నేను చూసిన ఎన్టీఆర్..సురేష్ కుమార్ ఎలిశెట్టి

 

నేను చూసిన ఎన్టీఆర్..


(ఎంతమందిలో ఉన్నా 

తారక రామారావు 

నన్ను పోల్చి

దగ్గరికి పలిచేవారన్న 

తృప్తితో..గర్వంతో 

ఆయన జయంతి సందర్బంగా ఆయనతో 

నా అనుభవాలను 

అక్షరబద్ధం చేస్తూ

ఈ వ్యాసం రాశాను..)


చెప్పండి బ్రదర్..

మంద్రగంభీర స్వరం వినిపించింది..అప్పటికి ఏదో దినపత్రిక తిరగేస్తున్న నేను ఉలిక్కిపడి అలా బ్రదర్ అన్న వ్యక్తి వైపు చూసాను..


అది ఎన్టీఆర్..!


ఇది జరిగింది విజయనగరంలోని అశోక్ బంగ్లాలో..విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా అదే..

అప్పుడు రామారావు సిఎం కాదు..మాజీ..!


అశోక్ బంగ్లాకి ఎన్టీఆర్ వచ్చారని తెలిసి కలుద్దామని వెళ్ళాను..చెక్క మెట్లు ఎక్కి పైకి వెళ్లేపాటికి ఆ ఎడమ పక్కన గదిలో గద్దీపై రామారావు కూర్చుని ఉన్నారు.చుట్టూ విజయనగరం జిల్లా తెలుగుదేశం నేతలు ఉన్నారు.నేను వెళ్లి ఎన్టీఆర్ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాను.


ఆయన బాసిం పట్టు వేసి ధ్యానంలో ఉన్నారు.

ఈలోగా ఏదో ఫోన్ వస్తే అశోక్ గజపతి..ఆయన వెంట మిగిలిన జనం బయటకు వెళ్లారు.గదిలో ఎన్టీఆర్..ఆయన ఎదురుగా

నేను ఇద్దరమే ఉన్నాం.ఆయన 

ధ్యానముద్రలో ఉన్నారు కదాని నేను పేపర్ చదువుతున్నాను.ఈలోగా ఆయన ధ్యానం ఎప్పుడు పూర్తయిందో నన్ను చూసి *_చెప్పండి బ్రదర్_* అన్నారు..నేను తేరుకొని చూసేటప్పటికి ఆయన నావైపు చూసి నిర్మలంగా నవ్వారు.మీతో మాటాడాలి సార్..ఇంటర్వ్యూ అన్నాను.. ఓకె బ్రదర్..అడగండి నేను రెడీ  అన్నారు..దగ్గరికి రమ్మని పక్కనే కూర్చోబెట్టుకున్నారు.. చాలాసేపు మాటాడాను ఆరోజు..


అసలు నా కెరీర్ ప్రారంభంలో నేను కవర్ చేసిన మొదటి మేజర్ కార్యక్రమం ఎన్టీఆర్ పర్యటనే..విజయనగరం జిల్లా భద్రగిరి ఏజెన్సీలో ఎన్టీఆర్ టూర్..ఒక రోజంతా ఆయనతోనే..భోజనం కూడా

ఆయనతో సహపంక్తి..!


వృత్తి జీవితంలో చాలాసార్లు ఎన్టీఆర్ని చూసాను..దగ్గర నుంచి..ఆయన మీటింగులు కవర్ చేశాను..


బొబ్బిలిలో ఎన్టీఆర్ వివేకానందుడి గెటప్పులో హెలికాప్టర్ దిగినప్పుడు మొదట గమనించింది నేనే..

అరె..ముఖ్యమంత్రి కొత్త అవతారంలో దిగారు చూడండి అనగానే అందరూ అటు తిరిగి టకటకా కెమెరాలు క్లిక్ అనిపించారు.


ఇంకోసారి తగరపువలస నుంచి విజయనగరం వరకు 

ఎన్టీఆర్ చైతన్యరధం వెంట మోటార్ సైకిల్ పై తిరిగి కవర్ చెయ్యగా విజయనగరం అయోధ్యమైదానం సభలో కొంచెం వెనక ఉన్న నన్ను ఎన్టీఆర్ గుర్తు పట్టి 

ఇది మీ ఊరు బ్రదర్..ముందుకు రండి..అని పిలిచారు.


ఆ తర్వాత కొంచెం విశ్రాంతి అనంతరం ప్రెస్ మీట్.. అప్పటికి ఉదయం నుంచి జరిగిన పర్యటన కార్యక్రమం వార్తని విజయనగరం ఇండియన్ ఎక్స్ప్రెస్..

ఆంధ్రప్రభ కార్యాలయంలో ఇచ్చి భోంచేసి వెళ్లేపాటికి చైతన్యరధంలోనే ప్రెస్ మీట్ మొదలైపోయింది.నేను లోపలికి వెళ్ళేటప్పటికి కూర్చోడానికి ప్లేస్ లేదు..నుంచుని రాసుకుంటుంటే ఎన్టీఆర్ చూసి పక్కనే కూర్చుని ఉన్న కలెక్టర్ తో బ్రదర్ నిలబడి ఉన్నారని కళ్లతోనే మీరు లేచి ఆయనకు ప్లేస్ ఇవ్వండని ఆదేశించారు. అంతే..

కలెక్టర్ బయటికి..

నేను ఎన్టీఆర్ పక్క 

ప్లేస్ లోకి..!


అప్పుడు చూసాను..

ఎన్టీఆర్ మొహాన్ని దగ్గర నుంచి..ఏప్రిల్ నెల ఎండలో ఉదయం నుంచి తిరిగిన 

అలసట మాయమై..కాస్త నల్లబడిన మోము మళ్లీ వెలిగిపోతోంది.ఆశ్చర్యపోయాను..!



బయటికి వచ్చాక డ్రైవర్ని అడిగాను..ఈ గ్యాపులో మేకప్ వేసుకున్నారా అని..

దానికి డ్రైవర్ చెప్పిన వివరణ ఆశ్చర్యపరిచింది.

లేదు సార్..ఎంతగా 

కమిలినా కాసేపు పడుకుంటే

మళ్లీ ఫ్రెష్ అయిపోతుంది సార్ ఆయన ఫేస్..యోగా ఎఫెక్ట్ అన్నాడు..!


ప్రజాదర్బార్..ఇత్యాది కార్యక్రమాల్లో ఎన్టీఆర్ అవగాహన..జ్ఞాపకశక్తి..

ప్రజాసమస్యలు..సంక్షేమం పట్ల ఆయన చిత్తశుద్ధి దగ్గర నుంచి గమనించాను.


విజయవాడలో ఆంధ్రప్రభ బ్యూరోలో పనిచేసినప్పుడు 

వరసగా కొన్ని మీటింగులు

ప్రధాని పివి నరసింహారావు..

ముఖ్యమంత్రి ఎన్టీఆర్..

ఇద్దరివీ కవర్ చేశాను. 

పివి ఎంతో మంద్ర స్వరంతో జనాలకు తాను అమలు చేసిన ఆర్థిక సంస్కరణల

గురించి చెప్పేవారు.విన్న జనం ఆహా అనుకునేవారు.

ఆ రోజో.. మర్నాడో అదే ప్రాంతంలో ఎన్టీఆర్ బహిరంగ సభ..ఆయన వాగ్ధాటికి జనం ఫిదా అయిపోయి ముందు పివి చెప్పినవి

మర్చిపోయినట్టు అయిపోయేవారు.


ఒకసారి ఇలాగే 

ఒక పర్యటనలో ముందు ఎక్కడో ఎన్టీఆర్ రథం.

వెనక ప్రెస్ వాహనం.

ఒక ముసలావిడ నందమూరిని చూసేందుకు రొప్పుకుంటూ  పరిగెత్తి వెళ్తుంటే అడిగాను..

ఎందుకమ్మా అలా పరిగెడుతున్నావు.నీకేమైనా అయితే ఎలా అని..పోతే ప్రాణమేగా..

ఆ మహానుభావున్ని చూసే అవకాశం మళ్లీ వస్తుందా అంది..స్పెల్ బౌండ్..!


అదే పర్యటనలో 

ఒక పాకలోని బడ్డీలో ఎన్టీఆర్  కలిసి ఆయన స్వయంగా తన చేత్తో ఇవ్వగా 

గాజు గ్లాసులో వేడి టీ తాగిన అనుభవం..నిజానికి ఆయన తాగబోతూ ఉన్న గ్లాసుని నన్ను చూసిన వెంటనే నాకు ఇచ్చి ఆయన వేరే గ్లాసుతో తెప్పించుకుని తాగారు.


అంతకు ముందు విశాఖ జూలో తెల్లవారుజామున అయిదు గంటలకు విశాఖ..విజయనగరం ప్రెస్ రిపోర్టర్స్ కు ముఖ్యమంత్రి రామారావుతో కలిసి అల్పాహారం..పేరుకే అల్పాహారం కాని అది ఎన్టీఆర్ స్థాయిలో..స్టైల్లో ఘనమైన ఆహారం.పొద్దునే కోడి తినేవారని..

పెద్ద చెంబుతో గుమ్మపాలు తాగుతారని సినిమా రోజుల నుంచి విన్న కధనాల 

ప్రత్యక్ష ప్రసారం 

ఆ రోజు చూసాను.


అయితే ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత కొన్ని నచ్చనివి కూడా కంటపడ్డాయి.


లక్ష్మీపార్వతితో కలిసి బహిరంగ సభల్లో పాల్గొన్నప్పుడు కొంచెం వెకిలిగా మాటాడిన..

ప్రవర్తించిన ఉదంతాలు కళ్లబడ్డాయి..ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులు..తెలుగుదేశం కలిసి పోటీ చేయగా బహిరంగ సభకు పార్వతి 

ఎరుపు..పసుపు రంగులు కలిసిన చీర కట్టి వస్తే

చూసారా..నా ఇల్లాలు

తెలుగుదేశం..వామపక్షాల మైత్రికి ప్రతీక అంటూ వేదికపైనే ఆమెకు కితకితలు పెట్టినట్టు చెయ్యడం 

కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది.అలాగే లక్ష్మీపార్వతి కృష్ణా జిల్లా అంటే తనకి ప్రత్యేక అభిమానం అన్నప్పుడు

ఔను.. ఇది ఆమె అత్తవారి జిల్లా కదాని చలోక్తి విసిరితే జనం ఇబ్బందిగా నవ్వలేక నవ్వారు.


అంతకంటే ఇబ్బందికరమైన సన్నివేశాలు విజయవాడ కెనాల్ గెస్ట్ హౌస్ ప్రెస్ మీట్లో జరిగాయి.ఎన్టీఆర్ ప్రెస్ మీట్లో

ఉన్నప్పుడు లక్ష్మీపార్వతిని

పిలిచి ప్రెస్ వాళ్ళకి పరిచయం చేశారు.

అప్పుడే తలస్నానం చేసిన 

పార్వతి తల తుడుచుకుంటూ వచ్చారు.

పెద్దాయన ఇల్లాల్ని అందరి ముందు దగ్గరికి తీసుకుని 

ఈమె నా ఇల్లాలు లక్ష్మి అని పరిచయం చేశారు.ఆ క్షణంలో మాత్రం ఎందుకో ఎదురుగా ఉన్నది మనం చూసిన..ఎరిగిన ఎన్టీఆర్ కాదని అనిపించింది.ఈలోగా పార్వతి మా అబ్బాయి మిమ్మల్ని తన స్నేహితులకు 

చూపించడానికి వచ్చాడని అన్నారు.రమ్మని 

అంటూ అతగాడు లోపలికి నాలుగైదు సార్లు విడతల వారి తీసుకువచ్చిన ప్రతిసారీ  లేచి నిల్చుని పరిచయం చేసుకున్నారు.అది ఆయన మర్యాదే కావొచ్చు. 

కాని పరిశ్రమలో..

రాజకీయాల్లో మకుటం లేని మహారాజులా వెలిగిపోయిన రామారావు అప్పుడెందుకో

వింతగా కనిపించారు.


ఇక చివరి ఎపిసోడ్..

1995లో చంద్రబాబు నాయుడు అప్పటికే గవర్నర్ కు తన వెంట వచ్చిన ఎమ్మెల్యేల జాబితా ఇవ్వడం..వైస్రాయ్ హోటల్లో అవమానం..ఇత్యాది ఘటనలు జరిగిన తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ప్రజల్లోకి వెళ్తా అని బహిరంగ సభల నిమిత్తం శ్రీకాకుళం బయలుదేరారు.

ఫలక్నుమా ఎక్స్ప్రెస్..

విజయవాడలో పని చేస్తున్న నాకు హైదరాబాద్ ఎడిటర్ నుంచి ఫోన్..ఎలాగైనా ట్రైన్లో ఎన్టీఆర్ని కలిసి మాటాడమని..

కష్టమని నాకు తెలుసు..

కాని ప్రయత్నం చెయ్యమని నాలోని జర్నలిస్టు ఉద్భోధ..పైగా అది ఎడిటర్ ఆదేశం.విజయవాడ స్టేషన్ కి చేరుకున్నాను.రాత్రి 9.45..

స్టేషన్ ఎన్టీఆర్ అభిమానులతో కిక్కిరిసి ఉంది.పైగా కంకిపాడు ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ ఎన్టీఆర్ వెంటే ఉండిపోయారు.


ఎన్టీఆర్ సెకండ్ ఎసిలో ఉన్నారు.స్టేషన్ వచ్చిందని తెలిసి అభిమానులకు అభివాదం చెయ్యడానికి డోర్ వద్దకు వచ్చారు.ఆయన్ని చూసి అభిమానులు పెద్ద3 ఎత్తున నినాదాలు చేశారు.

కొందరైతే ఏడుపులు మొదలుపెట్టారు..

ఆ కోలాహలంలో 

నా తాపత్రయం నాది.

ఎన్టీఆర్ని చేరడం ఎలా..

అదే సమస్య.

ఈలోగా భోగీ ఇవతల గోరంట్ల బుచ్చయ్య చౌదరి కనిపించారు.ఆయనతో చెప్పాను..పెద్దాయనతో

మాటాడాలని..


ఆయన అన్నారు..ఇప్పుడెందుకు ఆయన్ని కదుపుతారు.అసలే బాధలో ఉన్నారని..


మీరు చెప్పండి  చౌదరి గారు..

ఆయన సందేశాన్ని ఆయన కంటే ముందు ప్రజల్లోకి తీసుకువెళ్తాం కదాని..

సరే ప్రయత్నిస్తా..అని చౌదరి

లోపలికి వెళ్ళి అటు తలుపు వద్దకు చేరారు..వెంటనే ఎన్టీఆర్ లోపలికి కదిలారు.

నాకు అర్థమైంది. మాటాడ్డానికి ఒప్పుకున్నారని.వెంటనే ఇటువైపు ద్వారం నుంచి సెక్యూరిటీని తోసుకుంటూ

లోపలికి వెళ్ళాను.నాతో పాటు ఇంకో నలుగురైదుగురు 

ప్రెస్ వాళ్ళు.


అటు నుంచి ఎన్టీఆర్..

ఇటు నుంచి నేను 

ఒకేసారి కుపే వద్దకు చేరాం.ఆయన బెర్త్ పై కూర్చుని ఎదురుగా బెర్తుపై కూర్చొమ్మని చెయ్యి చూపించారు.ఎన్టీఆర్..నేను ఎదురెదురుగా..నా పక్కన ఎన్టీఆర్ చివరి కొడుకు జయశంకర కృష్ణ..నిలబడి బుచ్చయ్య చౌదరి..

దేవినేని నెహ్రూ..

కొంచెం అటుగా కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీ పార్ధసారధి భాస్కర్..ఆమె వెనక దూరంగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది.

కాసేపు నిశ్శబ్దం.చెప్పండి సార్...అన్నాను..ఆయన తాను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను అన్నప్పటి నుంచి మొదలుపెట్టి చెప్పడం ప్రారంభించారు.ఈలోగా మా ప్రెస్ వాళ్ళలో ఒకాయన అది కాదు సార్..ఇప్పుడు ఏం చేయదలచుకున్నారో అది చెప్పండి..అనబోయారు..

వెంటనే ఎన్టీఆర్ కోపంగా మేము మాటాడుతున్నాంగా మీరు ఆగండని.. గాండ్రించారు.

మళ్లీ మొదలుపెట్టి చెబుతున్నారు.ఈలోగా ట్రెయిన్ కదులుతుంది అన్నారు కలెక్టర్..మేము మాటాడుతుంటే ఎలా కడులుతుందన్నారు ముఖ్యమంత్రి కోపంగా..

ఎవరో చెయిన్ లాగారు.

అలా మూడుసార్లు లాగవలసి వచ్చింది.మొత్తం గంటన్నర పైగా సాగిన ఇంటర్వ్యూ.. ఆసారి పార్వతి లేకుండా బయలుదేరిన ఎన్టీఆర్ తాను చంద్రబాబును 

ఎందుకు పార్టీలోకి తీసుకుని

అందలం ఎక్కించింది..పదవి లేని సమయంలో తన పట్ల కుటుంబసభ్యుల తీరు..లక్ష్మీపార్వతిని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది అన్నీ చెప్పారు.అదే సందర్భంలో తన చెయ్యి లేవక అన్నం తినడానికి ఇబ్బంది పడిన సందర్బాలను కూడా 

గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ రెండు చేతులకూ 

తేడా ఉంది..

చూడండి బ్రదర్..అంటూ రెండు చేతులను 

నా ఒడిలో పెట్టారు.

కృష్ణుడిగా..

రాముడిగా..శివుడిగా..

వేంకటేశ్వరస్వామిగా  ఆశీర్వదించే

భంగిమలో ఉండే ఆ హస్తాలు 

ఆ క్షణాన నా ఒడిలో.

ఒక్కసారి వాటిని మనసారా తాకాను.అప్పుడే చూసాను ఆ చేతుల్లోని రేఖలు..

ఒక్కోటి జెర్రి గొడ్డుల్లా ఉన్నాయి.ఇవే కదా ఒక చరిత్ర పురుషుణ్ణి ఆవిష్కరించాయి అనుకున్నాను.


ఆ ఇంటర్వ్యూ ఐటెం హెడ్డింగ్..

*_నా కన్న మంచి నటుడు బాబు.._*

ఆంధ్రప్రభలో..

Babu is better actor than me.._

Indian express lo..

రెండూ బ్యానర్ ఐటమ్స్..


ఆ తర్వాత మళ్లీ 24 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే ఎన్టీఆర్ని మర్నాడు అదే విజయవాడలో చూసాను.

కెనాల్ గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్..ముందురోజు అందంగా గోధుమరంగు ధోవతి.. తెల్ల పంచె.. కండువాలో 

ఎంతో అందంగా..

విశ్వాసంతో కనిపించిన రామారావు కళావిహీనంగా ఉన్నారు.

అందులోనూ నల్ల ప్యాంటు..

చొక్కా.. అప్పటికి శ్రీకాకుళం..వైజాగ్..

రాజమండ్రి..ఏలూరు మీటింగులు ఫెయిల్ .. అంతా చంద్రబాబు నాయుడు పకడ్బందీ మేనేజ్మెంట్..తర్వాత విజయవాడ మీటింగు కూడా ప్లాప్..ఎన్టీఆర్ అనే వ్యక్తి కోసం గంటలు..రోజుల తరబడి ఎదురుచూసిన

జనం ఆ ట్రిప్పులో ఆయన సభలవైపే చూడలేదు.

ప్రెస్ మీట్ అయిన వెంటనే నేను మా పత్రికా మిత్రులతో అన్నాను.. 

*this is the End of NTR..* అని..


విజయవాడ మీటింగ్ తర్వాత రామారావు హైదరాబాద్ వెళ్లి మర్నాడు గవర్నర్ కి రాజీనామా సమర్పించారు.ఆ తర్వాత ఎక్కువ సమయం ఒంటరిగానే గడిపారు మరుసటి సంవత్సరం జనవరి 18న జనాలకు శాశ్వతంగా దూరమైపోయారు.


సింహం అస్తమించింది..

చరిత్ర పురుషుడు స్వర్గపురికి

తరలి వెళ్ళిపోయాడు.

తలవంచని తెలుగు ఆత్మగౌరవం జీవితాంతం అలాగే బ్రతికి 

అదే పౌరుషంతో 

కన్నుమూసింది..!



సురేష్ కుమార్ ఎలిశెట్టి

         జర్నలిస్ట్

       విజయనగరం

      9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు