పంచె కడితే విలన్ సూటు తొడిగితే బ్యాడ్ మాన్!


 పంచె కడితే విలన్
సూటు తొడిగితే 
బ్యాడ్ మాన్!

________

విలక్షణ నటుడు నాగభూషణం జయంతి నేడు..(19.04.1921)

________


సురేష్..9948546286


ఒక్కన్నే నమ్ముకున్నది సాని..

పది మందికి అమ్ముకున్నది సంసారి..

కళ్యాణమండపంలో 

ఈ డైలాగ్ బాంబులా పేలింది..


రాజకీయ నాయకుడు అన్నం లేకపోయినా ఉండగలడు..

నిద్ర లేకపోయినా బ్రతికేస్తాడు..

చివరికి పెళ్ళాం పక్కింటోడితో

లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా తట్టుకుంటాడు..

కాని పదవి లేకపోతే బ్రతకలేడు..

అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ

అదిరిపోయే ఈ డైలాగ్ ప్రజానాయకుడు సినిమాలో ఊపేసింది..


గుడ్డి దానివి నిన్ను చేసుకున్నాను చూడు..

నేనే ఒరిజినల్ త్యాగిని...

మంచిమనసులు సినిమాలో ఈ డైలాగ్ విపరీతంగా పండింది..


కాళ్లూ..చేతులూ..

వణికిపోతూ చెల్లెలికాపురంలో స్టేజి మీద చెప్పిన ఈ కవిత

చరణకింకిణులు ఘల్లుఘల్లుమన.. 

కరకంకణములు

గలగలలాడగా..

వంటి అపురూప గీతానికి

నాంది పలికింది..


చరిత్ర అడక్కు..

చెప్పింది విను..

అడవిరాముడు సినిమాలో

ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా హాల్లో నవ్వులే..


ఈ డవిలాగులన్నీ పలికి రక్తి కట్టించిన ఒకే నటుడు..

రక్తకన్నీరు నాగభూషణం..


పంచికట్టు భూషయ్య..

సూటు తొడిగిన జస్టిస్ రాజారావు(ఆత్మీయులు)..

కవిత్వం రాకపోయినా మిత్రుడి రచనలు అచ్చేయించేసి కవిగా చలామణీ అయిపోయే శ్రీరామ్(చెల్లెలికాపురం)

పౌరాణికంలో శివుడు...

సాత్యకి..శకుని..

ఇలా పాత్ర ఏదైనా మెప్పించిన ప్రజానటుడు

నాగభూషణం..ఎన్ని సినిమాలో..ఎన్నెన్ని పాత్రలో..అన్నీ విలక్షణమైనవే..ఒకేలాంటి పాత్రలైనా పోషణలో వైవిధ్యం..ఆయనకే చెల్లిన ఒక స్టైల్..డైలాగ్ డెలివరీలో ప్రత్యేకత..మేక వన్నె పులి..

విషం కక్కే పాము..కుట్రలు చేసే రాజకీయ నాయకుడు..

గ్రామాన్నంతటినీ గుప్పెట్లో పెట్టుకునేందుకు ఏమైనా చేసే..చివరకు అన్నదమ్ముల నైనా విడగొట్టేందుకు 

వెనకాడని బుల్లయ్య(దసరాబుల్లోడు)..

అనుకున్నది సాధించేందుకు

దేనికైనా సిద్ధపడే దయానందం(కథానాయకుడు)..

తన సొంత మేనకోడలు

ప్రాణాలు అడ్డుపెట్టుకుని అమాయక గౌరి శీలం దోచుకునే రాజా(మూగమనసులు)..

పాత్ర ఏదైనా విజృంభించి నటించడమే నాగభూషణం నేర్చిన విద్య.నాటకాల్లో అయినా..సినిమాల్లో అయినా..అదే వరస..

డైలాగ్ డెలివరీలో ఒక ప్రత్యేక ఒరవడి..ఎం ఆర్ రాధా పలికినట్టే పలికి అలా కూడా సక్సెస్ అయ్యాడు..

దీనికి పరాకాష్ట మంచిమనసులు సినిమాలో కుమార్ పాత్ర..ఒక పక్క కన్న

తండ్రి రమణారెడ్డిని..

భార్య వాసంతిని కాల్చుకు తినే పాత్రలో నాగభూషణం అభినయం అద్భుతం..

దసరాబుల్లోడు..

బంగారుబాబు..

విచిత్రకుటుంబం..

అడవిరాముడు..

హీరో ఎవరైనా నాగభూషణం

ఉంటే చాలు విలనీ సూపరే..ముఖ్యంగా పంచెకట్టు రాజకీయ నాయకుడు,గ్రామ పెద్ద..గుంట నక్క..ఇలాంటి పాత్రలకు పెట్టింది పేరు..

        ఇక రక్తకన్నీరు నాటకం నాగభూషణం పేటెంట్..తమిళంలో ఎం ఆర్ రాధా బాగా సక్సెస్ అయిన ఈ నాటకాన్ని ప్రత్యేకంగా తెలుగులో రాయించుకుని 

ఎన్ని వేల సార్లు ప్రదర్శించారో

ఈ మహానటుడు..ఒక్క రోజునే రెండు ప్రదర్శనలు ఇచ్చిన సందర్భం కూడా ఉంది..ఆయన సినిమాల్లో వేసినప్పుడు కూడా ఆ పాత్ర ప్రభావం ఎంతో కొంత ఆయన అభినయంపై కనిపిస్తుందంటే

ఆ పాత్రతో ఆయన ఎంతగా మమేకం అయిపోయారో

అర్థం చేసుకోవచ్చు..ఆ పాత్ర పోషణే ఆయనను చిరంజీవిగా మిగిల్చింది..

       మొత్తానికి విలనీకి

నాగభూషణం ఒక బెంచి మార్కు..ఒక తరానికి సీఎస్సార్..మరో తరానికి

రావు గోపాలరావు..ఇంకో తరానికి కోట శ్రీనివాసరావు..

ఈ అన్ని తరాలకు నాగభూషణం..

     విలన్ గా మాత్రమే కాదు..కారెక్టర్ యాక్టర్..

హాస్య నటన..కామెడీ విలనీ..అన్నిటినీ మించి హీరోతో దెబ్బలు తినని

దుర్మార్గపు బ్యాచ్..

పూర్తిగా కుళ్లు కుతంత్రాలు..

టూత్ బ్రష్ మీసాలు..

పోకిరీ వేషాలు..

హీరోలకు మీనమేషాలు..

వెరసి నాగభూషణం..

గుమ్మడి..ఎస్వీఆర్..

పెరుమాళ్లు..మిక్కిలినేని...

వంటి మంచోళ్ళపై

ఎక్కుపెట్టిన దుర్మార్గబాణం!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు