పోలవరం రాష్ట్రానికి వరం అనుకున్నా - జగన్ శాపంగా మారి అస్తవ్యస్థం చేశాడు

                 


 పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు

హెలికాప్టర్ లో చేరుకున్న చంద్రబాబు నాయుడు బస్సులో ప్రాజెక్టు ప్రాంతం కలియ తిరిగాడు

     అధికారులతో సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు

     2019లో టీడీపీ గెలిచి ఉంటే 2020 చివరి నాటికి పోలవరం పూర్తయ్యేదని వెల్లడి

కానీ ఇప్పటి పరిస్థితుల్లో మరో నాలుగేళ్లు పడుతుందని వివరణ

రాజకీయాల్లో ఉండడానికే అర్హత లేని వ్యక్తి వల్ల ఇలా జరిగిందని వ్యాఖ్యలు

 జగన్ ఓ శాపంలా మారాడు...



ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అధికారులతో కలిసి ప్రాజెక్టు అంతా కలియదిరిగిన ఆయన... అక్కడి పరిస్థితులు చూసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2019లో తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి 72 శాతం పనులు పూర్తయితే, ఈ ఐదేళ్లలో నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం తాజా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు... అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. 


"పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక వరం అని భావించి ఆ రోజు శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానం చేయగలిగితే కరవు అనే మాట లేకుండా పోతుందని ఆలోచించి నాడు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాం. 



2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది, ఢిల్లీలో ఎన్డీయే గెలిచింది. నాకున్న అనుభవంతో, ముందుచూపుతో పోలవరంపై ముందడుగు వేశాం. ఆ సమయంలో పోలవరం ముంపుకు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ ఏడు మండలాలు మనకి ఇవ్వకపోతే పోలవరం ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. 


2014లో జూన్ 2న రెండు రాష్ట్రాలు విడిపోయి నోటిఫై అవుతాయి... ఒక్కసారి నోటిఫై అయ్యాక, తెలంగాణ ఒప్పుకుంటేనే ఆ ఏడు గ్రామాలు ఏపీలో కలుస్తాయి. అందుకే, రెండు రాష్ట్రాలు నోటిఫై కాకముందే, పట్టుబట్టి మరీ కేంద్రం ద్వారా ఆ ఏడు మండలాలు ఏపీలో కలిసేలా చేశాను. 


నాడు రాష్ట్రపతికి నచ్చచెప్పి ఆర్డినెన్స్ తీసుకువచ్చాం. దేశ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం. ఆ ఆర్డినెన్స్ ద్వారానే ఏడు మండలాలు ఏపీలో కలిశాయి. ఆ ఏడు మండలాలు ఏపీలో కలిశాయి కాబట్టే, పోలవరం ప్రాజెక్టును కట్టగలిగాం. 


పోలవరం ప్రాజెక్టు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. 2005లో ఈ ప్రాజెక్టును వైఎస్ ప్రారంభించగా, అప్పుడే అవకతవకలు వచ్చాయి. కాంట్రాక్టులను రద్దు చేయడంతో ప్రాజెక్టు అటకెక్కింది. దాంతో వాళ్లు కోర్టుకెక్కారు. ఇటు  భూసేకరణ సందర్భంగా కొందరు కోర్టుకెళ్లారు. రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ తవ్వకాల అంశంపైనా కొందరు కోర్టుకెళ్లారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో టెండర్లు పిలిచారు. చివరికి 2014లో రాష్ట్ర విభజన జరిగాక దీన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు. 



1940 ప్రాంతంలోనే బ్రిటీష్ వాళ్లు ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేశారు. అప్పటి నుంచి ఇది ముందుకీ, వెనక్కీ ఊగిసలాడుతోంది. అప్పట్లో  300 నుంచి 700 టీఎంసీల సామర్థ్యంతో బాగా ఎత్తు పెంచి కట్టాలనుకున్నారు. కానీ, చివరికి 45.72 మీటర్ల ఎత్తుతో 194 టీఎంసీల సామర్థ్యంతో పోలవరం సాధ్యమైంది. వరద నీటితో కలుపుకుని 320 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. 


ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకే కాదు, కరవు ప్రాంతమైన రాయలసీమకు కూడా నీటిని అందించే వెసులుబాటు ఉండేది. ఈ ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 15 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయొచ్చు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ డిశ్చార్జి సామర్థ్యం కంటే ఇది ఎక్కువ. 


ఇప్పుడు నా  బాధ అంతా ఏంటంటే... రాజకీయాల్లో ఉండడానికే అర్హత లేని ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి, రాష్ట్రానికి ఒక శాపంలా మారాడు. అందుకు పోలవరం ఒక ఉదాహరణ. ఇది ఒక కేస్ స్టడీ వంటిది. ఇలాంటివి చాలా జరిగాయి. పోలవరం విషయంలో జరిగింది తప్పు కంటే పెద్దది. చిన్న తప్పు చేశాడనుకుంటాం... కానీ క్షమించరాని నేరం ఇది. 


నేను దాదాపు 30 సార్లు పోలవరం సందర్శించి ఉంటాను. ఇవాళ 31వ సారి వచ్చాను. నా మనసంతా ఈ ప్రాజెక్టు మీదనే ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడేది నేనే. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు. వైసీపీ ప్రభుత్వం వస్తూనే రివర్స్ టెండరింగ్ అన్నారు. కంపెనీలను పంపించేశారు, స్టాఫ్ నంతా మార్చేశారు. ఎవరికీ తెలియని వ్యక్తులను పోలవరంలో పెట్టేశారు. 



గోదావరికి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తాయో అందరికీ తెలుసు. 2019, 2020లో వరదలు వచ్చాయి. డయాఫ్రం వాల్ తీవ్రంగా దెబ్బతింది. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రం వాల్ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. ఇక, రూ.550 కోట్లతో పైనా, రూ.250 కోట్లతో కింద కాఫర్ డ్యామ్ లు నిర్మించారు. 


వీళ్లు చేసిన నిర్వాకం ఏంటంటే... చివరి గ్యాప్ ను పూడ్చలేదు. ఆ సమయంలో పనుల నిర్వహణ ఏజెన్సీ లేదు, ఇంజినీరింగ్ సిబ్బంది లేరు. దాంతో వరద కారణంగా ఆ ఇసుక అంతా కొట్టుకుపోయింది. 250 మీటర్లు ఉండే గ్యాప్-1 బండ్ లో 150 మీటర్లు కొట్టుకునిపోయింది. ఇప్పుడు అక్కడ ఇసుక కొట్టుకుపోయింది కాబట్టి బయటి నుంచి ఇసుక తీసుకువచ్చి నింపుతున్నారు. వ్యయం ఎంతవుతుందనేది తెలియదు. ఒక రూ.2 వేల కోట్లు అవుతుందా, మరెంత అవుతుంది? అనేది తెలియదు. 


ఇవాళ ఇవన్నీ పరిశీలించిన తర్వాత, ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఎన్నేళ్లు పడుతందని అడిగాను. ఆ రోజు గనుక ప్రాజెక్టు పనులు కొనసాగి ఉంటే 2020 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేదని అధికారులు చెప్పారు. ఇప్పుడు ఐదేళ్లు గడిచిపోయాయి. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందంటే... కనీసం నాలుగు సీజన్లు కావాలని అంటున్నారు. నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్లు. అది కూడా అన్నీ సవ్యంగా జరిగితేనే. ఒక వ్యక్తి రాష్ట్రానికే శాపంలా ఎలా మారతాడనేదానికి ఇదే ఉదాహరణ" అని చంద్రబాబు వివరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు