సత్ప్రవర్తనాశీలుడనగా ఎవరు?

 


*ఒకానొక సందర్భంలో ఒక నిర్గ్రంధుడు (జైనమత అనుయాయి) బుద్ధభగవానుని యీ విధంగా ప్రశ్నించాడు:* 


 Q1: సత్ప్రవర్తనాశీలుడనగా ఎవరు?

Ans.:ఎవడైతే నిరంతరం నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగివుంటాడో, ఎవడు ప్రజ్ఞాపాటవాలతో కూడిన ప్రవర్తన ఆశిస్తూ, అందుకోసం అన్వేషిస్తాడో వాడే నిజమైన సత్ప్రవర్తనాశీలుడు.


 Q2. జ్ఞాని అంటే ఎవరు?

Ans. సున్నితమైన పద-అర్థ భేదాలపై ఆధారపడకుండా ఎవరైతే స్వేచ్ఛగా, నిర్భయంగా సత్యం పక్షాన నిలబడతాడో వాడే విజ్ఞానవంతుడు


 Q3.గౌరవింపదగిన వ్యక్తి ఎలా వుంటాడు? 

Ans.వయసుమీరి, నడుము వంగి, తల నెరసినంతనే ఒక వ్యక్తి గౌరవానికి అర్హుడు కాలేడు. అతడు మూర్ఖుడు కూడా కావచ్చు; కాని ఎవరైతే ధర్మాన్ని అన్వేషిస్తూ, అవగతం చేసుకుంటారో; ఎవరు తన ప్రవర్తనను అదుపులో వుంచుకొని సంపూర్ణమైన కరుణ, శీల సంపన్నులౌతారో; ఎవరు నర్మగర్భ రహస్యాలను ఛేదించి, పవిత్రులుగా వుండగలుగుతారో వారే గౌరవానికి నిజమైన అర్హులు.


Q4.నిజమైన సౌందర్యం ఎలా వుంటుంది? 

Ans.అలంకారప్రాయమైన పైపై మెరుగుల కోసం ఆరాటపడేవాడు నిజమైన సౌందర్యవంతుడు కాడు. ఎవరి మాటలు, చేతలు పరస్పర విరుద్దాలు కావో; ఎవరు సకల మనోక్లేశాలను సమూలంగా ఛేదిస్తారో, ఎవరైతే ద్వేషాన్ని లేశమాత్రమైనా లేకుండా వదిలించుకుని విజ్ఞానవంతుడౌతాడో అతనే నిజమైన సౌందర్యవంతుడు.


Q5. నిజమైన శ్రమణుడు, భిక్షువు అనగా ఎవరు? 

అసత్యాలాడుతూ కోరికలకు బానిసైన వ్యక్తి గుండు గీయించుకున్నంత మాత్రాన శ్రమణుడు కాలేడు; ఎవరైతే తృష్ణను, స్వార్థపూరిత చింతనను అంతమొందించి ప్రశాంతమైన మనసును పొందుతారో వారే శ్రమణులు.


Q6. ఎవరు నిజమైన జ్ఞానోదయం పొందినవాడు? 

Ans.నిర్ణీతసమయాల్లో భిక్ష కోసం వెళ్ళుతూ, శీలవంతుడనిపించుకోవటం కోసం లేదా సంఘంలో చేరటం కోసం మాత్రమే ప్రవర్తనను మార్చుకునేవాడు భిక్షువు కాదు. అన్నిరకాల పాపాలకు మూలమైనవాటిని త్యజించి, ప్రజ్ఞతో ఎవరైతే సకలక్లేశాలను అంతమొందిస్తారో, ఎవరైతే ఆత్మనిగ్రహంతో పవిత్రజీవితాన్ని గడుపుతారో వారే నిజమైన భిక్షువులు.


Q7. ధర్మాచరణ సంపన్నుడనగా ఎవరు?

Ans.ఎవరి హృదయం మైత్రి, కరుణలతో నిండివుంటుందో, ఎవరి హృదయం కల్మష రహితమౌతుందో అతనే జ్ఞాని. కేవలం మాటలతోగాక, ఆచరణలో ధర్మాన్ని పాటించేవాడు, నిరంతరం అప్రమత్తుడై ధర్మాన్ని కాపాడేవాడే ధర్మాచరణ సంపన్నుడౌతాడు.


***సుగుణశీలసంపన్నుడు, విజ్ఞానవంతుడు, సహనశీలి, మృదుస్వభావి, కరుణామయుడు అయినవాడే భిక్షువు; కఠినమైన దేహదండన సాగించేవాడు కాదు. అతను కండలు పెంచటం కోసం ఆహారం తినకపోవచ్చు, కాని ఆకలి తీర్చుకోవటం కోసం, దేహపోషణ కోసం ఆహారం భుజిస్తాడు. అతను ఆభరణాలు, పూలదండలు, సువాసనా ద్రవ్యాలు వాడకపోవచ్చు, కాని పరిశుభ్రంగా వుంటాడు. అతని పసుపువస్త్రాలు ఖరీదైన మేలిమిరకం కాకపోవచ్చు, కాని అవి సభ్యతతో కూడి, శరీరానికి అనువుగా వుంటయ్. అతను గొప్ప భవనాల్లో నివసించనప్పటికీ, వాతావరణాన్నుండి రక్షణపొందే నిమిత్తం అవసరమైన|| నివాసాన్ని పొందుతాడు. అతను ఆటపాటలకు వినోదాలకు దూరంగా వున్నా, సమాజంతో తెగతెంపులు చేసుకోడు. జనావాసాలకు దూరంగా నివసిస్తున్నా, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో వుంటాడు. అతను విశ్రాంతజీవితం గడుపుతూనే, నిరంతరం ధర్మప్రచారం చేస్తుంటాడు. అతను సంపూర్ణమైన స్వేచ్ఛ కలిగివున్నా, విచ్చలవిడిగా ప్రవర్తించడు. అతను యితరులపై పెత్తనం కోరుకోడు, కాని తన మనసును, ప్రవర్తనను అదుపులో వుంచుకుంటాడు. అతను హక్కులను, అధికారాలను కోరడు, కాని సహచరుల పట్ల తన విధులను నిర్వహిస్తాడు. అతను తన ప్రజ్ఞాపాటవాల వల్ల గాక పవిత్రత, మైత్రి, కరుణ, విజ్ఞతల ద్వారా గౌరవాన్ని పొందుతాడు.


 *"బుద్ధ ధర్మసారం" పుస్తకం నుండి.*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు