స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ బిసీ నేతల ధర్నా

 రిజర్వేషన్ల కోసం కదిలిన బిసీ నేతలు - మిన్నంటిన నినాదాలతో దద్దరిల్లిన ఇందిరా పార్కు

రిజర్వేషన్లు తేల్చకుండా ఎన్నికలకు తొందరొద్దని సిఎం రేవంత్ రెడ్డికి  బిసి నేతల అల్టి మేటం


హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలకు పిలుపు  

కులగణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల సాధనకోసం గ్రామాలకు తరలాలని తీర్మాణం


ఆత్మగౌరవం, అధికారం కోసం మిలిటెంట్ ఉద్యమాలకైనా వెనుకాడేది లేదని హెచ్సరిక 

ఇందిరా పార్క్ ధర్నాలో నాయకులు ఆర్ కృష్ణయ్య, రాజారామ్ యాదవ్, సాయిని నరేందర్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాపోలు ఆనంద భాస్కర్, పుటం పురుషోత్తం, గౌరీ శంకర్ 


బీసి నేతల ధర్నాతో దద్దరిల్లిన ఇందిరా పార్కు 

   సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసి సంఘాల నేతృత్వంలో శనివారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో  ధర్నా జరిపారు.

బిసీలకు 42 శాతం రిజర్వేషన్లు  ఇస్తామని చెప్పి ఆ ఊసెత్తని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దపడటం వల్ల బిసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

బిసీల గణాంకాలు రిజర్వేషన్ల వాటాలు తేల్చకుండా   స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరించారు.

 ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో  జరిగిన ఆందోళనలో  బి.సి జనసభ అద్యక్షులు రాజారామ్  యాదవ్ మాట్లాడుతూ   సమగ్ర కులగణన జరిపి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరాలని ఇది బిసి సంఘాల మాండేటరీగా అమలు చేయాలని డిమాండ్ చేసారు. 

 కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో  బి.సి కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు ఆయన అధ్యక్షత వహించారు. 

ఈసందర్బంగా కాంగ్రేస్ పార్టి ఇచ్చిన  హామీలను గుర్తు చేస్తూ రాహుల్ గాంధి బి.సి లకు జనాభా ప్రాతిపదికన  రిజర్వేషన్లలో వాటా ఇస్తామని హామి ఇచ్చారని అట్లాగే  రిజర్వేషన్లపై 50 శాతం ఉన్న  సీలింగ్ ఎత్తి వేస్తామని చెప్పారని అన్నారు. బీసిలకు ఇచ్చిన హామీలతో  దేశ వ్యాప్తంగా బి.సి ల ఓట్లతో మెజార్టీ సీట్లను గెలుచుకోవడమే కాకుండా కాంగ్రేస్ పార్టి  రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిందని అన్నారు.

 బి.సి ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి బి.సి కులగణన, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.  కామారెడ్డి లో సమగ్ర కులగణన జరిపిస్తామని  డిక్లరేషన్లో హామి ఇచ్చి  గవర్నర్ తో బి.సి కులగణన అని అసెంబ్లీలో మాట మార్చి చెప్పించడం ఎలా సరైందని అన్నారు. 

నొసలుతో ఒకటి, నోటితో ఒకటి మాట్లాడుతున్న రేవంత్ రాజకీయాలను బి.సి లు అర్థం చేసుకోవాలని అన్నారు. సమగ్ర కుల జనగణన జరపకుండా ఎన్నికల్లోకి వెళ్లి చట్టపరమైన సమస్యల సాకు చూపెట్టి బి.సి లకు అన్యాయం చేయాలని  కాంగ్రెస్ పార్టీ  చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ అవకాశ వాద రాజకీయాలని ఎండ గడుతూ ఆ పార్టి  చరిత్ర అంతా  బి.సి లకు వ్యతిరేకంగానే జరిగిందని బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రేస్ పార్టీయేనని పేర్కొన్నారు. కాకా కలేల్కర్ కమీషన్ నుండి మొదలు  మండల్ కమీషన్ వరకు బి.సి లకు వ్యతిరేకంగా పని చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని దుయ్యబట్టారు.  బి.సి లకు నష్టం చేసి రేవంత్ రెడ్డి ఏమి సాధిస్తారని ప్రశ్నించారు., వివిధ కులాలుగా ఆయా వృత్తుల ద్వారా ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తున్న బి.సి లకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బి.సి శక్తిని రాజకీయ శక్తిగా మార్చి బి.సి వాటా సాధించే వరకు అవిశ్రాంత పోరాటానికి సంసిద్దులు కావాలని  పిలుపు నిచ్చారు.



    రాజ్యసభ సభ్యులు, బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ఈ దేశ పాలకులు బి.సి లను బిచ్చగాళ్లుగా మార్చారని విమర్శించారు.  బి.సి ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బి.సి లకు నష్టం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు.  ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర, హక్కుల కోసం రక్తం చిమ్మిన తెలంగాణ నేలపై బి.సి లకు అన్యాయం చేస్తే పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని  అమలు చేస్బితూ బి.సి జనాభా ప్రాతిపదికన   అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

 76 ఏండ్లుగా అణచివేతకు గురైన  బి.సి లు విజృభించడానికి సిద్ధంగా ఉన్నారని, బి.సి లను తక్కువ అంచనా వేస్తే ఊరుకునేది లేదని అన్నారు. బి.సి ల అభివృద్ధి పట్ల బిజెపి నిర్లక్ష్యం వీడాలని   అన్నారు. ఎవరెవరికోసమో ప్రాణ త్యాగాలు చేసిన బి.సి సమాజం బి.సి విముక్తి పోరాటంలో ముందు వరుసలో నిలవాలని  పిలుపునిచ్చారు. 56 శాతం జనాభా గల బి.సి లలో 14 శాతం మాత్రమే రాజకీయాల్లో ఉన్నారని, 56 శాతం ఉన్న బిసి లల్లో 9 మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారని, 100 మంది  కేంద్ర కార్యదర్శుల్లో కేవలం ముగ్గురంటే ముగ్గురు బి.సి లు ఉన్నారని, కార్పొరేట్ వ్యాపారుల్లో 1 శాతం కూడా లేరని అన్నారు. ఇంతటి స్థితిని మార్చడం కోసం బి.సి లు మిలిటెంట్ ఉద్యమాలు చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో తెలిపిన అన్ని అంశాలను అమలు పరచాలని, సమగ్ర కులగనన జరిపి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాంగ హక్కుల కోసం, న్యాయమైన వాటా కోసం బి.సీలు ఎంతటి త్యాగాలకైనా సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల నుండి చట్ట సభల వరకు అన్ని స్థాయిల్లో బి.సి లకు అవకాశాలు రావాలంటే సమగ్ర కుల జనగణన తప్పని సరని అన్నారు. సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలంటే బి.సి లు ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. 

    మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన బిజెపి ప్రభుత్వానికి రెండు కాళ్ళు లేకుండా, ఉత్తరప్రదేశ్ లో బిజెపి దుర్మార్గాన్ని తిప్పికొట్టి, దేశ ప్రధానికీ ఓటమితో చెమటలు పట్టించిన శక్తి బి.సి లదని  అన్నారు. పంచాయితీల్లో సర్పంచ్ లు లేకుంటే కేంద్ర నిధులు రాకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ అయినా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో బి.సి కుల జనగణన గురించి ఎన్నో మార్లు మాట్లాడిన రాహుల్ గాంధీ చొరవ తీసుకొని తెలంగాణలో శాస్త్రీయమైన సమగ్ర కులజనగణన జరిపి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసారు.  బి.సి ఐక్య ఉద్యమాలు మరింత బలపడి రాజ్యాధికారం చేపట్టే శక్తిగా మారాలని అన్నారు.

    బి ఆర్ ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ కృషి వల్ల రాజ్యాంగంలో బి.సి కమీషన్లు వేసుకునే అవకాశం వచ్చిందని, నెహ్రూ నాయకత్వంలో కాకా కలేల్కర్ కమీషన్ నివేదిక, ఇందిరా గాంధి నాయకత్వంలో మండల్ కమేషన్ నివేదికను బుట్టదాఖలు చేసారని విమర్శించారు. మండల్ కమీషన్ అమలు చేసిన వి.పి సింగ్ ప్రభుత్వానికి బిజెపి ప్రభుత్వం మద్దతు ఉపసంహరించుకోగా రాజీవ్ గాందీ వ్యతిరేకించారని గుర్తు చేసారు.

 దేశానికి 1947 లో స్వాతంత్రం వస్తె బి.సి లకు 1995 లో అవకాశాలు మొదలయ్యాయని, 2008 నుండే బి.సి లకు కేంద్ర ప్రభుత్వంలో విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించబడ్డాయని, చట్టాలు, న్యాయవ్యవస్థను అడ్డు పెట్టుకొని బి.సి లకు అన్యాయం చేస్తున్నారని, బహుజన వర్గాలకు వ్యతిరేకంగా తీర్పులిచ్చే న్యాయమూర్తుల్లో బి.సి లు లేరని, నేటికీ 79 శాతం న్యాయమూర్తులు ఆధిపత్య వర్గాల వారే ఉన్నారని అన్నారు. కాంగ్రేస్ పార్టి అధికారంలోకి వచ్చి  ఆరు నెలలు గడిచినా కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్న ఆంశాలలో  ఏ ఒక్క అంశంపై  కనీసం కదలిక లేక పోవడం చూస్తే కాంగ్రేస్ పార్టి చిత్తశుద్ధి అర్థమవుతుందని ఆయన అన్నారు. బి.సి హక్కుల సాధన కోసం తెలంగాణ ఉద్యమం లాగా గ్రామ గ్రామాన ఉద్యమించాల్సిన అవసరముందని 46, 340 ఆర్టికల్స్ ప్రకారం బి.సి లకు రావల్సిన హక్కులను సాధించాలని పిలుపునిచ్చారు.

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బి.సి మహాసభ అద్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు మాట్లాడుతూ ఇంతకాలం స్థబ్దంగా ఉన్న బి.సి ఉద్యమం కుల జనగణన, స్థానిక సంస్థల్లో బి.సి రిజర్వేషన్ల సాధన ఉద్యమం సందర్భంగా ఉవ్వెత్తున లేస్తుందని, బి.సి కులాల, సంఘాల ఐక్యతను చూస్తే రానున్న భవిషత్ అంతా బి.సి లదేనని అన్నారు. ఆయా ఉద్యమాల్లో ఎన్నో త్యాగాలు చేసిన బి.సి లు నేడు బి.సి విముక్తి కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి.సి కమీషన్ మాజీ సభ్యులు గౌరీ శంకర్ మాట్లాడుతూ 77 ఏండ్లుగా శ్రమలో, చాకిరితో యుద్ధం చేసిన బి.సి లు గొంతులు కోస్తున్నా రాజకీయ పార్టీల్లో సేవ చేస్తున్నామని, బి.సి లు ఓడిపోతూనే ఆధిపత్య పార్టీలను గెలిపిస్తూ వస్తున్నారని, బి.సి లు కూడా పాలిచగలరని నిరూపించే ఈ పోరాటంలో సబ్బండ వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలని నాట్లేసే అవ్వల దగ్గర నుండి అధికారుల వరకు అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

    బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకురాలు, హై కోర్టు న్యాయవాది గుండ్రాతి శారద మాట్లాడుతూ ఇబిసి రిజర్వేషన్లు తెచ్చి బి.సి లకు అన్యాయం చేసిన మోడీ ని వణికించిన బి.సి లు తెలంగాణ రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పు లాగా ఉన్నారని బి.సి లకు అన్యాయం చేయాలని చూస్తున్న రేవంత్ కబడ్దార్ అని గర్జించారు.

     ఈ ధర్నా కార్యక్రమంలో మేకల కృష్ణ  స్వాగతోపన్యాసం  చేయగా  ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, హిందూ బి.సి మహాసభ రాష్ట్ర అద్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తం, బి.సి కమీషన్ మాజీ సభ్యులు గౌరీ శంకర్, ముఠా జయసింహ, ఎంబిసి నాయకులు కొల్లూరు సత్యనారాయణ, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే, వళ్ళాల జగన్ గౌడ్, పొన్నం మహేశ్ గౌడ్, న్యాయవాది రాచకొండ ప్రవీణ్ కుమార్, వివిధ సంఘాల నాయకులు న్యాయవాది గుండ్రాతి శారద గౌడ్ ఏటిగడ్డ అరుణ, అచ్చ నాగమణి, శ్రీహరి యాదవ్, దేశం మహేష్ గౌడ్, దత్తాత్రేయ, బట్టు శ్రీధర్, వజ్జ ధనుంజయ, కరుణాకర్ ముదిరాజ్, జైహింద్ గౌడ్, అశోక్ పోచం, నాగేందర్ గౌడ్, నిమ్మల వీరన్న, అంబాల నారాయణ గౌడ్, అశోక్ యాదవ్, కిరణ్ కుమార్, గుండ్రాతి శారద గౌడ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, సంజీవ్ నాయక్, రాంచందర్ నాయక్, హరిప్రసాద్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, లింగం శాలివాహన, రత్నం చారి, ఐలేశ్ యాదవ్, గంటా రాములు యాదవ్, రాజు గౌడ్, మధు, నాగారపు సత్యం యాదవ్, గిరబోయిన శ్రీనివాస్ యాదవ్, పోతరబోయిన రాజయ్య, బద్దుల రాజ్ కుమార్, నానబోయిన రవి, దాసరి కోటి తదితరులు పాల్గొనగా పోచబోయిన శ్రీహరి యాదవ్ వందన సమర్పణ తెలిపారు.


ఎండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు