_బుద్ధుడికి బద్దుడవైతే

 


బుద్ధుడికి బద్దుడవైతే..!


నేడు బుద్ధ పూర్ణిమ


జననమరణాల 

కాలమే తెలియని సన్యాసి..

చక్రవర్తిగా పుట్టి 

సకల భోగాలు అనుభవించి

ముదిమిని..రోగాన్ని...

మరణాన్ని చూసి చలించి

ఐహిక సౌఖ్యాలను త్యజించి

సిద్ధార్థుడు..సిద్ధ అర్ధుడు..

గౌతముడై..బుద్ధుడై..

ఆయన నీతి..నిరతి

*_బౌద్ధమై...పరిశుద్ధమై.._*

*_మానవాళికి ఆచరణయోగ్యమై..!_*


ఆరు దంతాల గజం

గర్భములో చొచ్చినట్టు

కల కాచిన తల్లి..

బిడ్డ భవితపై తల్లడిల్లి..

సిద్దుడైపోతాడని తెలియగా

జగమే చూడని రీతిలో 

పెరిగిన సిద్ధార్థుడు...

ఒకనాటికి సర్వం తెలుసుకుని

చరితార్ధుడయ్యాడు..!


నడిరాతిరి అంతఃపురం 

విడిచిన సిద్ధార్ధుని పయనం..

జగతికి గమనం

అందుకే టకటకమనే 

గుర్రపు డెక్కల రొద

సిద్ధార్ధునికి కటకట కారాదని

దేవతలే శబ్దాన్ని నిశ్శబ్దం చేసి

దైవం ఆగమనానికై

వేలుపుల పిలుపు..

మానవాళికి మేలుకొలుపు..

అదే అదే... 

*_బుద్ధం శరణం గచ్ఛామి..!_*


మగధలో తొలి భిక్షాటన

బింబిసారుని 

సింహాసన తిరస్కరణ..

ముప్పై అయిదేళ్ల ప్రాయంలో జ్ఞానోదయం..

జగతికి ఉషోదయం..

*_బోధి చెట్టు చెప్పిందేమో_*

*_తత్వాల గుట్టు.._*

*_చేర్చి ఆధ్యాత్మిక గట్టు..!_*


బుద్ధుని బోధనలు,శోధనలు

విశ్వవ్యాప్తమై 

వలదనుకున్న

జనకుడే మరణశయ్యపై

కొమరుని బోధనలు విని

తాను సన్యాసిగా మారె

*_సుతుడే గురువై.._*

*_రాజ్యమే బరువై..!_*


స్త్రీలను సైతం బౌద్ధం వైపు 

మరల్చగా బుద్ధుడు..

ఈ సిద్దార్థం..

అందులోని గూడార్థం

అవగతమై..

గౌతముని తత్వమే అప్రతిహతమై..

అర్ధాంగి సైతం సన్యాసిగా 

అవతరించి తానూ తరించె..!


జగమున ఏ వస్తువైనా అనిత్యమని..

అలా భావింప అసత్యమని..

నేననే భావనే భ్రమని..

అజ్ఞానమే దుఖాలకు

హేతువన్న బుద్ధుని బోధ

*_నమ్మితే తీరిపోదా జగమున_*

*_మనుషుల బాధ!_*


_సంభవామి యుగే యుగే.._

బుద్ధుని సూక్తులతో

మానవ జీవితం

నిరంతరం ధర్మం వైపే 

ఆగక సాగాలి 

ఆగే ఆగే..!


**********************

  

   సురేష్ కుమార్ ఎలిశెట్టి

        9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు