాలకులు సిపిఐఎంఎల్ పనిభక్షి వర్గం కార్యదర్శి మధుసూదన్ రాజ్ ను, జనశక్తి పార్టీ చర్చల ప్రతినిధి రియాజ్, ప్రజా ప్రతిఘటన నాయకులు చలమన్న, జగ్గాని భిక్షపతి, సుబ్బన్న, చంద్రన్న, కాశన్న, నర్సన్న, సిపియుఎస్ఐ నాయకులు యాదన్న, స్వరూప, రాము, సూర్యం, కంబల్, నవీన్, పీపుల్స్ వార్ పార్టీ అగ్రనేతలు పులి అంజయ్య, శీలం నరేష్ అలియాస్ మురళి, నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్, ఆజాద్, పటేల్ సుధాకర్ రెడ్డి, పద్మక్క, పోలం సుదర్శన్ రెడ్డి అలియాస్ రామకృష్ణ, భూపతి, విజయ్, యాదన్న, సూర్యం, జగదీష్ లాంటి మహా నాయకులనెందరినో బూటకపు ఎన్కౌంటర్ లలో, కోవర్టు ఆపరేషన్ లో కాల్చి చంపిన దుర్మార్గపు చరిత్ర తెలంగాణలో వుంది. తెలంగాణలో జరిగిన ప్రతి పోరాటంలో నక్సలైట్ల పాత్ర చాలా త్యాగాలతో కూడుకున్నది. తెలంగాణ ఉద్యమంలోకి కెసిఆర్ వచ్చిన నాటి నుండి తెలంగాణ ఉద్యమానికి నక్సలైట్ల పూర్తి మద్దతు వుంది. నక్సలైట్లె నిజమైన దేశ భక్తులు అని ఎన్ టి రామారావు ప్రకటించగా, నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అని కెసిఆర్ అన్నాడు. మేము అధికారంలోకి వస్తే నక్సలైట్లతో చర్చలు జరుపుతామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సాగించిన దమనకాండ నేటికీ ప్రజలు మరచిపోలేదు. ఎన్ని మరణాలు, ఎన్ని కష్టాలు ఎదురైనా, దళాలకు దళాలు తుడిచి పెట్టుక పోయినా కూడా తెలంగాణ కోసం నక్సలైట్లు పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసారు.

    తెలంగాణలో పదేండ్ల కెసిఆర్ పాలనను వ్యతిరేకించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అధికారం చేపట్టిన మొదటి రోజునే ప్రజా పాలన కొనసాగిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఒక్కరి వల్ల రాలేదని ఎందరో త్యాగాలు చేస్తే, మరెందరో ఉద్యమాలు చేస్తే వచ్చిందని 10 ఏండ్ల తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, తెలంగాణ ఉద్యమకారులను ఆ ఉత్సవాల్లో భాగస్వాములు చేయాలని ఆదేశాలిచ్చారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగే వరకు నక్సలైట్లను వారి త్యాగాలను పొగిడి మోసిన కెసీఆర్ తన పదేండ్ల పాలనలో ఎక్కడా వారి త్యాగాల గురుంచి మాట్లాడలేదు. ప్రజా పాలన అని పదే పదె వల్లిస్తున్న రేవంత్ ప్రభుత్వం కూడా నక్సలైట్ అమరుల త్యాగాలను గుర్తించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ నక్సలైట్ పార్టీలో పనిచేసి అమరులైన కుటుంబ సభ్యులను గుర్తించి అన్ని రకాలుగా ఆదుకొని గౌరవించాలి. జన జీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్లను, కార్యకర్తలను, కేసుల పాలైన వారిని తెలంగాణ సమరయోధులుగా గుర్తించి వారి త్యాగాలను ఎత్తిపట్టి అన్ని రకాలుగా ఆధుకున్నపుడే నిజమైన ప్రజా ప్రభుత్వం అవుతుంది. పదేండ్ల ఉత్సవాలకు సార్థకత చేకూరుతుంది. 



సాయిని నరేందర్ 
సామాజిక, రాజకీయ విశ్లేషకులు 
9701916091

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు