*_గట్టివాడీ ఘట్టమనేని..!_*
*అక్కినేని నాగేశ్వరరావు*
అంటే భగ్నప్రేమికుడు..
మహాభక్తుడు..
దసరాబుల్లోడు...
మధ్య మధ్యలో ధర్మదాత..
దత్తపుత్రుడు..
కృష్ణార్జునయుధ్ధం..
ఇలా కొంత విభిన్న పాత్రలు పోషించినా మొత్తంగా
ఏఎన్నార్ అంటే
రొమాంటిక్ హీరో..
*శోభన్ బాబు..*
ఇద్దరు పెళ్ళాలు లేదా ప్రియురాళ్ళ మధ్య
నలిగే హీరో..
నవలా నాయకుడు..
నీటుగా టక్కు..
నల్ల కళ్ళద్దాలు..
సూటు..బూటు..
నడుమ నడుమ
ఖైదీబాబాయ్..
జగజ్జంత్రీలు..
మనుషులు మారాలి..
మానవుడు-దానవుడు..
సంపూర్ణరామాయణం..
వీటితో పాటు దేవాలయం వంటి ఓ ప్రయోగం..
ఇక *కృష్ణంరాజు*..
రౌద్రానికి ప్రతిరూపం..
రెబల్ స్టార్..
అవకాశం చిక్కినప్పుడు
మన ఊరి పాండవులు..
అమరదీపం..భక్త కన్నప్ప..
కృష్ణవేణి..కొంత వెరైటీ..
తెలుగు చిత్ర పరిశ్రమలో
అత్యంత విభిన్న పాత్రలు వేసింది మాత్రం
*నందమూరి తారకరామారావు..*
ఆయన చూడని జోనర్ లేదు..చూపించని వైవిధ్యం ఉండదు..ఆయనే కృష్ణుడు..
ఆయనే దుర్యోధనుడు.. ఆయనే రాముడు..
ఆయనే రావణుడు..
ఆయనే వేటగాడు..
ఆయనే డ్రైవర్ రాముడు..
కురూపి..వికలాంగుడు..
కోపిష్టి..త్యాగాలు చేసే అన్న..ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మహాగ్రంధం..
నందమూరి చరితం..!
ఇలాంటి విభిన్న వన్నెలు..
చిత్రమైన చిన్నెలు కల
నాయక శిఖరాల నడుమ
నెగ్గుకు వచ్చిన నటశేఖరం
*_సూపర్ స్టార్ కృష్ణ..!_*
నిజానికి కృష్ణ నట పరిధి తక్కువ..ఆయన ఆంగికం..అభినయం
అంత పరిపూర్ణమైనవి
కావు..ఆయన శరీర భాష
ఒక్కోసారి చిత్రంగా ఉంటుంది కూడా..
అందగాడే కాని రామారావు అంత కాదు..
అక్కినేని
అంతటి స్టైల్ ప్రదర్శించలేడు..
శోభన్ బాబులా మనోహరంగా కనిపించడు..
కృష్ణంరాజు వలె ఆరడుగుల
రౌద్రమూర్తి కాడు..!
అంతేకాదు..
అక్కినేని మాదిరి
కళ్ళతో శృంగారం ఒలకబోయలేడు..
కృష్ణంరాజు తరహాలో నయనాల్లో నిప్పులు కురిపించలేడు..
శోభన్ మాదిరి నవ్వులో
సమ్మోహనం కనిపించదు..
ఇక ఎన్టీఆర్ వలె నవరసాలు పలికంచగల
సామర్థ్యం కృష్ణకి లేవు..!
అయితే ఈ హీరోలు అందరి మధ్య తనకంటూ
ఓ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుని..అనుకరణ జోలికి పోకుండా..తనకు సరిపడే
పాత్రల్ని ఎన్నుకుని..తనకు మాత్రమే సాధ్యమయ్యే పాత్రలను అద్భుతంగా పోషించి తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న మేరునగం
ఘట్టమనేని కృష్ణ..!
తనకున్న పరిధిలో విస్తృత
ప్రతిభను కనబరుస్తూ నటనను మించి ప్రయోగాలు ప్రారంభించి విశేషమైన కీర్తితో
ఉన్నత శిఖరాలను అధిరోహించిన ధీరోదాత్తుడు *_సూపర్ స్టార్ కృష్ణ..!_*
చెయ్యని ప్రయోగం ఉందా..
ఎక్కని శిఖరం కలదా..
నటించని పాత్ర ఏది..
క్రైమ్..బాండ్..రైతు..
ఇంటి పెద్ద..ఘరానా దొంగ..
ఆ దొంగను పట్టే పోలీస్..
*జగత్ కిలాడీ..*
*అమాయకుడు..*
లోకం తెలియని *సాక్షి..*
పరాకాష్టగా విప్లవవీరుడు..
రాజకుమారుడు..
అర్జునుడు..ఇలా ఎన్ని చెప్పాలి..ఏది చేసినా
*నంబర్ 1..* డాన్సులు చేసి అప్పుడప్పుడూ ఇబ్బంది పడ్డ హీరో అయినా ఆయన ఐటెం సాంగ్ ఉంటే చాలు సక్సెస్ అనే లెవెల్ సాధించుకున్న నాయకుడు..!
కెరీర్ ప్రారంభంలో ఎన్నో *అగ్నిపరీక్ష* లు..
అక్కినేని..ఎన్టీఆర్..
కాంతారావు..హరనాథ్..
జగ్గయ్య వంటి దిగ్గజాలు
వీర విజృంభణలో ఉన్న వేళ ఎంట్రీ..తనతో పాటు అదే *తేనెమనససులు* సినిమాతో రంగ ప్రవేశం చేసిన రామ్మోహన్ దేవానంద్ లా ఉన్నాడని పేరు..
ఆ పోటీని దాటినా
మళ్లీ అదే రామ్మోహన్ తో *కన్నెమనసులు..*
ఈసారి కొంత వెటకారం..
ధైర్యంగా ఎదుర్కొని
మరో అడుగు ముందుకు వేసి ఇలాంటి పాత్రలను
మించి ఏదో చెయ్యాలని తపన..
*అమాయకుడు..* అంతకు మించిన వెర్రిబాగులోడిగా
*సాక్షి..* తీరని తృష్ణ..
అప్పుడు దొరికాడు *గూఢచారి 116*..
ఎక్కడికో వెళ్ళిపోయాడు కృష్ణ..ఒక కొత్త ఒరవడి..తెలుగు సినిమా అంతకు మునుపెన్నడూ చూడని ఓ తరహా..
ఈలోగా *జేమ్స్ బాండ్..*
తెలుగు హీరో ఎత్తిన మరో అవతారం..!
ఇలా సినిమాలు హిట్టవుతున్న దశలో *పండంటికాపురం* లో
అనుకోని వ్యక్తి ప్రవేశం..
కలతలు మొదలైనా
*కొడుకు దిద్దిన కాపురం*
అనిపించే వరకు ఆగకుండా
*గంగ..మంగ* ను *అక్కాచెల్లెళ్ళు* మాదిరి దగ్గర చేసిన
*భలే కృష్ణుడు..*
మొత్తానికి *మంచికుటుంబం* సెట్ చేసేసిన *అసాధ్యుడు..*
అదంతా ఓ
*మరపురాని కథ!*
*సాహసమే ఊపిరి..*
అన్న ఎన్టీఆర్ స్వరూపమే
మార్చి *దేవుడు చేసిన మనుషులు* భారీ ఎత్తున తీసి అంతటి అన్న మాటనే త్రోసి రాజన్న *అల్లూరి సీతారామరాజు..*
అక్కినేనితోనూ ఢీకొని
*దేవదాసు* మత్తులో మునిగాడు..అది అట్టర్ ప్లాపయినా తగ్గేదేలే
అంటూ తన సొంత దర్శకత్వంలో 70 ఎం ఎం
తీసేసి ఎక్కేసాడు సెల్యూలాయిడ్
*సింహాసనం..!*
కుటుంబ కథా చిత్రాల మూస దాటి *ఈనాడు*..తనలోని సీతారామరాజును మరోసారి
నిద్రలేపి *తెలుగు వీర లేవరా* అని కొత్త రాజుని చూపించిన 300 వ చిత్రం..
కృష్ణ జీవితంలో
మరో చైత్రం..!
ఏం చేసినా *సంప్రదాయం*
ఉట్టిపడాల్సిందే..ధైర్యం కనిపించాల్సిందే..
*సాహసమే ఊపిరి*
అదే ఆయన
*వజ్రాయుధం*
ప్రతి సినిమా *అంతం కాదు ఆరంభం* అన్నట్టే నటించే వారు..అన్ని సినిమాల్లో కొత్తదనం చూపించడానికి ప్రయత్నించే వ్యక్తి..
అగ్రహీరోలు అందరితో సినిమాలు చేసినా
ఎన్టీఆర్ తో *దేవుడు చేసిన మనుషులు..*
అక్కినేనితో *గురుశిష్యులు*
శోభన్ బాబుతో *మంచిమిత్రులు*..
కృష్ణంరాజుతో *విశ్వనాథ నాయకుడు*..
చిరంజీవి *తోడుదొంగలు*
బాలకృష్ణ *సుల్తాన్*..
నాగార్జునతో *వారసుడు..!* సూపరో సూపరు..!
కృష్ణతో చెయ్యని నటుడు లేడేమో.. నాగయ్య మొదలుకుని ఎస్వీఆర్..గుమ్మడి..
సత్యనారాయణ..
రావు గోపాలరావు..
మిక్కిలినేని..నాగభూషణం..
జగ్గయ్య.. మురళీమోహన్
అల్లు రామలింగయ్య..
పద్మనాభం,రాజబాబు..
మాడా ..కెవి చలం..
రమణారెడ్డి..
ముక్కామల..ధూళిపాళ.. కోట శ్రీనివాసరావు..
ఆయనతో
చెయ్యని వారేవరు..
ఆయన్ని ఇష్టపడని
మనిషి ఎక్కడ..
నాయకులకు మిత్రుడు..
నాయికలకు ఇష్టుడు..
పెద్దలకు చిన్నవాడు ..
చిన్నలకు పెద్దవాడు..
అందరికీ నచ్చిన వాడు..
నిర్మాతలకు కొంగు బంగారం..బాలుకి సన్నిహితుడు..రాజా సీతారాంకి దేవుడు..
తెలుగు ప్రజలకు నటశేఖర..ఎప్పటికీ హృదయాల్లో నిలిచి ఉండిపోయే కృష్ణ..
ఎనభై దాటాక కూడా నాయకుడే..
జీరో అనే పదానికి అర్థమే తెలియని హీరో..
ఘట్టమనేని కృష్ణ..
సూపర్ స్టార్..
సూపర్ ప్రొడ్యూసర్..
డేరింగ్ అండ్ డాషింగ్ మ్యాన్..!
ఎందరో హీరోలు..
ఇంకెందరో నటులు..
మరెందరో నిర్మాతలు..
మరింకెందరో దర్శకులు..
ఈ అందరిలో కృష్ణ ప్రత్యేకం..!
కారణం..ఆయన సాహసం..
తెలుగు సినిమా స్టామినా
పెంచింది ఆయనే..
సాంకేతికత పరిచయం చేసిందీ ఆయనే..
తొలి పాన్ ఇండియా సినిమా తీసిందీ ఆయనే..
నిజానికి ఆయనే ఇండస్ట్రీ..
He is not only a
reel HERO..
*But a real HERO too..!*
***********************
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
విజయనగరం
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box