నాన్నా..నానీ-వచ్చెయ్యరా..!

 

*_నాన్నా..నానీ_* 
*_వచ్చెయ్యరా..!_*


_ఇది ఓ అమ్మ కథ.._

_ఓ ఇంటి వ్యధ.._

✍️✍️✍️✍️✍️✍️✍️


*_ఈరోజు తప్పిపోయిన పిల్లల రోజు.._*


నేను ఎన్నాళ్ళ నుంచో రాయాలని అనుకుంటున్న ఒక ఉదంతం గురించి రాయడానికి ఇంతకంటే అనువైన సందర్భం 

ఇంకేదీ ఉండదు అనిపించి రాస్తున్నాను..!


ఈ ఉదంతంలో తప్పిపోయింది పిల్లాడు కాదు.. పెద్దవాడే..

కానీ బిడ్డ దూరమైన ఆ తల్లి పేగుకి పిల్లాడు పెద్దవాడైనా

బుడ్డాడే..


నిజానికి ఇది తప్పిపోయిన

కుర్రవాడి కథ కాదు..

బిడ్డ దూరమైన కన్నతల్లి వ్యధ..ఎప్పుడో ఇరవై ఆరేళ్ల క్రితం..అమ్మా ఇప్పుడే అలా బయటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన కొడుకు ఈ రోజుకీ తిరిగి రాలేదు..వెళ్లిపోయిన అబ్బాయి డాక్టర్..

ఎంబిబిఎస్ పూర్తి చేసి 

ఉన్నత విద్య కోసం

అమెరికా వెళ్ళడానికి సిద్ధమవుతున్న ఆ కుర్రాడు

ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో..!


ఆ తల్లికి ఇద్దరు కొడుకులు..

ఒక కూతురు..ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 

ఈ డాక్టర్ ఆ తల్లి సంతానంలో 

అందరికంటే చిన్నవాడు.

చురుకైన వాడు..

ఆపై మంచి అందగాడు..


విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తి  చేసి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలని లక్ష్యం.తండ్రికి అంత స్థోమత లేకపోయినా బిడ్డ భవిష్యత్తు కోసం..సరేలే అమెరికాలో చదువుదువు గాని అని భరోసా ఇచ్చారు.అయితే మధ్యతరగతి ఉద్యోగి అయిన నాన్నపై అంత భారం

మోపడం ఇష్టం లేని 

ఆ కుర్రాడు తన తెలివితేటలపై

నమ్మకం పెట్టుకుని 

అర్హత పరీక్షలకు 

సిద్ధం అయ్యాడు.


ఆ రోజు దగ్గరికి వచ్చింది..

తెల్లారితే సింగపూర్ ప్రయాణం.అక్కడ పరీక్ష రాసి

అర్హత మార్కులు తెచ్చుకోగలిగితే 

పిజీ సీటు వస్తుంది.

ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు 

పూర్తయ్యాయి.


తండ్రి ఊళ్ళో లేరు.

మద్రాస్ వెళ్లిన ఆయన మర్నాడు కొడుకు ప్రయాణం ఉంది కదాని రాత్రి రైలులో 

తిరిగి వస్తున్నారు.

తల్లి కొడుక్కి కావాల్సిన అన్నీ సిద్ధం చేసి ఉంచింది.

అక్క..అన్నయ్య తమ్ముడి సర్టిఫికెట్లు..పాస్పోర్ట్ కాపీలు

అతగాడి బ్యాగులో సర్దేసారు.అందరూ కబుర్లలో పడ్డారు.తండ్రి వచ్చాక అందరూ కలిసి భోంచేసి..

తెల్లారి ప్రయాణం కదా

తొందరగా పడుకోవాలని అనుకున్నారు.

ఈలోగా అమ్మా..

ఇప్పుడే అలా బయటికి వెళ్లి వస్తానన్నాడు

డాక్టర్ కొడుకు. ఒరేయ్ తెల్లారి ప్రయాణం..

నాన్న కూడా వచ్చేస్తారు.

రాగానే నిన్నే అడుగుతారు.

ఇప్పుడు బయటికి దేనికిరా అన్న తల్లితో..ఇప్పుడే.. 

అలా సెంటర్ వరకు 

వెళ్లి వస్తానని

చెప్పిన పిల్లాడు 

ఎంతకీ రాలేదు.

ఇప్పటికీ రాలేదు..

ఆచూకీ తెలియలేదు..!


ఇది కథ కాదు..నిజం..

అలా వెళ్లిపోయిన డాక్టర్ స్వయంగా నా తమ్ముడు..

అంటే మా పిన్ని కొడుకు.

వాడి పేరు 

*_డాక్టర్ పగడాల మురళీధర్.._*

*_ఎంబిబిఎస్_*

ఊరు వైజాగ్..

1998 లో అలా వెళ్లిన 

మా తమ్ముడు ఈనాటికీ తిరిగి రాలేదు.ఒక చిన్న కబురైనా లేదు..

కనీస సమాచారం కూడా దొరకలేదు..


నాని..(మురళీధర్ని మేమంతా అలా పిలిచే వాళ్ళం..)

వెళ్లిపోయిన కాసేపటికి తండ్రి మద్రాస్ నుంచి తిరిగివచ్చి అడిగిన మొదటి ప్రశ్న..

నాని బాబు ఎక్కడని..

అప్పటికే కలవరపడుతున్న

తల్లి..అన్నయ్య..అక్క బయటకు వెళ్లిన విషయాన్ని మెల్లగా చెప్పారు.నిజానికి అప్పుడు నాని తిరిగి వస్తాడనే అనుకుంటున్నా

పెద్దాయన తిడతారని భయం.


రాత్రి ఎనిమిది..తొమ్మిది.. పది ఇలా గడియారంలో ముళ్లు కదులుతూనే ఉన్నాయి.. ఇంట్లో ఉన్న నలుగురి గుండెలు కొట్టుకుంటూ ఉండగా..!

ఈలోగా మొదలైంది వెతుకులాట..స్నేహితులకి..బంధువులకు ఫోన్లు..

సమాచారం లేదు.

అలా ఆ రాత్రి గడిచిపోయింది.ఆ మర్నాడు

విశాఖ బస్ స్టాండ్లో బండి మాత్రం కనిపించింది.నాని ఆచూకీ లేదు.ఇప్పటికీ

ఒక చిన్న క్లూ కూడా దొరకని దుర్భర పరిస్థితి.


రోజులు..నెలలు.. సంవత్సరాలు భారంగా

గడిచిపోయాయి.వెతకని

దిక్కు లేదు.. మొక్కని దేవుడు లేడు..అడగని సిద్ధాంతి లేడు!


ఈలోగా ఎన్నో జరిగాయి.. చాలా మారాయి..

కానీ ఆ దంపతులు 

ఊరు కాదు కదా

ఉన్న ఇల్లు కూడా మారలేదు.

ఏమో..ఏ క్షణాన కొడుకు తిరిగి వస్తాడో..

ఇల్లు తెలియక గాభరా పడతాడేమోనని ఆలోచన..


అక్కడితో బాధలు అయిపోలేదు..

కొడుకు రాకుండానే..

క్షేమ సమాచారం తెలియకుండానే..

జాడ సైతం దొరక్కుండానే

మా చిన్నాన్న తిరుపతయ్య

కన్ను మూశారు.


ఆ తల్లి...మా పిన్ని ఇప్పటికీ కళ్ళలో ఒత్తులు వేసుకుని..

అదే కళ్ళలో ప్రాణాలు నిలుపుకుని కొడుకు కోసం అనుక్షణం నిరీక్షిస్తునే ఉంది.

అలా వీధి గుమ్మం వైపు చూస్తూ..రాత్రిళ్ళు పడుకోదు.ఒకవేళ మాగన్నుగా కునుకు

పట్టినా చిన్న అలికిడికి సైతం తెలివి వచ్చి నానీ వచ్చాడా..

అదే ప్రశ్న..బయటికి 

వెళ్లి చూడండ్రా..

అదే తాపత్రయం.

ఒక్కరోజు ఊరెళ్ళింది లేదు.

ఒక్క రాత్రి వేరే చోట పడుకుంది లేదు.

ఎక్కడ కొడుకు వచ్చేసి 

తను లేకపోతే తిరిగి వెళ్ళిపోతాడేమోనని బెంగ..

ప్రతి రోజూ..వాడికి నచ్చే టిఫిన్..కూర వండి సిద్ధంగా 

ఉంచుతుంది.


ఇప్పుడు ఆ తల్లి వయసు ఎనభై చేరుతోంది..ముదిమి ఇబ్బంది పెడుతున్నా ఉగ్గబెట్టుకుని రోజులు వెళ్లదీస్తోంది.ఎప్పటికైనా కొడుకు వస్తాడని నమ్మకం.

చూసే వెళ్ళిపోతానని చెప్పిందే చెబుతుంది.


నాని ఉన్నాడని సిద్ధాంతులు

చెబుతున్నారు సరే..మా అందరికీ అలాగే అనిపిస్తుంది.ఉండాలని..

రావాలని మా కోరిక..

కానీ..ఆ తల్లికి నమ్మకం..

లేడేమో అన్న ఆలోచన నిద్రలో కూడా రానివ్వదు.

ఆ మాట మమ్మల్ని ఎవరినీ పొరపాటున కూడా అననివ్వదు..!


నానీ బాబూ..

ఇది నువ్వు చదువుతావో లేదో..అసలు చదివే పరిస్థితిలో ఉన్నావో లేదో..

కాని నువ్వెక్కడ ఉన్నా 

నీ మనసుకి అమ్మ పడే బాధ ఖచ్చితంగా తెలుసు..

ఆ తల్లి ఆవేదన 

నీకు ఖచ్చితంగా తెలుస్తుంది.

ఆమె ఆక్రందన నీకు వినిపిస్తుంది.వచ్చేయ్..

అమ్మ ప్రాణం నీ కోసం అల్లాడుతోంది..ఆ కళ్ళలో దీపం కొడిగడుతోంది..

నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది.హృదయ విదారకంగా రోదిస్తోంది.

ఏ ముచ్చటా లేదు.

అమ్మ మొహంలో నవ్వు చూసి చాలాకాలమైంది.


వచ్చి ఆ కళ్ళలో వెలుగులు నింపు..ప్లీజ్..

నువ్వు రాలేని పరిస్దితుల్లో ఉంటే..కనీసం సమాచారం ఇవ్వు..నువ్వెక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను..


అమ్మకి కనిపించు..

గడిచిపోయిన కాలాన్ని ఎటూ వెనక్కి తేలేము..

మాయమైపోయిన నవ్వు తిరిగి ఇవ్వు..

చివరి రోజులు 

నీతో గడిపేలా చెయ్యి..

రా..తిరిగి రా..

వచ్చి అమ్మ దగ్గరే ఉండిపో..

ఎప్పటికీ ..!


*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

  (9948546286)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు