ఆర్థిక వ్యవస్థ ఒక సమీక్ష

 

మన ఆర్థిక వ్యవస్థ ఒక సమీక్ష

నిన్న ఆంధ్రజ్యోతిలో పూర్వ భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం వ్రాసిన ఒక వ్యాసం మరియు చివరి పేజీలో ఫ్రెంచి ఆర్థిక శాస్త్రవేత్త థామస్ పికెట్టే మన దేశంలో ఉన్న అసమానతల గురించి చేసిన పరిశోధన విషయాలు మరియు మన దేశ అసమానతలను రూపుమాపేందుకు కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు  చేసిన సూచనలు ప్రచురితమయ్యాయి. 

చిదంబరం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేసిన నాలుగు వాగ్దానాల గురించి వ్రాశారు. ఆ వాగ్దానాల నిలుపు కొనుటకు కావలసిన వనరుల అంచనా మరియు వాటి సేకరణకు పికెట్టే చేసిన సూచనల యొక్క సాధ్యాసాధ్యాలు ఈ వ్యాసంలో విశ్లేషిద్దాం. 

కాంగ్రెస్ చేసిన మొదటి వాగ్దానం 30 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో సృష్టించడం మరియు పూర్తిగా భర్తీ చేయడం. ఒక్కొక్క ఉద్యోగానికి సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందనుకుంటే ఈ ఒక్క ప్రమాణ పూర్తికే 3 లక్షల కోట్ల రూపాయలు సవత్సరానికి అవసరమవుతాయి.

ఇక రెండవ వాగ్దానం ఏమిటంటే ప్రతి సంవత్సరం ఒక కోటి మందికి లక్ష రూపాయల స్టైపెండ్ ఒక్కొక్కరికి ఇస్తూ వారి యొక్క నైపుణ్యాల్ని అభివృద్ధి చేయడం. దీని కోసం లక్ష కోట్లు అవసరం. 

మూడవ ప్రమాణం రైతులందరికీ ముఖ్యంగా గోధుమ వరి పండించే రైతులకు కనీస మద్దతు ధర ఎంఎస్ స్వామినాథం సూచించిన విధంగా ఖర్చుపై 50 శాతం కలిపి ఇవ్వడం. ఆంధ్రజ్యోతిలోనే ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య రాసిన ఒక వ్యాసంలో ఈ విధంగా మద్దతు ధర ఇవ్వాలంటే 1000 నుండి 1400 రూపాయలు అదనంగా ఇవ్వాల్సి వస్తుందని గణాంకాలు ద్వారా వివరించారు. దేశంలో 2023 సంవత్సరంలో 330 కోట్ల క్వింటాళ్ల ధాన్యం పండించారు. ఈ లెక్క ప్రకారం ఒక్కొక్క క్వింటాలకు కనీసం1000 రూపాయలు పెంచిన,  ప్రతి సంవత్సరం 330000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది 

ఇక నాలుగవ వాగ్దానం ప్రకారం బీద కుటుంబాలలో ప్రతి మహిళకు ప్రతి సంవత్సరము లక్ష రూపాయలు ఇవ్వడం. చిదంబరం గారు తెలియజేసినట్టు దేశంలో 50% బీదరికంలో ఉన్నారు. దేశంలో ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్య 24 కోట్లు. ఇందులో సగం అంటే 12 కోట్ల కుటుంబాలు. అనగా 12 కోట్ల మహిళలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాల్సి వస్తే 12 లక్షల కోట్ల అదనపు ఖర్చు అవుతుంది. 

ఈ మొత్తం నాలుగు వాగ్దానాలను పూర్తి చేయాలంటే 19 లక్షల 30 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. 

2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయము 42 లక్షల కోట్ల అయితే ఖర్చు 45 కోట్ల ఖర్చు చేయబడింది. 10 లక్షల కోట్లు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించబడ్డాయి. మిగతా కేటాయింపులు వేటిలో కూడా తగ్గించేందుకు వీలు లేదు. కాబట్టి కాంగ్రెస్ ఆ వాగ్దానాలు నిలుపుకోవాలి అంటే అభివృద్ధికి కేటాయించిన పది లక్షల కోట్ల కన్నా ఇంకా అదనంగా తొమ్మిది లక్షల కోట్లు కావాలి. కానీ అభివృద్ధికి కేటాయించిన పది లక్షల కోట్లను కూడా తగ్గిస్తే అభివృద్ధి జరగదు కాబట్టి అది కూడా వీలు లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రస్తుతము కేంద్ర ఆదాయం ఖర్చులు పోలిస్తే అదనంగా కాంగ్రెస్ వాగ్దానాలను నిలుపుకునేందుకు అవకాశం అది తక్కువగా ఉంది.

కానీ ఇప్పుడు పీకెట్టే చేసినటువంటి సూచన ప్రకారము నికర ఆదాయం 10 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న భారతీయుల మీద అదనంగా రెండు శాతం టాక్స్ మరియు వారసత్వంగా వచ్చిన ఆస్తులు 10 కోట్ల కన్నా మించితే దానిమీద 33% టాక్స్ వెయ్యాలి. ఈ విధంగా వేయగలిగితే మన జిడిపిలో అదనంగా 2.73 శాతం అదనపాదాయం  కేంద్ర ప్రభుత్వానికి చేకూరుతుంది. ఈ అదనపు ఆదాయము 8 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు నిలుపుకునేందుకు 19 లక్షల కోట్లు కావాలి. ఇది 10 లక్షల కోట్లు తక్కువ. అంతమందం అభివృద్ధి కేటాయించిన పది లక్షల కోట్లలో కోత పెట్టాల్సి ఉంటుంది. ఇది శ్రేయస్కరం కాదు. 

కానీ ఈ విధంగా చేయాలంటే ఇప్పుడు అదనంగా ఈ పన్నులు ఎవరి మీద వేయాలి ఎలా వేయాలి అనే దాని మీద చాలా చర్చ జరగాల్సి ఉంది. కొందరు వారసత్వంగా వచ్చిన ఆస్తి 10 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే దానిమీద ఐదు శాతం టాక్స్ వెయ్యాలని. లేక ఇప్పుడు అత్యధికంగా సంపాదిస్తున్నటువంటి వేల కోటీశ్వరులు వందల కోటీశ్వరులు మీద ఎక్కువ టాక్స్ వసూలు చేయాలని సూచనలు అయితే చేస్తున్నారు. 

ఒకవేళ ఈ విధంగా అదనంగా పన్నులు వసూలు చేసి కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు తీర్చుకోగలిగితే అదనంగా కోటి కుటుంబాలకు అదనపాదాయం సమకూరి సమానత్వం కొంతైనా సాధింపబడుతుందనేది నిజం. 

కానీ నేను ఇదివరకే ఒక వ్యాసంలో రాసినట్టు ఇప్పటి ఆర్థిక వ్యవస్థ అంతా 30% మధ్యతరగతి ఉన్నత తరగతి ప్రజల గురించి విధానాలు చేయబడడం అమలు చేయబడడం మిగతా డెబ్బై శాతం దగ్గర దానికి సంబంధించిన శ్రమ దోపిడీ జరుగుతుంది. ఈ  వ్యవస్థను తిరిగి రాయగల సమర్థత మరి కాంగ్రెస్ గాని కాంగ్రెస్ ఉన్న ఇండియా కూటమికి  ఉందా అన్నది సంశయమే.

నిజంగా ఒకవేళ ఈ నాలుగు వాగ్దానాలు సాధ్యం చేయగలిగితే ఆర్థిక శాస్త్రంలో చెప్పినటువంటి మల్టీప్లెయర్ ఎఫెక్ట్ ద్వారా మన దేశం  మరి మోడీ చెప్పినట్టు 25 ఏండ్లలో 50 ఏండ్లలోనో కాకుండా ఇప్పటికన్నా ఎక్కువ వేగంగా ఎక్కువ సమానత్వంతో  అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

కానీ ప్రస్తుత పరిస్థితులలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉంది కాబట్టి 30 లక్షల ఉద్యోగాలు అంటే 3 లక్షల కోట్లు అదనంగా సమకూర్చుకోవడం ద్వారా గాని లేదా ఇప్పుడు ఉన్న ఖర్చుల కేటాయింపుల ప్రాముఖ్యతను మార్పులు తేవడం వల్ల గాని సాధ్యమవుతుంది. తద్వారా ఎంతో కొంత సమానత్వం పెరిగా అవకాశాలుంటాయి. నిరుద్యోగుల్లో ఉన్నటువంటి నిస్పృహలు సాంఘిక ఘర్షణలకు దారి తీయకుండా ఉంటాయి.

కానీ పాత పద్ధతిలోనే ఆర్థిక వ్యవస్థను నడపాలి అంటే మాత్రం అది అవివేకము మరియు ఆత్మహత్యా సదృశ్యమే. 

 ఒకవేళ తిరిగి మళ్లీ భారతీయ జనతా పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేటట్టుంటే తమ యొక్క ప్రాధాన్యతలను పైన వివరించిన పరిస్థితుల దృష్ట్యా పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


డాక్టర్ ఎంహెచ్ ప్రసాదరావు 

విశ్రాంత సాంకేతిక విద్య శాఖ అధిపతి 

9963013078 

కెపిహెచ్బి కాలనీ 6th phase 402 హైదరాబాద్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు